నరసరావుపేట లోక్‌సభ బరిలో అనిల్ యాదవ్!
ABN , Publish Date - Jan 26 , 2024 | 03:12 AM
మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ నరసరావుపేట లోక్‌సభ స్థానంలో వైసీపీ తరఫున బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు సిటీలో గెలిచే చాన్సు లేదనే!!
అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ నరసరావుపేట లోక్‌సభ స్థానంలో వైసీపీ తరఫున బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ గురువారం ఆయన్ను తాడేపల్లి ప్యాలె్‌సకు పిలిపించారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానంలో అనిల్‌కుమార్ గెలిచే పరిస్థితి లేదని.. అందుచేత నరసరావుపేట ఎంపీగా పోటీచేయాలని ప్రతిపాదన తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీగా పోటీపై ఆయన ఇంకా స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. ఇక్కడ నుంచి నాగార్జున యాదవ్ పోటీ చేయించాలనుకున్నా ఆ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి.. లావుకు మద్దతిచ్చారు. అయితే, నాగార్జున యాదవ్ స్థానంలో... మంగళగిరి పరిధిలోని వెంకటరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రియల్టర్ మధు యాదవ్ పేరును పరిశీలించారు. ఆయనకు సీఎంవో నుంచి పిలుపు కూడా అందింది. రూ.20 కోట్లు ఖర్చుపెట్టుకుంటే చాలని చెప్పారని అంటున్నారు. రూ.180 కోట్ల దాకా డిపాజిట్ చేయాలని కొందరు సిటింగ్ ఎంపీలను ఒత్తిడిచేస్తున్న వైసీపీ పెద్దలు.. నరసరావుపేట విషయంలో రూ.20 కోట్లకే తలొగ్గడం చర్చనీయాంశమైంది. అయితే.. ఈ ప్రయత్నం కూడా ఫలించలేదని.. పోటీకి మధు యాదవ్ ఆసక్తి చూపలేదని తెలిసింది. వాస్తవానికి నిన్నమొన్నటిదాకా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు బలమైన అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారన్న వైసీసీ పెద్దలు.. ఇప్పుడు కొత్త ముఖాలను వెతుకుతుండడం గమనార్హం.