Share News

స్వర్ణాంధ్ర విజన్‌తో ‘వృద్ధి’

ABN , Publish Date - Dec 12 , 2024 | 03:31 AM

దేశవాప్తంగా వృద్ధి రేటు మందగమనంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనికి తగినట్టుగానే రాష్ట్రంలో కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు కొంతమేరకు తగ్గిందని తెలిపింది.

స్వర్ణాంధ్ర విజన్‌తో ‘వృద్ధి’

మందగమనంలో ఉన్న వృద్ధి రేటుకు జవసత్వాలు

ఏటా 15 శాతం పైపైకి

పది కీలక సూత్రాలతో జిల్లా స్థాయిలో కార్యాచరణ

వ్యవసాయ వృద్ధిలో ఏలూరు..

పరిశ్రమలు, సేవల్లో విశాఖ ఫస్ట్‌

అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): దేశవాప్తంగా వృద్ధి రేటు మందగమనంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనికి తగినట్టుగానే రాష్ట్రంలో కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు కొంతమేరకు తగ్గిందని తెలిపింది. అయితే, స్వర్ణాంధ్ర విజన్‌-2047తో వృద్ధి రేటుకు జవసత్వాలు అందించి పుంజుకునేలా చేయవచ్చని పేర్కొంది. 2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ నెంబర్‌1గా నిలిపేందుకు రూపొందించిన 10 సూత్రాలతో ఏటా 15 శాతం వృద్ధి సాధ్యపడుతుందని తెలిపింది. ఈ మేరకు కలెక్టర్ల సదస్సులో వృద్ధిరేటుకు సంబంధించిన పలు అంశాలను వివరించింది.

2014-19లో వృద్ధిరేటు 13.5 శాతం నమోదు కాగా, 2019-24లో అది 10.59 శాతానికి క్షీణించింది. 2024-25 మొదటి త్రైమాసికంలో 9.55 శాతం, రెండో త్రైమాసికంలో 8.75 శాతంగా నమోదైంది. ఇది జాతీయసగటు కంటే ఎక్కువ. అయితే, దేశవాప్తంగా వృద్ధిరేటు మందగమనంలో ఉంది.

2023-24లో జీఎ్‌సడీపీని రూ.14.4 లక్షల కోట్లుగా అంచనా వేశారు. వ్యవసాయ రంగం వాటా 34.14 శాతం, పారిశ్రామిక రంగం వాటా 25.69 శాతం, సేవారంగం వాటా 40.16 శాతంగా ఉన్నాయి.

ఏటా 15 శాతం కంటే ఎక్కువ వృద్ధిరేటు సాధించే లక్ష్యంగా 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్‌-2047ను రూపొందించినట్టు ప్రభుత్వం తెలిపింది.

ప్రతి జిల్లాకు ఐదేళ్ల విజన్‌ కార్యాచరణ ప్రణాళిక. సమ్మిళిత వృద్ధిని వేగవంతం చేసే ప్రాజెక్టులు.

విజన్‌ సూత్రాల అమలు, పర్యవేక్షణకు జిల్లాస్థాయిలో విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట ఏర్పాటు.

నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, నీటి సంరక్షణ, వ్యవసాయరంగం బలోపేతం, మెరుగైన రవాణా, చౌకధరలకే ఇంధనం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛభారత్‌, డీప్‌ టెక్నాలజీ అనే 10 సూత్రాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక.

2028-29 నాటికి వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిరేటు 11.05 శాతం, పారిశ్రామికరంగం వృద్ధి 16.15 శాతం, సేవారంగం వృద్ధి రేటు 17.95 శాతానికి చేర్చడం ద్వారా మొత్తం రాష్ట్ర వృద్ధిరేటు 15.27 శాతానికి చేరుతుందని అంచనా.

2028-29 నాటికి జిల్లాల స్థూల ఉత్పత్తి రూ.29,29,206 కోట్లకు చేరుతుందని అంచనా.


వ్యవసాయంలో ఏలూరు ఫస్ట్‌

2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వృద్ధిలో ఏలూరు జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యవసాయ రంగ వృద్ధిలో ఈ జిల్లా వాటా 9.87 శాతంగా నమోదుకాగా, స్థూల విలువ(జీవీఏ) రూ.42,249 కోట్లుగా నమోదైంది. ఇక, రూ.32,372 కోట్ల జీవీఏతో 7.56 శాతం వాటాతో కృష్ణా జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రూ.3,569 కోట్ల జీవీఏతో 0.83 శాతం వాటాతో విశాఖ చిట్టచివరి స్థానంలో ఉంది. పారిశ్రామిక, సేవా రంగాల్లో మాత్రం విశాఖజిల్లా తొలిస్థానంలో నిలిచింది. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిరేటులో రూ.59,264 కోట్ల జీవీఏతో, 18.82 శాతం వాటాను విశాఖ అందించింది. పారిశ్రామిక రంగంలో తిరుపతి రెండోస్థానంలో ఉండగా, అల్లూరి సీతారామరాజు జిల్లా చివరిస్థానంలో ఉంది. సేవారంగ వృద్ధిరేటులో రూ.49,131 కోట్ల జీవీఏతో, 10.22 శాతం వాటాతో విశాఖపట్నం తొలిస్థానంలో ఉంది. సేవారంగంలో ఎన్టీఆర్‌ జిల్లా రెండోస్థానం సాధించగా, అ ల్లూరి సీతారామరాజు జిల్లా చివరిస్థానంలో ఉంది.

బీపీఎల్‌ దిగువన 22 లక్షల మంది రాష్ట్ర జనాభాలో 4 శాతం మంది అంటే 22 లక్షల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ వెల్లడించారు. నీతిఆయోగ్‌ మార్గదర్శకాల ప్రకారం పేదల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించనున్నట్టు తెలిపారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కలెక్టర్ల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, స్వర్ణాంధ్ర-2047 అంశాలను వివరించారు. జీరో పావర్టీ, పీ-4 మోడల్‌, డెమోగ్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలపై తీసుకున్న నిర్ణయాలను వివరించారు. జీఎ్‌సడీపీ 2014-19 మధ్యకాలంలో 13.50శాతం ఉంటే 2019-24 మధ్య 10.59 శాతానికి పడిపోయిందన్నారు. స్వర్ణాంధ్ర-2047 మైలురాయి సాధించడానికి 15 శాతం వార్షికవృద్ధిని సాధించడం తప్పనిసరి అని అన్నారు.

Updated Date - Dec 12 , 2024 | 03:31 AM