ఇక ప్రక్షాళనే!
ABN , Publish Date - Sep 21 , 2024 | 04:04 AM
పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో సిబ్బంది చేతివాటంపై శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం కలకలం రేపింది.
కలకలం రేపిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం
పీఆర్ కమిషనరేట్‌లో సిబ్బంది చేతివాటంపై చర్చ
సమగ్ర విచారణకు ఆదేశించిన డైరెక్టర్ కృష్ణతేజ
అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో సిబ్బంది చేతివాటంపై శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉద్యోగులు, అధికారులు ఈ కథనాన్ని వాట్సా్‌పలలో సర్క్యులేట్ చేస్తూ హడావుడి చేశారు. గత నాలుగేళ్లుగా అవినీతి సిబ్బంది ఆగడాలను భరించలేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు.. ఈ వార్తతో ఏదైనా స్పందన వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఈ వార్త చదివిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ కృష్ణతేజ వెంటనే స్పందించినట్లు సమాచారం. ఈ కథనంలోని ప్రతి అంశంపైనా సమగ్రమైన విచారణ చేసి సిబ్బందిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. బదిలీల కోసం వచ్చిన అధికారుల నుంచి కమిషనరేట్ సిబ్బంది భారీగా ముడుపులు స్వీకరించడం, దరఖాస్తు చేసుకున్న అధికారుల సమాచారం తెలుసుకుని వారికి ఫోన్లు చేసి రూ.లక్షలు గుంజుకోవడం తదితర విషయాలపై ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలోని పలువురు అధికారులు.. రాష్ట్ర నలుమూలల నుంచి కమిషనరేట్‌కు వచ్చిన వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కొంత మంది మహిళా అధికారులు వారిని పురుగులు చూసినట్లు చూసి అసహనం ప్రదర్శిస్తున్నారని పలువురు డైరెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తోటి ఉద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, సమాధానం సరిగా చెప్పకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు వ్యాఖ్యానించినట్లు సమాచారం. అత్యంత సౌమ్యుడైన డైరెక్టర్ తన కార్యాలయ పరిధిలో ప్రతి ఉద్యోగి పట్ల ఎంతో ఆప్యాయంగా, గౌరవంగా ఉంటారు. ఇలాంటి కార్యాలయంలో మర్యాదలు తెలియని సిబ్బంది, అధికారులు పనిచేయడం ఇబ్బందిగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. కమిషరేట్ సిబ్బంది ప్రవర్తనపై పూర్తిగా అధ్యయనం చేసి సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.