Share News

తాడిపత్రిలో అరాచకాలు..ఏఎస్పీ, సీఐలపై వేటు!

ABN , Publish Date - May 27 , 2024 | 04:22 AM

ఎన్నికల పోలింగ్‌ తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ శ్రేణులు సాగించిన అరాచకాలకు సహకరించిన పోలీసులపై పోలీసు ఉన్నతాధికారులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు.

తాడిపత్రిలో అరాచకాలు..ఏఎస్పీ, సీఐలపై వేటు!

డీఐజీ, ఎస్పీలకు సరెండర్‌ చేసిన ఉన్నతాధికారులు

అనంత జిల్లాలో ఒకేరోజు 159 మందిపై రౌడీషీట్‌

అనంతపురం క్రైం, మే 26: ఎన్నికల పోలింగ్‌ తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ శ్రేణులు సాగించిన అరాచకాలకు సహకరించిన పోలీసులపై పోలీసు ఉన్నతాధికారులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్‌ ఏఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్బీ) సీఐ జాకీర్‌ హుస్సేన్‌పై ఆదివారం వేటువేశారు. అనంతపురం రేంజ్‌ డీఐజీకి ఏఎస్పీని, జిల్లా ఎస్పీకి సీఐని సరెండర్‌ చేశారు. వారిద్దరినీ డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలివ్వడం సంచలనం రేపింది. తాడిపత్రి అల్లర్ల విషయంలో ఎస్బీ సీఐ జాకీర్‌ హుస్సేన్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పోలింగ్‌ అనంతరం రాజంపేట నుంచి తాడిపత్రికి వచ్చిన డీఎస్పీ చైతన్య టీడీపీ నేతలు, కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. ఆయన్ను తాడిపత్రికి రప్పించడంలో హుస్సేన్‌ పాత్ర ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. డీఎస్పీ చైతన్య గతంలో తాడిపత్రిలో వ్యవహరించిన తీరు, వివాదాలపై జిల్లా ఎస్పీ, డీఐజీలకు నివేదిక ఇవ్వకుండా హుస్సేన్‌ తప్పుదోవ పట్టించారని విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఆయన్ను జిల్లా ఎస్పీ గౌతమి శాలికి సరెండర్‌ చేస్తూ, డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చారు. కాగా.. అనంతపురం జిల్లాలో ఆదివారం ఒకే రోజు మొత్తం 159 మందిపై రౌడీషీట్‌ తెరవడం కలకలం రేపింది. పోలింగ్‌ రోజున తలెత్తిన ఘటనలను ఎస్పీ సీరియ్‌సగా తీసుకున్నారు. ఘర్షణల్లో పాల్గొన్న వారిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేయాలని ఆదేశించారు. తాడిపత్రి గొడవలకు సంబంధించి 106 మందిపై, యాడికిలో 37 మందిపై, పెద్దవడుగూరు మండలం దిమ్మగుడిలో ఏడుగురిపై, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 9 మందిపై రౌడీషీట్లు తెరిచారు.

Updated Date - May 27 , 2024 | 04:22 AM