Share News

అనంతబాబూ.. గో బ్యాక్‌

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:34 AM

దళిత డ్రైవర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి నిరసన సెగ తగిలింది.

అనంతబాబూ.. గో బ్యాక్‌

వైసీపీ ఎమ్మెల్సీకి మరోసారి నిరసన సెగ

గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న గిరిజనులు

వైసీపీ ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు

న్యాయం చేయలేదని ఆందోళన

వారిపై తుపాకీ మడమతో పోలీసుల దాడి

ఇద్దరు గిరిజన యువకులకు గాయాలు

కూనవరం, ఏప్రిల్‌ 6: దళిత డ్రైవర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి నిరసన సెగ తగిలింది. తమ గ్రామంలోకి రావద్దంటూ గిరిజన యువకులు ఆయన్ను అడ్డుకున్నారు. శనివారం అల్లూరి జిల్లా కూనవరం మండలంలో అనంతబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కూటూరు గ్రామ పర్యటనకు అనంతబాబు రాత్రి సమయంలో వెళ్లగా గిరిజన యువకులు అడ్డుకున్నారు. ‘అనంతబాబు గో బ్యాక్‌’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజన యువకులకు, అనంతబాబు వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసిందని, పోలవరం నిర్వాసితులుగా తాము అన్నీ నష్టపోతున్నా పట్టించుకోలేదన్నారు. గిరిజనులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలవలేదంటూ అనంతబాబుతో వాగ్వాదానికి దిగారు. ఏటా వరదలు వస్తున్నాయని, తరచూ ముంపునకు గురవుతున్నా గిరిజనులను పట్టించుకోవడంలేదన్నారు. గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తక్షణమే అనంతబాబు గ్రామం విడిచి వెళ్లిపోవాలంటూ పట్టుబట్టారు. అనంతబాబు గ్రామంలోకి అడుగుపెట్టకుండా గిరిజన యువకులు వలయంగా ఏర్పడటంతో పోలీసులు వారిపై దాడి చేశారు. మిడియం రాము అనే యువకుడి తలపై తుపాకీ మడమతో కొట్టడంతో తీవ్ర గాయమైంది. మరో యువకుడు సోడె వినోద్‌కు తుపాకీ మడమతో కొట్టడంతో వీపుపై బలమైన గాయమైంది. గ్రామస్థులు గాయాలపాలైన వారిని కోతులగుట్ట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమకు న్యాయం జరగలేదని ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టించడమేంటని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. డీజీపీ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా ఇటీవల కాకినాడ జిల్లాలో అనంతబాబును దళితులు అడ్డుకున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 03:34 AM