Share News

దేశంలో అమృత ఘడియలు.. రాష్ట్రంలో విష ఘడియలు

ABN , Publish Date - May 07 , 2024 | 04:46 AM

ప్రధాని నరేంద్ర మోదీ న్యాయకత్వంలో భారత దేశమంతా అమృత ఘడియలు కొనసాగుతుంటే...

దేశంలో అమృత ఘడియలు.. రాష్ట్రంలో విష ఘడియలు

ఏపీలో ఎటుచూసినా దోపిడీలు, స్కామ్‌లే

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం

రాజమహేంద్రి సభలో జనసేనాని పవన్‌

రాజమహేంద్రవరం సిటీ, మే 6: ప్రధాని నరేంద్ర మోదీ న్యాయకత్వంలో భారత దేశమంతా అమృత ఘడియలు కొనసాగుతుంటే... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వైసీపీ పాలనలో విష ఘడియలు సాగుతున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో సోమవారం జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల సభ ప్రజాగళంలో ప్రధాని మోదీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎటుచూసినా ఇసుక, మట్టి దోపిడీ, స్కాములే కనిపిస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ తమ కూటమిని ముందుండి నడిపిస్తే తప్ప ఈ దోపిడీలు ఆగవన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం నిస్వార్థంగా మీ వెంట నడుస్తామని అడగగానే.. ఆశీస్సులు అందించిన మోదీకి ఏపీ ప్రజానీకం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని అమృత ఘడియలవైపు తీసుకువెళ్లేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమంటూ ఆర్టికల్‌ 370ని రద్దుచేసిన బలమైన నాయకుడు మోదీ అని, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో సగర్వంగా నిలబెట్టే వ్యక్తి ఆయనని కొనియాడారు. గుంటూరు శేషేంద్ర కవిత చదువుంటే తనకు మోదీయే గుర్తుకువస్తారన్నారు.


కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్‌ పేరు

కేంద్ర ప్రభుత్వం ప్రజలకందిస్తున్న పథకాలకు జగన్‌ తన పేరు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడని పవన్‌ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి పసల్‌ బీమా పథకాన్ని వైఎ్‌సఆర్‌ బీమాగా మార్చి ప్రీమియం చెల్లించకుండా రైతుల్ని ముంచారన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. ప్రధాని కేంద్రం నుంచి మధ్యాహ్న ఉచిత భోజనం ఇస్తుంటే.. దాన్ని వైఎ్‌సఆర్‌ సంపూర్ణ పోషణ కింద మార్చుకున్నారని అన్నారు. మిషన్‌ వాత్సాలయ, శక్తి పథకాలను జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు అంటూ రాష్ట్ర ప్రథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను ఇళ్లకు మళ్లించడంతోపాటు పేదల గృహనిర్మాణానికి కేంద్రం ఇస్తున్న రూ.1.80 లక్షలతో ఇళ్లు కట్టించి జగనన్న కాలనీలుగా పేరు పెట్టుకున్నారని అన్నారు.

మన కళాకారులను మోదీ గుర్తించారు

దేశంలో పద్మశ్రీ అవార్డులు అంటేనే రాజకీయం చేసే పరిస్థితి ఉండేదని, కానీ.. ప్రధానిగా మోదీ వచ్చాక సమూల మార్పులు చేశారని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఇప్పటివరకు ఎవరూ గుర్తించని గొప్ప గొప్ప వ్యక్తులను, కళాకారులను, సంఘ సేవకులను మోదీ గుర్తించారన్నారు. విమాన ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి స్వదేశంలో సేవలందిస్తున్న మన ప్రాంత డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ను, 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఏటికొప్పాక బొమ్మల కళని ముందుకు తీసుకెళుతున్న సీవీ రాజును, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 33 ఆర్కిడ్స్‌ జాతులను ప్రపంచానికి తెలియజేసిన శాస్త్రవేత్త అబ్బారెడ్డి నాగేశ్వరరావులను గుర్తించి పద్మశ్రీ ఇచ్చారన్నారు. హరికథల కళాకారులు సచ్చిదానందశాస్త్రిని, తొలుబొమ్మలాట కళాకారులు దళువాయి చలపతిరావును, పోలియో బాధితులకు 10 లక్షలకు పైగా ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణ, స్తపతి వేలు ఆనందాచారి, కిన్నెర మొగిలయ్య లాంటి కళాకారులను, వైద్యులను గుర్తించి దక్షిణాదికి 135 పద్మ అవార్డులు అందించిన నాయకుడు మోదీ అని గుర్తుచేశారు.

Updated Date - May 07 , 2024 | 04:46 AM