Share News

అమిగోస్‌ ఆటకట్టు!

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:12 AM

జగన్‌ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అనంతపురం జిల్లాలో ఖనిజ సంపదను దోచుకున్న అమిగోస్‌ మినరల్స్‌ ప్రైవేటు సంస్థ, ప్రభుత్వం మారగానే కీలక ఫైళ్లు దాచేసే ప్రయత్నంలో పడింది.

అమిగోస్‌ ఆటకట్టు!

కీలక ఫైల్స్‌ మాయానికి విఫలయత్నం

అనంత నుంచి తరలింపునకు వాహనాలు

అడ్డుకున్న మైనింగ్‌ అధికారులు

పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడే అమిగోస్‌ ఎండీ

మైనింగ్‌ కంపెనీల నుంచి రాయల్టీ వసూలు

కాంట్రాక్టును కట్టబెట్టిన జగన్‌ ప్రభుత్వం

72 చెక్‌పోస్టులు పెట్టి దోచేసిన అమిగోస్‌..

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన్‌ 11: జగన్‌ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అనంతపురం జిల్లాలో ఖనిజ సంపదను దోచుకున్న అమిగోస్‌ మినరల్స్‌ ప్రైవేటు సంస్థ, ప్రభుత్వం మారగానే కీలక ఫైళ్లు దాచేసే ప్రయత్నంలో పడింది. అనంతపురం నగరంలోని తమ కార్యాలయంలో నుంచి ముఖ్యమైన డేటాను మాయం చేయాలని చూస్తోంది. ఫైళ్లను కార్యాలయం నుంచి తరలించేందుకు మంగళవారం ప్రయత్నించగా, మైన్స్‌ అధికారులు అడ్డుకున్నారు. తిరుపతికి చెందిన అమిగోస్‌ సంస్థ ఎండీ ప్రసాద్‌ రెడ్డి..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు, వైసీపీ అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జి. అనంతపురం జిల్లావ్యాప్తంగా మైనింగ్‌ కంపెనీలుఉన్నాయి. ఆ కంపెనీల రాయల్టీలు వసూలు చేసి ఏటా ప్రభుత్వానికి రూ.260 కోట్లు వసూలుచేసి పెట్టే కాంట్రాక్టును అమిగో్‌సకు జగన్‌ సర్కారు కట్టబెట్టింది. అయితే, 72 చెక్‌పోస్టులు పెట్టి పరిమితికిమించి పన్నుల వసూళ్ల ద్వారా అమిగోస్‌ ప్రతినిధులు గత ప్రభుత్వం కోట్లు వెనుకేసుకున్నారు. ప్రభుత్వం మారగానే ఇప్పుడు చల్లగా సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే అమిగోస్‌ సంస్థ ఎండీ ప్రసాదరెడ్డి, ముఖ్య అధికారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. ప్రసాద్‌రెడ్డి తమకు అందుబాటులోకి రావడం లేదని మైనింగ్‌ శాఖ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అమిగోస్‌ కార్యాలయంలోని ముఖ్యమైన ఫైల్స్‌ను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే, ఏ ఒక్క ఫైల్‌నూ తరలించేందుకు ఒప్పుకొనేది లేదని మైన్స్‌ అధికారులు హెచ్చరించడంతో, ఆ ప్రయత్నం విరమించుకున్నారు.

ఫైళ్లన్నీ ప్రభుత్వానికి అందజేయాల్సిందే..

‘‘అమిగోస్‌ కార్యాలయంలోని ఫైళ్లన్నింటినీ ప్రభుత్వానికి అందజేయాల్సిందే. ఏ ఒక్క ఫైల్‌ను కూడా తీసుకెళ్లనీయకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఫైల్స్‌ మాకు ఆ సంస్థ స్వాధీనం చేయాలి. వాటిని ఎక్కడికీ తరలించకుండా మా సిబ్బంది చూసుకుంటారు. ఇందులో ఎవరి జోక్యానికీ తావులేదు’’

- రామకృష్ణ ప్రసాద్‌, మైన్స్‌ ఇన్‌చార్జి ఏడీ, అనంతపురం

Updated Date - Jun 12 , 2024 | 03:12 AM