అమరావతి అజరామరం
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:25 AM
ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి ఇక మంచి రోజులే! ఐదేళ్ల చీకటిని చీల్చుకుంటూ చంద్రబాబు వచ్చేశారు. ఐదేళ్ల క్రితం పట్టిన గ్రహణం వీడిపోయి, ప్రజా రాజధాని తిరిగి ప్రాణం పోసుకోనుంది.

ముక్కచెక్కలైన మూడు ముక్కలు
నాడు యజ్ఞంలా రాజధాని నిర్మాణం
భూములిచ్చి భాగస్వాములైన రైతులు
యంత్రధ్వనుల్లో వినిపించిన అభివృద్ధి నినాదం
కానీ, విధ్వంసమే ఎజెండాగా జగన్ పాలన
అమరావతి ఉనికికే ముప్పుతెచ్చేలా మూడు రాజధానుల తీర్మానం
దగా, మోసం, విధ్వంసంపై తిరగబడ్డ రైతులు
చరిత్రకెక్కిన మహిళా ఉద్యమం..మహా పాదయాత్ర
ఫలించిన త్యాగమూర్తుల ఆశయం
(గుంటూరు - ఆంధ్రజ్యోతి)
ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి ఇక మంచి రోజులే! ఐదేళ్ల చీకటిని చీల్చుకుంటూ చంద్రబాబు వచ్చేశారు. ఐదేళ్ల క్రితం పట్టిన గ్రహణం వీడిపోయి, ప్రజా రాజధాని తిరిగి ప్రాణం పోసుకోనుంది. అమరావతిని కమ్మేసిన కారుమబ్బులు వీడిపోయి, రాజధాని గ్రామాలు మళ్లీ కళకళలాడనున్నాయి. ఇక నవ రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభమవుతుంది. ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులు మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. నిజానికి, 2023 చివరినాటికే రాజధాని గ్రామాల్లో ఊహించని మార్పు వచ్చింది. ప్రభుత్వం మారబోతోందన్న వాతావరణం మొదట అమరావతిలోనే కనిపించడం మొదలైంది. దాన్ని బలపరిచేలా రాజధానిలో కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో పడిపోయిన భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. గత టీడీపీ హయాంలో గజం రూ.25 నుంచి 35 వేల వరకూ ఉన్న రైతుల రిటర్నబుల్ ప్లాట్ల ధరలు వైసీపీ పాలనలో రూ. ఎనిమిది వేలకు పడి పోయాయి. అవి ఆరు నెలల క్రితం తిరిగి రూ.20 వేలు నుంచి 25 వేలకు చేరాయి. జరుగుతున్న ఈ మార్పులను టీడీపీ అధినేత చంద్రబాబు, జన సేనాని పవన్ కల్యాణ్ స్వయంగా గుర్తించారు. ఈ ఏడాది జనవరి 13న రాజధానిలోని మందడం గ్రామంలో భోగిపండుగను రైతులతో కలిసి వారు జరుపుకొన్నారు. మరో 86 రోజుల్లో ప్రజా ప్రభుత్వం రాబోతోందని, ప్రజా రాజధాని అమరావతి నుంచే ప్రజాపాలన మొదలు కాబోతోందని ఆనాడే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. వచ్చే సంక్రాంతి వేడుకలు అధికారికంగా రాజధానిలో రైతులతో జరుపుకోబోతున్నామని కూడా చెప్పారు. అదే నిజం కావడంతో రాజధాని గ్రామాల్లో మంగళవారం అంతటా ఉత్సాహ వాతావరణం కనిపించింది.
రాజధాని సమరం..
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసిన 2019 డిసెంబరు 17న మొదలైన అమరావతి పోరాటం నేటి వరకూ నిర్విరామంగా సాగుతోంది. తరతరాలుగా వారసత్వ సంపదగా వచ్చిన 34 వేల ఎకరాల పంట పొలాలను రాష్ట్రం కోసం 29 వేల మంది రైతులు తృణప్రాయంగా త్యాగం చేశారు. కానీ, వారి ఆశలు, ఆకాంక్షలను వైసీపీ ప్రభుత్వం చిదిమేసింది. మూడు ముక్కలాట మొదలుపెట్టింది. రాజధాని తరలింపునకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక్క ఉదుటన అమరావతి కేంద్రంగా మహోద్యమం ప్రజ్వరిల్లింది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా, సమస్త రంగాలను స్తంభింపచేసిన లాక్‌డౌన్ సైతం వారి పోరాటానికి తల వంచాయి. వారిని ఒక్క అడుగు కూడా కదిలించలేకపోయాయి. ఒక్కరోజు కూడా వారి ఉద్యమాన్ని ఆపలేకపోయాయి. ఇలా మొక్కవోని పట్టుదలతో 1,600 రోజులకు పైగా రైతులు, మహిళలు సాగిస్తున్న పోరాటం చరిత్ర పుటల్లో రోజుకొక అధ్యాయాన్ని లిఖించింది. ‘దేవస్థానం టూ న్యాయస్థానం’ పేరిట సాగించిన మహా పాదయాత్ర, ‘అమరావతి టూ అరసవెల్లి’ పేరుతో సాగించిన రెండో విడత పాదయాత్ర....రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఈ పాదయాత్రలపై అధికారపార్టీ మూకలు, పోలీసులు సాగించిన దాష్టీకాలు రాష్ట్ర ప్రజలను కదిలించాయి. అమరావతి రైతులపై విరిగిన లాఠీలు, రైతు మహిళల ఒంటిపై బూటుకాలి గాయాలు, అర్ధంతరంగా ఆగిన 260 రైతులు గుండెలు, వారు చేసిన త్యాగాలు ప్రజల మనను కరిగేలా చేసింది. ప్రజలంతా అమరావతివైపే నిలిచేలా చేసింది.
నిర్విరామంగా నిర్మాణ మహాయజ్ఞం
చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతి వెలుగులు విరజిమ్మింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతకాలం బస్సులో నుంచి పరిపాలన సాగించారు. విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలను సమీకరించదలచారు. ఆయన ఇచ్చిన ఒక్క పిలుపుతో ల్యాండ్ పూలింగ్ కింద 33 వేల ఎకరాలను రైతులు రాజధాని కోసం ఇచ్చారు. రైతులను కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యులను చేస్తూ, వారికి చట్టబద్ధంగా రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు. శరవేగంగా 45 వేల మంది కార్మికులతో రాజధాని 29 గ్రామాల పరిధిలో నిర్మాణ పనులు జరిగాయి. రాత్రిళ్లు కూడా ఫ్లడ్ లైట్ల కాంతులతో పట్టపగలే అన్నట్టుగా నిర్మాణ ప్రాంతాల్లో వాతావరణం కనబడేది. వెలగపూడి రెవెన్యూ పరిధిలో 45 ఎకరాల్లో రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయం భవనాలను రూ.1,200 కోట్లతో నిర్మించి చంద్రబాబు రాష్ట్ర పరిపాలన ప్రారంభించారు. నిత్యం ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేల రాకపోకలతో రాజధాని అమరావతి రద్దీగా ఉండేది. పలు వ్యాపార సంస్థలు వెలిశాయి. ఆటోమొబైల్, బ్యాంకింగ్, హోటళ్లు, రెస్టారెంట్ల వరకు రాజధాని అమరావతిలో వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టుగా కొనసాగాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారం చేపట్టింది.
అమరావతి రైతులే స్టార్ క్యాంపెయినర్లు
జగన్ అధికారంలో రాగానే అమరావతి పనులను నిలిపివేసి కంపెనీలను పారద్రోలారు. దీంతో అప్పటిదాకా ఉన్న అమరావతి వెలుగులు ఒక్కసారిగా ఆర్పి వేయబడ్డాయి, రాజధాని రోడ్లు ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. రాత్రి వేళల్లో రోడ్ల కంకరు, గ్రావెల్ తవ్వి దోచుకెళ్లారు. మరోవైపు ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం కోసం మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెర మీదకు తెచ్చారు. జగన్ అన్యాయం, మోసం, దగా చేయడంతో తమకు ఉద్యమం చేయక తప్పడం లేదని ఎన్నికల సమయంలో తమను కలిసిన జాతీయ మీడియా ప్రతినిధులకు రైతులు, ఉద్యమ మహిళలు స్పష్టం చేశారు. వారే స్టార్ క్యాంపెయినర్లుగా మారి గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కూటమి తరపున ప్రచారం కూడా చేపట్టారు. ఇంటింటికి తిరిగి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. రాజధానికి సంఘీభావంతోపాటు, కూటమికి మద్దతును కూడగట్టారు. వారి సంఘటిత పోరాట ఫలితమే నేటి ఈ మార్పుకు కారణంగా చెప్పవచ్చు.