Share News

‘ఆమంచి’ విద్యుత్తు బకాయిలు 4కోట్లు!

ABN , Publish Date - Mar 25 , 2024 | 04:23 AM

బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌, ఆయన బంధువులు చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలు రూ.4కోట్ల పైచిలుకు పేరుకుపోయాయి.

‘ఆమంచి’ విద్యుత్తు బకాయిలు 4కోట్లు!

ఆయన బంధువుల పేరునా పెద్ద మొత్తంలో...

వైసీపీ నేత కావడంతో పట్టించుకోని అధికారులు

చీరాల, మార్చి 24: బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌, ఆయన బంధువులు చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలు రూ.4కోట్ల పైచిలుకు పేరుకుపోయాయి. ఆమంచికి చెందిన క్రిస్టల్‌ సీ ఫుడ్స్‌(ఫ్రై) లిమిటెడ్‌ కరెంటు బకాయి రూ.3,67,63,562 ఉంది. ఆయన బంధువుల పేరున ఉన్న క్రిస్టల్‌ ఆక్వా మెరైన్‌ హేచరీ్‌స(ఫ్రై) లిమిటెడ్‌ తాలూకా రూ.2,14,768 బిల్లు బకాయి ఉంది. ఇవికాక రొయ్యల చెరువులకు సంబంధించి ఆమంచి బంధువుల పేరున ఉన్న బకాయిలు కూడా రూ.లక్షల్లో పేరుకుపోయాయి. వీరికి సంబంధించి రూ.4 కోట్ల పైచిలుకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇంత పెద్దమొత్తంలో బకాయిలు ఉన్నప్పటికీ ఆయా సంస్థలకు నిరంతరాయంగా విద్యుత్తుసరఫరా జరుగుతుండటం విశేషం. సామాన్యులు ఒక నెల బిల్లు చెల్లించకుంటేనే కనెక్షన్‌ కట్‌ చేస్తామని హెచ్చరించే విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది వీరి విషయంలో మాత్రం ఉదాసీనంగా ఉంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నోటీసులు ఇచ్చాం

విద్యుత్తు బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులందరికీ నోటీసులు ఇచ్చాం. రూ.9కోట్లకు పైగా రావాల్సి ఉంది. అందులో సగం క్రిస్టల్‌ సంస్థలు, వారి సంబంధీకులకు చెందినవి ఉన్నాయి క్రిస్టల్‌ సంస్థ నిర్వాహకులు దశల వారీగా చెల్లించేందుకు ట్రాన్స్‌కో ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందారు. అందుకు సంబంధించి కిస్తీలు కడుతున్నారు. బకాయిలన్నీ పూర్తిస్థాయిలో వసూలు చేస్తాం.

- జాన్‌ థామస్‌, విద్యుత్తు శాఖ డీఈ, చీరాల

Updated Date - Mar 25 , 2024 | 04:23 AM