Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

పొత్తునుబట్టే అభ్యర్థులు!

ABN , Publish Date - Mar 03 , 2024 | 02:57 AM

సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదు. జనసేన, టీడీపీ కలిసి పోటీచేస్తున్నామని ప్రకటించాయి.

పొత్తునుబట్టే అభ్యర్థులు!

కసరత్తు చేస్తున్న కమలం

ప్రతి అసెంబ్లీకి ముగ్గురు ఎంపిక

అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదు. జనసేన, టీడీపీ కలిసి పోటీచేస్తున్నామని ప్రకటించాయి. బీజేపీ కూడా ఈ కూటమితో కలసి సాగుతుందన్న వార్తలు వెలువడ్డా దానిపై కమలనాథుల నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఈ సందిగ్ధం కొనసాగుతుండగానే రాష్ట్ర బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ ఎంపికల తుది నిర్ణయం మాత్రం కేంద్ర నాయకత్వం పొత్తులపై తీసుకొనే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని సమాచారం. కాగా, శనివారం విజయవాడ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షురాలు పురందరేశ్వరి నేతృత్వంలో అభ్యర్థుల దరఖాస్తుల వడపోత జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి గత నెలలో రాష్ట్ర బీజేపీ దరఖాస్తులు ఆహ్వానించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి 2,500 అప్లికేషన్స్‌ ఫిబ్రవరి 29 నాటికి వచ్చాయి. వాటిని శనివారం పురందేశ్వరి, జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్‌తో కూడిన బృందం పరిశీలించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రతోపాటు గుంటూరు, బాపట్ల పార్లమెంటు పరిధిలోని అభ్యర్థుల బలా బలాలపై స్ర్కీనింగ్‌ కమిటీ బేరీజు వేసింది.

అందులో క్షేత్రస్థాయి బలం, ఆర్థిక పుష్టి, పార్టీలో సానుకూలత తదితర అంశాలపై క్షుణ్నంగా పరిశీలించి ప్రతి అసెంబ్లీకి ముగ్గురి చొప్పున జాబితా సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని నియోజకవర్గాల్లో పదికి మించి దరఖాస్తులు రాగా చాలా చోట్ల ఒకటి రెండే వచ్చినట్లు సమాచారం. రాయలసీమలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి, తిరుపతి నుంచి భానుప్రకాశ్‌, శ్రీకాళహస్తి నుంచి కోలా ఆనంద్‌, రాజంపేట నుంచి సాయి లోకేశ్‌, చిత్తూరు జగదీశ్వర నాయుడు, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, గుంతకల్‌ నుంచి సందిరెడ్డి శ్రీనివాస రెడ్డి, నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, గుంటూరు పశ్చిమానికి వల్లూరు జయప్రకాశ్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎచ్చెర్ల రమ్య దొనేపూడి, అరకు పాంగి రాజారావు, విశాఖపట్నం నార్త్‌ విష్ణుకుమార్‌ రాజు పేర్లు మూడింట్లో మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిసిసింది. పార్లమెంటు స్థానాల్లో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజంపేట, సత్య కుమార్‌ హిందూపురం పార్లమెంటు, సీఎం రమేశ్‌ విశాఖపట్నం పార్లమెంటు, సుజనా చౌదరి విజయవాడ ఎంపీగా, అరకు నుంచి కొత్తపల్లి గీత పేర్లు వినిపించాయి. ఆదివారం నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థుల పేర్లు పరిశీలించి తుది జాబితా సిద్ధం చేసి పార్టీ అధిష్ఠానానికి పంపుతారు. కొన్ని నియోజకవర్గాలపై సంతృప్తి చెందని పార్టీ జాతీయ ప్రతినిధి శివప్రకాశ్‌... చేరికలపై దృష్టి సారించాలని నేతలకు సూచించారు. పారిశ్రామిక వేత్తల్ని, వ్యాపార వేత్తల్ని ఆకర్షించాలని, చివరిదశలో బలమైన అభ్యర్థులు చేరితే వారికి అవకాశం కల్పిద్దామని నిర్ణయురచినట్లు తెలిసింది.

Updated Date - Mar 03 , 2024 | 02:58 AM