Share News

‘అవినీతి’ అధికారికే మళ్లీ చాన్స్‌..!

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:55 AM

రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పనిముట్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణ విభాగంలో ఇటీవల తిరిగి చేరిన ఓ అధికారి.. వైసీపీ డీలర్లను రంగంలోకి దించుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

‘అవినీతి’ అధికారికే మళ్లీ చాన్స్‌..!

ముడుపులు, పైరవీలతో వ్యవసాయ యాంత్రీకరణ విభాగంలో తిరిగి పోస్టింగ్‌

వైసీపీ డీలర్లను రంగంలోకి దించుతున్న వైనం

నొచ్చుకుంటున్న అధికార పార్టీ నేతలు

అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పనిముట్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణ విభాగంలో ఇటీవల తిరిగి చేరిన ఓ అధికారి.. వైసీపీ డీలర్లను రంగంలోకి దించుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సదరు అధికారి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో రైతు రథం పేరుతో రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేసినప్పుడు పలు అవకతవకలకు పాల్పడ్డారు. డీలర్ల వద్ద కమీషన్లు తీసుకుని, వాస్తవ ధర కన్నా అధికంగా బిల్లులు చేయించారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో సదరు అధికారిపై సీఎం చంద్రబాబు, మంత్రి సోమిరెడ్డికి ఫిర్యాదులు వెళ్లాయి. అతని నిర్వాకం వల్లే గత ప్రభుత్వం రైతు రథం పథకంపై విచారణ చేయించింది. అప్పట్లో వ్యక్తిగత వ్యవసాయ పరికరాలు సరఫరా చేసిన డీలర్ల నుంచి ఆ అధికారి లంచాలు పుచ్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక వేళ చేతులు తడకపోతే.. బీమా పాలసీలు చేయించడం, కుటుంబసభ్యులకు బట్టలు తెప్పించుకోవడం వంటివి చేశారన్న ఫిర్యాదులున్నాయి. దీంతో అప్పటి ప్రభుత్వం సదరు అధికారిని రాయలసీమలో భూసార సంరక్షణ విభాగానికి బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో శతవిధాలా ప్రయత్నించినా.. ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో పోస్టింగ్‌ ఇవ్వలేదు. తాజాగా మధ్యవర్తికి ముడుపులిచ్చి.. ఓ మంత్రి వద్ద పైరవీ చేసి, మళ్లీ కమిషనరేట్‌లో పైగా తాను కోరుకున్న విభాగంలో పోస్టింగ్‌ సంపాదించారు.


రాయలసీమలో ఒకే సామాజికవర్గానికి చెందిన కొందరు వ్యవసాయ యంత్ర పరికరాల కంపెనీలకు డీలర్లుగా ఉన్నారు. వారి నుంచి ముడుపులు పుచ్చుకొని, ఎంప్యానల్‌ అయ్యేలా సదరు అధికారి పావులు కదుపుతున్నారు. వైసీపీ పాలనలో లబ్ధి పొందిన డీలర్లను ప్రోత్సహించి, అధికార పార్టీ సానుభూతిపరులైన డీలర్లను వెనక్కి నెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరోవైపు రోటోవేటర్‌, స్ర్పేయర్లు, సీడ్‌ డ్రమ్స్‌, వపర్‌ టిల్లర్‌, పవర్‌ వీడర్స్‌ వంటి పరికరాల సేకరణ, సరఫరాకు ఏపీ ఆగ్రోస్‌ సంస్థ నోడల్‌ ఏజెన్సీగా ఉండగా, నేరుగా వ్యవసాయ శాఖ ద్వారానే యంత్ర సామగ్రి సేకరించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో వ్యవసాయశాఖ కమిషరేట్‌లో సదరు అధికారి పని చేసినప్పుడు వరల్డ్‌బ్యాంక్‌ ప్రాజెక్ట్‌తో సహా మూడు ప్రాజెక్ట్‌లను పర్యవేక్షించారు. ఈ మూడు ప్రాజెక్ట్‌ల నిర్వహణ సక్రమంగా లేక కనుమరుగయ్యాయి. ఇలాంటి అధికారిని తిరిగి కీలక స్థానంలో నియమించడంపై అధికార పార్టీ నేతలు, డీలర్లు నొచ్చుకుంటున్నారు.

Updated Date - Dec 28 , 2024 | 05:55 AM