Share News

అవుట్‌ సోర్సింగ్‌దే పెత్తనం..!

ABN , Publish Date - Nov 13 , 2024 | 06:08 AM

దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయం నెమ్మదిగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల చేతుల్లోకి వెళ్తోంది..! అధికారులు కూడా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.

అవుట్‌ సోర్సింగ్‌దే పెత్తనం..!

దేవదాయ శాఖలో కీలక సెక్షన్లన్నీ వారి చేతుల్లోనే

ప్రధానమైన విజిలెన్స్‌లోనూ వారికే ప్రాధాన్యం

మానేసిన ఉద్యోగిని తీసుకొచ్చి మరీ బాధ్యతలు

డీఈవోలకు జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి

ఈవోలపైనే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పెత్తనం

వారికే అండగా నిలుస్తున్న దేవదాయశాఖ అధికారులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయం నెమ్మదిగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల చేతుల్లోకి వెళ్తోంది..! అధికారులు కూడా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల (డీఈవో)కు జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి మరీ కీలకమైన విభాగాల్లో పోస్టింగులు ఇస్తున్నారు. ఇది ప్రమాదమని తెలిసినా కూడా.. వారినే ప్రోత్సహిస్తున్నారు. దేవదాయశాఖలో ఏ, బీ సెక్షన్లు చాలా కీలకమైనవి. ఆలయాల అడ్మినిస్ట్రేషన్‌తో పాటు లీజులు, లైసెన్స్‌ల వ్యవహారం మొత్తం ఈ సెక్షన్ల పరిధిలోనే ఉంటాయి. ఇలాంటి కీలకమైన సెక్షన్ల బాధ్యతను రెగ్యులర్‌ ఉద్యోగులు చూసుకుంటారు. వారికి పనిభారం తగ్గించేందుకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకుని వారి సేవలను ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ.. దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో రెగ్యులర్‌ ఉద్యోగుల సేవలను పక్కనపెట్టి మరీ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రధాన సెక్షన్లు అప్పగిస్తున్నారు. ఏ, బీ సెక్షన్లతోపాటు విజిలెన్స్‌, సీజేఎఫ్‌ సెక్షన్లు కూడా అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది చేతుల్లోనే ఉన్నాయి. విజిలెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ మహిళా ఉద్యోగి కొద్దికాలం క్రితం మానేసి వెళ్లిపోయారు. కానీ, ఆ ఉద్యోగిని అధికారులే మళ్లీ పిలిచి విజిలెన్స్‌ సెక్షన్‌ బాధ్యతలు అప్పగించారు. విజిలెన్స్‌తోపాటు ఎస్టాబ్లి్‌షమెంట్‌ విభాగం కూడా కొన్నాళ్లుగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి చేతుల్లోనే ఉంది. ఉద్యోగుల ఇంక్రిమెంట్లు, పెన్షన్లు ఇతర బెనిఫిట్లు మొత్తం ఈ సెక్షన్‌ పరిధిలోనే ఉంటాయి. దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో రెగ్యులర్‌ ఉద్యోగుల కొరత ఉన్న మాట వాస్తవమే కానీ.. వారిని పక్కన పెట్టిమరీ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కీలకమైన బాధ్యతలు ఇచ్చేంత కొరత మాత్రం లేదు. కాగా, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో ఏ పనైనా సులువుగా చేయించుకోవచ్చన్న ఉద్దేశంతోనే వారికి కీలకమైన విభాగాలు అప్పగించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవదాయ శాఖలో భూములు, పద్దుల విభాగాలను కూడా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో నింపేశారు. రెగ్యులర్‌ ఉద్యోగులు ఖాళీగా ఉన్నా వారికి పని చెప్పకుండా పక్కన కూర్చోబెడుతున్నారు.


నియామకాల ఊసే లేదు..

దేవదాయ శాఖలో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ వాటి భర్తీకి అధికారులు ముందడుగు వేయడం లేదు. 2016, 2018, 2022లో ఏపీపీఎస్సీ దేవదాయ శాఖలో ఖాళీల వివరాలు కోరింది. కానీ, అధికారుల ఆ వివరాలు పంపించలేదు. దీంతో ఎపీపీఎస్సీ నోటిపికేషన్‌లో దేవదాయశాఖ ప్రస్తావన లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వంలో దేవదాయ శాఖను గాలికి వదిలేయడంతోపాటు పోస్టుల భర్తీపైనా దృష్టిపెట్టలేదు. రెండు రోజుల క్రితం దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవదాయ శాఖలో ఖాళీలు మొత్తం భర్తీ చేస్తానని ప్రకటించారు. ఆయన ఇచ్చన హామీ ప్రకారం ఖాళీలు మొత్తం భర్తీ అయితే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పెత్తనం తగ్గుతుంది. దీంతో ప్రధాన కార్యాలయంలో పాలన గాడిలో పడుతుంది.

ఈవోలపై పెత్తనం...

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కీలకమైన విభాగాల బాధ్యతలు అప్పగించడంతో కొంతమంది.. మేజర్‌ ఆలయాల ఈవోలపై సైతం పెత్తనం చెలాయించే స్థాయికి వెళ్లారు. మేజర్‌ ఆలయాల ఈవోలంటే దాదాపు జాయింట్‌ కమిషనర్‌ కేడర్‌లో ఉంటారు. దర్శనాలు, ఇతర పనుల నిమిత్తం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వారిపై కూడా ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఆయా ఆలయాలకు సంబంధించిన ఫైల్స్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే పెట్టాలన్న ఉద్దేశంతో కొంతమంది ఈవోలు దిక్కుతోచక వారు చెప్పింది చేస్తున్నారు. మేజర్‌ ఆలయాల ఈవోల పరిస్థితే ఇలా ఉంటే డీసీ, ఏసీ కేడర్‌, 6 ఏ, 6 బీ ఆలయాల ఈవోల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తమపై పెత్తనం చేస్తున్నారన్న విషయాన్ని ఈవోలు కూడా కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లలేని పరిస్థితి. ఈవో స్థాయి అధికారులు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై ఫిర్యాదులు చేస్తున్నారేమిటని ఆయన భావిస్తారనే ఉద్దేశంతో వెనక్కి తగ్గుతున్నారు. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్‌ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Nov 13 , 2024 | 06:08 AM