అరాచకాల ఆధారాలన్నీ వాటిలోనే!
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:46 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్మాదిలా సోషల్ మీడియా వేదికగా వికృతంగా వ్యవహరించిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ అరాచకాల గుట్టు విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
బోరుగడ్డ ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ స్వాధీనం
నేడు మంగళగిరి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు
అతడు పెట్టిన పోస్టులు, వీడియో రికవరీ!
తద్వారా అతడి వెనుక ఉన్న అదృశ్య శక్తుల కూపీ లాగేందుకు పోలీసుల యత్నం
అతడి బ్యాంకు ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు
వాటి లావాదేవీలపైనా ఆరా
కస్టడీ విచారణకు కోర్టులో పిటిషన్!
గుంటూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్మాదిలా సోషల్ మీడియా వేదికగా వికృతంగా వ్యవహరించిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ అరాచకాల గుట్టు విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉన్నత స్థాయిలో బోరుగడ్డ కేసుపై పోలీసు అధికారులు దృష్టి సారించకపోవడంతో క్షేత్రస్థాయిలో ఎంతవరకు పోలీసుల ప్రయత్నాలు ఫలిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో అరండల్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఏఈఎల్‌సీ చర్చి వివాదంలో తలదూర్చి చర్చి ట్రెజరర్ కర్ణపూడి బాబూప్రకాశ్‌ను రూ.50 లక్షలు ఇవ్వాలని ఫోన్లో బెదిరించాడు. వీడియో క్లిప్పింగ్స్ పంపి బ్లాక్ మెయిల్ చేశాడు. దీనిపై బోరుగడ్డతో పాటు ఆయన అనుచరుడైన పండ్ల వ్యాపారి హరిపై అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో ఈ నెల 17న అమరావతి రోడ్డులోని వేళాంగణినగర్‌లో తన ఇంటిలో ఉన్న అనిల్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నెల 18న కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనిల్ ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. గడచిన ఐదేళ్లలో అతడి అరాచకాలకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు వాటిని సోమవారం మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపనున్నారు. అతడు పెట్టిన పోస్టింగ్స్, ఫార్వర్డ్ చేసిన వీడియోలతో పాటు కర్లపూడి బాబు ప్రకాశ్‌ను బెదిరిస్తూ పంపిన వీడియో క్లిప్పింగ్స్ వంటివాటన్నిటినీ రికవర్ చేయనున్నారు. బోరుగడ్డ వెనుక తాడేపల్లికి చెందిన బలమైన అదృశ్య శక్తులు ఉన్నాయని రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. అతడు ఏకంగా నాటి సీఎం జగన్మోహన్‌రెడ్డి తనకు బంధువని బహిరంగంగా ప్రకటించాడు. తనను విమర్శించేవారిని అటు సీఐడీ ఉన్నతాధికారులకు, ఇటు సంబంధిత పోలీసు అధికారులకు కాల్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఫోన్‌లో బెదిరించాడు. సదరు అదృశ్య శక్తుల వివరాలు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లో ఉన్నాయేమోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. అతడి బ్యాంకు ఖాతాల లావాదేవీల ద్వారా కూడా వాటిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బోరుగడ్డకు ప్రభుత్వ పెద్దల నుంచి పెద్ద మొత్తంలో నజరానాలు ముట్టినట్లు ఆరోపణలున్నాయి. అతడి బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు జమయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అతడి ని కస్టడీకి తీసుకుని విచారించి బ్యాంకు ఖాతాల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీసులు నిర్ణయించారు. దీనికోసం త్వరలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
చింతమనేనికి బెదిరింపులు..
ఏలూరు క్రైం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను బెదిరించిన ఆరోపణలపై బోరుగడ్డ అనిల్‌కుమార్‌పై ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. 2023 అక్టోబరులో బోరుగడ్డ తనకు ఫోన్ చేసి.. తమ పార్టీ తలుచుకుంటే మీ వర్గాన్ని ఖతం చేస్తామని అనేక దుర్భాషలాడి వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు పాల్పడినట్లు చింతమనేని ఆదివారమే ఫిర్యాదు చేశారు.
బోరుగడ్డ అరాచకాలెన్నో..
వైసీపీ పెద్దల అండతో గడచిన ఐదేళ్లలో బోరుగడ్డ అనిల్ ఇష్టానుసారం చెలరేగిపోయాడు. సమాజంలో ఉన్నత స్థా నంలో ఉన్న వారిని, ప్రముఖులను, మహిళలను, అధికార యంత్రాంగాన్ని చెప్పలేని విధంగా సోషల్ మీడియా ద్వారా దూషిస్తూ బెదిరించాడు. ఇవి తట్టుకోలేక చేబ్రోలు మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు నన్నపనేని కోటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. అనిల్ ఏఈఎల్‌సీ చర్చి వివాదంలో తలదూర్చి ఏఈఎల్‌సీ కోశాధికారిగా ఎన్నికైన బాబూప్రకాశ్ ను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. కృష్ణా జిల్లా బైరాగి పాలెంలో పేద పిల్లల ఆశ్రమంలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకుంటే ఆశ్రమం నిర్వాహకుడికి ఫోన్ చేసి డబ్బు కోసం డిమాండ్ చేశాడు. అతడి భార్యకు సోషల్ మీడియా లో అసభ్యకరమైన పోస్టింగ్స్ పంపి బెదిరించాడు.
2021 డిసెంబరు 7న రాత్రి గుంటూరు జీజీహెచ్‌లో అర్ధరాత్రి తనిఖీల పేరుతో హంగామా సృష్టించాడు. మద్యం తాగి.. విధుల్లో ఉన్న వైద్యుడిపై దౌర్జన్యం చేశాడు. దీని పై అప్పటి సూపరింటెండెంట్ ప్రభావతి ఫిర్యాదుతో కొత్తపేట పోలీసు స్లేషన్లో కేసు నమోదైంది. అయితే ప్రభావతి భర్త రవికుమార్ వైసీపీ నాయకుడు కావడంతో ఆ తర్వాత ఆమె లోక్ అదాలత్‌లో కేసు రాజీ చేసుకున్నారు.
2018 జూలై 22న అనంతపురం త్రీ టౌన్ సీఐ మురళీకృష్ణకు ఫోన్ చేసి తాను ఐఏఎస్ అధికారి రాజశేఖర్‌నని.. జాకబ్ స్వరూప్ కుమార్, బోరుగడ్డ అమృతవల్లి అనే వారు ప్రభుత్వ ఆర్థిక సలహాదారులని.. అక్కడ చర్చిలో రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదంలో తిమోతి గ్రూపునకు అనుకూలంగా పని చేయాలని బెదిరించాడు. సీఐ ఫిర్యాదు చేయడంతో ఆ ముగ్గురిపై కేసు నమోదైంది.
2017లో పెదకాకానిలో తాను శ్యాంసింగ్ అనే వ్యక్తి నుంచి మూడున్నర సెంట్ల స్థలం కొనుగోలు చేశానని.. దానికి వెంటనే సర్వే చేసి సర్టిఫికెట్ ఇవ్వాలంటూ మం డల సర్వేయర్ చిరుమామిళ్ల మల్లికార్జునరావును బెదిరించారు. సర్వే చేయాలంటే మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మల్లికార్జునరావు చెప్పినప్పటికీ వినిపించకుం డా తనకు నేరుగా సర్వే చేసి సర్టిఫికెట్ ఇవ్వాలన్నాడు. పెదకాకాని పోలీసు స్టేషన్‌లో అతడిపై కేసు నమోదైంది.
ఫసార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ ఏడాది మే 8న రాత్రి తుళ్లూరు శివారు పెట్రోల్ బంక్ వద్ద ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి ఎ.గోపీకృష్ణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బోరుగడ్డ అనిల్ తన అనుచరులతో రెండు కార్లలో అక్కడకు వచ్చాడు. వాటిని తనిఖీ చేయాలని గోపీకృష్ణ ఆదేశించడంతో కారు దిగిన అనిల్.. అక్కడ విధుల్లో ఉన్న ఏఎ్‌సఐ ప్రసాద్‌పై దౌర్జన్యం చేశాడు. తాము వైసీపీ నాయకులమని, తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి రాబోతోందని, తడాఖా చూపిస్తామన్నాడు. దీనిని చిత్రీకరిస్తున్న ఏబీఎన్ విలేకరిపై దాడి చేశాడు.
ఎన్నికల కౌంటింగ్‌కు ముందు రోజు జూన్ 3న‘ఆరా’ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చిన సందర్భంలో బోరుగడ్డ సోషల్ మీడియాలో.. మా వైసీపీయే అధికారంలోకి రాబోతోందంటూ చంద్రబాబును, ఆయన సామాజిక వర్గాన్ని కించపరిచేలా దూషిస్తూ, మీ అంతు చూస్తానని, మీ జాతి మహిళలపై అత్యాచారం చేస్తానని దూషించాడు. దీనిపై గని చిన్న వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదుతో పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బోరుగడ్డపై 2022 అక్టోబరు 20న పాతగుంటూరులో కేసు నమోదైంది. ఓ భూ వివాదంలో 2016లో తాడికొండ పోలీసు స్టేషన్ పరిధిలో చీటింగ్, మారణాయుధాలతో బెదిరించాడు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆయనపై అరండల్‌పేట స్టేషన్‌లో ‘సి’ కేటగిరీ రౌడీషీట్ తెరిచారు. ఇప్పుడు దానిని ‘ఏ ప్లస్’ కేటగిరీకి మార్చాలని నిర్ణయించారు.