Share News

రాష్ట్రాలు రెండైనా తెలుగువారంతా ఒక్కటే

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:37 AM

తెలుగు రాష్ట్రాలు ఏర్పడి ఆదివారం నాటికి పదేళ్లు అయిందని, రాష్ట్రాలు రెండు అయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రాలు రెండైనా తెలుగువారంతా ఒక్కటే

10 కోట్ల తెలుగుజాతి మేటిగా వెలగాలి

ఏపీ, తెలంగాణ విడిపోయి పదేళ్లయిన సందర్భంగా చంద్రబాబు ఆకాంక్ష

అమరావతి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలు ఏర్పడి ఆదివారం నాటికి పదేళ్లు అయిందని, రాష్ట్రాలు రెండు అయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పది కోట్ల తెలుగుజాతి మేటిగా వెలగాలన్నదే తన ఆకాంక్ష అని ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. నాటి ఆర్థిక సంస్కరణల తర్వాత సంపద సృష్టికి బీజం పడిందని, ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షే మం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయని పేర్కొన్నారు. నాలెడ్జి ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని ప్రశంసించారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి సమగ్ర సాధికారత సాధించాలన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచ వ్యాప్తం కావాలన్నారు. దేశం స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తయే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులంతా అగ్రస్థానంలో ఉండాలన్నారు. అందులో తెలుగు జాతి నంబర్‌ వన్‌ కావాలని ఆకాంక్షిస్తున్నాని ఎక్స్‌ ద్వారా చంద్రబాబు తెలియజేశారు.

Updated Date - Jun 03 , 2024 | 03:37 AM