Share News

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:13 AM

కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు అల్లరి సృష్టించాలని ప్రయత్నం చేస్తే బయటకు పంపుతామని, కేసు పెట్టి జైలుకు కూడా పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకే్‌షకుమార్‌ మీనా హెచ్చరించారు.

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ఉదయం 8 గంటలకు ప్రారంభం

ప్రతి 25 నిమిషాలకు ఒక రౌండ్‌ ఫలితం

తొలి 5 గంటల్లోనే 111 నియోజకవర్గాల తీర్పు

కొవ్వూరు, నరసాపురంలో 13 రౌండ్లే

దీంతో తొలి తీర్పు ఇక్కడి నుంచే..

25-27 రౌండ్లు పట్టనున్న భీమిలి, పాణ్యం

అక్కడ పది గంటలకుపైగా ఉత్కంఠే..

లోక్‌సభ ఫలితాల్లో ముందుగా రాజమండ్రి,

నరసాపురం.. చివరిగా అమలాపురం!

కౌంటింగ్‌ కేంద్రాల్లో అల్లర్లు చేస్తే జైలుకే

42 వేల మంది పోలీసులు, 67 కంపెనీల

బలగాలతో పటిష్ఠ భద్రత: సీఈవో మీనా

కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు అల్లరి సృష్టించాలని ప్రయత్నం చేస్తే బయటకు పంపుతామని, కేసు పెట్టి జైలుకు కూడా పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకే్‌షకుమార్‌ మీనా హెచ్చరించారు. ఏజెంట్లు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానం ఉంటే నిర్దేశిత విధానంలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. సరైన కారణాలు ఉంటేనే రీ కౌంటింగ్‌కు అనుమతి ఇస్తామని, మళ్లీ మళ్లీ కోరితే లెక్కలోకి తీసుకోబోమన్నారు. ప్రతి రౌండ్‌లో రీకౌంటింగ్‌ అడగటానికి వీల్లేదని చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత... కారణం సహేతుకమైనదే అయితే ఆర్వో స్పీకింగ్‌ ఆర్డర్‌ ఇస్తారన్నారు. అభ్యర్థులు కూడా ఏదైనా అనుమానం ఉంటే నిబంధనల ప్రకారం ఫిర్యాదు చేయవచ్చునని కోరారు. కౌంటింగ్‌ రోజు ఫలితాల వెల్లడి తర్వాత ఊరేగింపులకు అనుమతి ఉండబోదని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రక్రియలో అటెస్టేషన్‌ అధికారి సంతకంపై ఆక్షేపణ తెలపడానికి వీల్లేదన్నారు. కౌంటింగ్‌ రోజు తర్వాత కూడా 144 సెక్షన్‌ కొనసాగించాలా వద్దా అనేది జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారన్నారు. 67 కంపెనీల సా యుధ భద్రతా బలగాలను కౌంటింగ్‌ కేంద్రాలు, శాంతిభద్రతల కోసం వినియోగిస్తున్నామని మీనా చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రం రెడ్‌ జోన్‌ పరిధిలో ఉంటుందని, డ్రోన్ల ద్వారా నిఘా పెడతామని తెలిపారు. ‘‘ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియ్‌సగా ఉంది. ఆ ఘటనలపై తీవ్ర చర్యలు తీసుకున్నాం. అయితే, కౌంటింగ్‌ రోజు అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. రాష్ట్రంలో 1985 సున్నితమైన, సమస్యాతక ప్రాంతాలను గుర్తించాం. సమస్యలు సృష్టించే 12 వేల మందిని గుర్తించి బైండోవర్‌ చేశాం. పోలీస్‌ పికెట్లు పెట్టాం. క్యూఆర్టీ టీమ్‌లు రంగంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 83 నియోజకవర్గాలను సున్నితమైన నియోజకవర్గాలుగా గుర్తించి, అక్కడ సీనియర్‌ పోలీస్‌ అధికారులను నియమించాం. జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న రూ.483 కోట్లు విలువైన నగదు, మద్యం తదితరాలను పట్టుకున్నాం. సీ-విజిల్‌ యాప్‌ ద్వారా భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఏపీలో ఈస్థాయిలో పోలింగ్‌ ఎప్పుడూ జరగలేదు. క్లినెస్ట్‌ లిస్ట్‌ తయారు చేశాం’’ అని తెలిపారు.

పోస్టల్‌ సునామీ...

పోలైన పోస్టల్‌ బ్యాలెట్లు 5.15 లక్షలు

ఉద్యోగులు, అత్యవసర సర్వీసు సిబ్బంది 4,61,945

సర్వీసు ఓటర్లు 26,721

వయోవృద్ధులు, దివ్యాంగులు 26,473

కౌంటింగ్‌ సైన్యం.. విధుల్లోని ఉద్యోగులు 25,209

అబ్జర్వర్లు 119

పోలీసులు 42,000

ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్‌

టేబుళ్లు (అసెంబ్లీ) 2,446

టేబుళ్లు (పార్లమెంటు) 2,443

Updated Date - Jun 04 , 2024 | 04:13 AM