ఇక సెబ్‌లన్నీ ఎక్సైజ్ స్టేషన్లు
ABN , Publish Date - Sep 14 , 2024 | 05:01 AM
ఎక్సైజ్ శాఖ ఎట్టకేలకు పూర్తిగా పాత స్వరూపంలోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను తాజాగా రద్దు చేయడంతో.
మళ్లీ పూర్వ స్వరూపంలోకి ఎక్సైజ్ శాఖ
ఉమ్మడి జిల్లాలకు ఒక్కో డీసీ, ఏసీ
అనకాపల్లి, రాజమండ్రికి అదనంగా ఏసీలు
ఐపీఎస్ నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్
శాఖ పునర్నిర్మాణ ఉత్తర్వులు జారీ
అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్ శాఖ ఎట్టకేలకు పూర్తిగా పాత స్వరూపంలోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను తాజాగా రద్దు చేయడంతో.. శాఖ పునర్నిర్మాణంపై ఎక్సైజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2020కు ముందున్న తరహాలోకి ఆ శాఖను తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 208 సెబ్ స్టేషన్లు ఉండగా అవి ఎక్సైజ్ స్టేషన్లుగా మారిపోతాయి. 28 జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉంటాయి. మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు 19 ఉంటాయి. గత ప్రభుత్వంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయగా అంతకుముందున్న ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కొందరు అధికారులను కేటాయించారు. మొత్తం శాఖకు కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ప్రధానాధికారిగా వ్యవహరిస్తారు. డిస్టిలరీస్ కమిషనర్ బాధ్యతలను కూడా కమిషనరే చూస్తారు. ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్, ముగ్గురు జాయింట్ కమిషనర్లు ఉంటారు. మద్యం నేరాల నియంత్రణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఉంటుంది. దానికి సీనియర్ ఎస్పీ లేదా డీఐజీ స్థాయి ఐపీఎస్ అధికారి నేతృత్వం వహిస్తారు. ఉమ్మడి జిల్లా ప్రకారం జిల్లాకో డిప్యూటీ కమిషనర్ (డీసీ), అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) ఉంటారు. అయితే నాటుసారా, గంజాయి ప్రభావం ఎక్కువగా ఉన్న అనకాపల్లి, రాజమండ్రిలకు అదనంగా ఒక్కో అసిస్టెంట్ కమిషనర్‌ను కేటాయించారు. కొత్త జిల్లాల ప్రకారం జిల్లాకో ఎక్సైజ్ సూపరింటిండెంట్ (ఈఎస్) పనిచేస్తారు.
మద్యంపై నిఘా
గత ప్రభుత్వం సెబ్‌ను ఏర్పాటుచేసి దానికి అనేక రకాల బాధ్యతలు అప్పగించింది. ఎర్రచందనం, ఇసుక, గుట్కా, గ్యాంబ్లింగ్ బాధ్యతలు అప్పగించడంతో సెబ్ దేనిపైనా దృష్టిసారించలేకపోయింది. ఇప్పుడు శాఖను పూర్తిగా పాత విధానంలోకి తేవడంతో మళ్లీ మద్యం నేరాలపై దృష్టి పెట్టనుంది. అలాగే నాటుసారా నియంత్రణ, గంజాయి నిర్మూలనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పనిచేస్తుంది.
ఉద్యోగుల హర్షం
దాదాపు ఐదేళ్ల తర్వాత ఎక్సైజ్ శాఖ పాత స్వరూపంలోకి మారడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోకుండానే ఏకపక్షంగా సెబ్‌ను సృష్టించింది. ఎక్సైజ్‌లోని 70 శాతం మంది ఉద్యోగులను అందులోకి బదిలీ చేసింది. దీంతో అప్పటినుంచీ తమకు సెబ్ వద్దని పాత విధానమే కావాలని ఆ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సెబ్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని గుర్తించిన కొత్త ప్రభుత్వం వెంటనే దాన్ని రద్దుచేసింది.
కేబినెట్ తర్వాత
మద్యం పాలసీకి నోటిఫికేషన్
అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మంత్రి మండలి సమావేశం ముగిసిన వెంటనే నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు కేబినెట్‌లో ఆమోదం లభించాల్సి ఉంది. కాగా, మంత్రివర్గ ఉపసంఘం రెండో సమావేశం శుక్రవారం మంగళగిరిలోని సెబ్ కార్యాలయంలో జరిగింది. మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్ భేటీ అయ్యి నూతన పాలసీపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రైవేటు షాపుల విధానమే ఉత్తమం అనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి. అయితే ప్రైవేటు, ప్రభుత్వ విధానాలను కేబినెట్ ముందుంచాలని, సీఎం దానిపై నిర్ణయం తీసుకుంటారని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,396 షాపులు ఉండగా, అదే సంఖ్యను ఉంచాలా? షాపులు పెంచాలా? అనేదానిపైనా చర్చించారు.