Share News

పెన్షన్లన్నీ పెండింగ్‌లోనే!

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:17 AM

కొత్త సంవత్సరంలోనూ ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు తీరడం లేదు. జనవరి 5వ తేదీ వచ్చినా ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో జీతాలు,

పెన్షన్లన్నీ పెండింగ్‌లోనే!

5 వేల కోట్లు తెచ్చినా చెల్లింపుల్లేవ్‌

జీతాలు, పెన్షన్లకు 2,800 కోట్లు బాకీ

అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరంలోనూ ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు తీరడం లేదు. జనవరి 5వ తేదీ వచ్చినా ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో జీతాలు, పెన్షన్లు చెల్లించనే లేదు. జీతాలు కొంతమేర చెల్లించినా, పెన్షన్లు మాత్రం పూర్తిగా పెండింగ్‌లోనే ఉన్నాయి. రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.1,800 కోట్లు చెల్లించాలి. కానీ, గురువారం మధ్యాహ్నం వరకూ వీరిలో ఒక్కరికి కూడా పెన్షన్‌ అందలేదు. ఉద్యోగుల వేతనాలకు రూ.3,800 కోట్లకుగాను ఇప్పటికి రూ.2,800 కోట్లు మాత్రమే చెల్లించారు. ఆర్‌బీఐ నుంచి ఈ నెల 2న జగన్‌ ప్రభుత్వం రూ.3,000కోట్ల అప్పు తెచ్చింది. అలాగే ఒకటో తేదీన కేంద్రం నుంచి దాదాపు రూ.2,000 కోట్ల వరకు రాష్ట్ర ఖజానాకు చేరాయి. కానీ, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు మాత్రం చెల్లించడంలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,300 కోట్లు వేజ్‌ అండ్‌ మీన్స్‌ వాడుకునే వెసులుబాటు ఉంది. ప్రతినెలా వేజ్‌ అండ్‌ మీన్స్‌తో పాటు ఓడీ అప్పులు కూడా పూర్తిగా వాడేస్తున్నారు. పెన్షన్లు చెల్లించేందుకు ఈ నెల వేజ్‌ అండ్‌ మీన్స్‌ అప్పు వెసులుబాటును ఇంకా వాడలేదు. రిటైర్డ్‌ ఉద్యోగుల్లో ఏ ఒక్కరికీ పెన్షన్‌ పడలేదు.

Updated Date - Jan 05 , 2024 | 04:17 AM