Share News

మీ అందరూ నా కూతుళ్లే

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:07 AM

నాకు కూతురు లేదు. మీ అందరూ నా కుమార్తెలే. టీడీపీ మీ అందరికీ పుట్టిల్లు.

మీ అందరూ నా కూతుళ్లే

టీడీపీ మీ అందరికీ పుట్టిల్లు: చంద్రబాబు

శ్రీకాకుళంలో మహిళలతో భేటీ

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 24 (ఆంద్రజ్యోతి): ‘నాకు కూతురు లేదు. మీ అందరూ నా కుమార్తెలే. టీడీపీ మీ అందరికీ పుట్టిల్లు. ఆడబిడ్డలను మహాశక్తిమంతులుగా తీర్చిదిద్దుతా’ అని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారమిక్కడ ‘ఆడబిడ్డలతో సమావేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ‘ఆడబిడ్డలను చదివించాలని, ఆడవారికి ఆస్తిలో హక్కు కల్పించేందుకు, స్థానిక సంస్థల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడింది టీడీపీయే. డ్వాక్రా సంఘాలు పెట్టింది నేనే. ఇప్పుడు 30 ఏళ్లవుతోంది. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి రివాల్వింగ్‌ ఫండ్‌ ఇచ్చాను. పసుపు కుంకుమ కింద సహాయం అందించాను. ఈ ఐదేళ్లలో మీరు చాలా నష్టపోయారు. మీ జీవితాలు తలకిందులయ్యాయి. మీ కష్టాలు.. మీ బాధలు వినేందుకే వచ్చాను. మీ జీవితాలతో చెలగాటమాడే ఈ జలగ జగన్‌ ఓ సైకో. ఆడవారిపై వైసీపీ అరాచకాలు భరించలేక కొవ్వూరు లక్ష్మి ఢిల్లీ వెళ్లి నిరసన చేశారు. వేలు పోయినా పర్వాలేదు.. రాష్ట్రంలో అమ్మాయిలను కాపాడాలని ఆమె కోరుతున్నారు. గజపతినగరంలో ఓ ఆడబిడ్డ ఆస్తిని ఎమ్మెల్యే కబ్జాచేశాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. ఒకప్పుడు బియ్యం రూ.40, ఇప్పుడు రూ.65.. కందిపప్పు రూ.87 ఉంటే ఇప్పుడు రూ.160.. చింతపండు రూ.200.. గ్యాస్‌ రూ.1100.. కరెంటు బిల్లు రూ.200 నుంచి రూ.వెయ్యి దాటిపోతోంది. మద్యపాన నిషేధం అని చెప్పి ధరలు పెంచారు. అప్పుడు రూ.60 క్వార్టర్‌ బాటిల్‌ సీసా అయితే.. ఇప్పుడు రూ.200 ఉంది. దీనికితోడు గంజాయి, డ్రగ్స్‌ వచ్చాయి. రాష్ట్రంలో దద్దమ్మ, అసమర్థ ప్రభుత్వం ఉంది. మోసాలు చెప్పి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారు. మే 13న దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలి. ఆ దెబ్బతో జగన్‌ బంగాళాఖాతంలో కలసిపోవాలి’ అని పిలుపిచ్చారు.

చిన్నారికి పేరుపెట్టిన చంద్రబాబు

నెల వయసున్న చిన్నారిని తీసుకుని తల్లి, ఆ చిన్నారి అమ్మమ్మ చంద్రబాబు వద్దకు వచ్చారు. ఆ చిన్నారికి నామకరణం చేయాలని కోరారు. ‘పునర్విక’ అని ఆయన పేరుపెట్టారు.

Updated Date - Apr 25 , 2024 | 04:08 AM