మద్యం.. ఇసుక జోలికి వెళ్లవద్దు!
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:08 AM
ఎమ్మెల్యేలు అనే అహం వీడండి.. కార్యకర్తల త్యాగాలు వల్లే గెలిచామనే వాస్తవాన్ని మరవద్దు.

ప్రజాసేవకే అంకితమవ్వాలి
కార్యకర్తల త్యాగాలు వల్లే గెలిచాం
వారిని నిర్లక్ష్యం చేయకండి
ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే సహించేది లేదు
జిల్లా ఎమ్మెల్యేల సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం
కర్నూలు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘ఎమ్మెల్యేలు అనే అహం వీడండి.. కార్యకర్తల త్యాగాలు వల్లే గెలిచామనే వాస్తవాన్ని మరవద్దు. కార్యకర్తలను ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించకండి. ప్రజలతో ఉంటూ ప్రజా సేవకే అంకితమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జమిలి ఎన్నికలు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం ఉచిత ఇసుక, మద్యం పాలసీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. వాటి జోలికి వెళ్లవద్దు..’ అంటూ టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు జిల్లా ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌తో పాటు వివిధ అంశాలపై టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు శిక్షణ ఇచ్చారు. ఓ వైపు ప్రభుత్వ విధానాలు వివరిస్తూ మరో వైపు ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేస్తూనే.. ఇసుక, మద్యం వ్యాపారాల్లో అడుగు పెట్టి పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని, అలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు.
ఫ ఇసుక, మద్యం వాప్యారాల్లో జోక్యం వద్దు
ఉచిత ఇసుక, మద్యం పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గత ప్రభుత్వం ఇసుక దోపిడి చేసింది. సామాన్యులకు ఉపాధి లేకుండా చేసింది. అదే క్రమంలో మద్యం పాలసీలని భ్రష్టుపట్టించిన సంగతి తెలిసిందే. ఇసుక, మద్యం విషయంలో మనం నిక్కచ్చిగా ఉందాం. ఏ పల్లెల్లోనైనా వంకలు, వాగుల్లో ఇసుకను ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లలో కావాల్సిన వాళ్లు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అదే క్రమంలో మద్యం పాలసీని కూడా పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, వారి పేరు చెప్పుకొని పార్టీ నాయకులు ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు. ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక, మద్యం అమ్మకాల్లో జోక్యం ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఏ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో నిఘా వర్గాల ద్వారా సమాచారం ఉంది. ఈ రోజు నుంచి మారకపోతే పాత చంద్రబాబు చూస్తారు.
ఫ ప్రజా సేవకే అంకితం అవ్వాలి
సేవ చేస్తారనే మిమ్మల్ని ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. వారి మధ్యనే ఉంటూ ప్రజా సేవకు అంకితం కావాలి. పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేస్తేనే విజయం సాధించామన్న వాస్తవాన్ని ఏ ఒక్కరూ మర్చిపోవద్దు. కార్యకర్తల అభ్యున్నతి కోసం పని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విస్మరించవద్దు. కష్టపడిన కార్యకర్తలను గుర్తించి నామిటేటెడ్ పదువులు ఇస్తున్నాం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ఇదే విధానం అమలు చేయాల్సిందే.
ఫ కర్నూలు జిల్లాలో సమస్యలు వాస్తవమే
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటు పార్టీలోనూ.. అటు గ్రామాల్లోనూ పలు సమస్యలు ఉన్నాయి. వాటిపై నా స్థాయిలోనే కాకుండా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా వారిస్థాయిలో కూడా ఫోకస్ పెట్టాలి. అప్పుడే ప్రజలు మళ్లీ ఆదరిస్తారు. కర్నూలు పశ్చిమాన తాగునీటి సమస్య, కరువు, వలసలు ఉన్నాయి. వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఏమిచేయాలో ఆలోచిస్తున్నాం. వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే కొంతవరకైనా వలసలు ఆగుతాయి. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కృషి చేద్దాం. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాం. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నాయకుల మధ్య దూరం పెరుగుతోంది. అది మంచి పద్దతి కాదు.. మేము ఎమ్మెల్యేలమని అహంకారం వీడండి.. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని ముందుకు సాగండి. మామూలుగా అయితే 2029లో సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు కేంద్రం సిద్ధం అవుతుండడంతో ఏడాది ముందే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు నుంచి సన్నద్ధం కావాలి.. అని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు.