Share News

అక్కే.. అమ్మలా!

ABN , Publish Date - Feb 25 , 2024 | 03:14 AM

మతి స్థిమితం కోల్పోయిన అమ్మ ఎక్కడుందో తెలియదు. అన్నీ తానై పిల్లలను కాపాడాల్సిన తండ్రి మద్యానికి బానిసై పట్టించుకోవడం మానేశాడు.

అక్కే.. అమ్మలా!

ఐదేళ్లలోపు ఇద్దరు తమ్ముళ్లు, 5నెలల శిశువుకు తల్లయిన 8ఏళ్ల చిన్నారి

వారికోసం ప్రభుత్వాస్పత్రిలో భిక్షాటన

అక్కున చేర్చుకున్న శిశుగృహం అధికారులు

కర్నూలు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి)/కర్నూలు హాస్పిటల్‌: మతి స్థిమితం కోల్పోయిన అమ్మ ఎక్కడుందో తెలియదు. అన్నీ తానై పిల్లలను కాపాడాల్సిన తండ్రి మద్యానికి బానిసై పట్టించుకోవడం మానేశాడు. ఆకలి బాధతో అల్లాడుతున్న ఐదేళ్లలోపు ఇద్దరు తమ్ముళ్లు, 5నెలల పపిపాపకు ఎనిమిదేళ్ల అక్క తల్లిగా మారింది. ఓ చెట్టు నీడను నివాసంగా చేసుకొ ని భిక్షాటన చేస్తూ వారి ఆకలి తీరుస్తోంది. తోబుట్టువులను పోషించుకోవడానికి ఆ చిన్నారి పడుతున్న తపన చూసిన ప్రతి ఒక్కరూ ‘‘అయ్యో పాపం పసిపిల్లలకు ఎంత కష్టం వచ్చిందో’’ అనుకుంటూ తోచిన సాయం చేస్తూ వచ్చారు. అనాఽథ పిల్లలు బతుకు వేటలో ఆకలి పోరు సాగిస్తున్నారన్న సమాచారం అందుకున్న ఐసీడీఎస్‌ అధికారులు ఆ చిన్నారులను శిశుగృహానికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పించారు. ఈ ఘటన కర్నూలు సర్వజన వైద్యశాలలో శనివారం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన బుడగ జంగాల సుంకన్న, లక్ష్మి నిరుపేద దంపతులు. రెక్కాడితే కానీ పూట గడవని దీనస్థితి. పదేళ్ల క్రితం పెద్దల ను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవడంతో బంధువులు పట్టించుకోవడం మానేశారు. ఈ దంపతులకు 8 ఏళ్ల పాప, 4, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, ఐదు నెలల పసిపాపతో కలిపి మొత్తం నలుగురు సంతానం. బేల్దారి పని చేసే సుంకన్న మద్యానికి బానిసై భార్య పిల్లలను పట్టించుకొనేవాడు కాదు. తల్లి కూడా మతి స్థిమితం కోల్పోయింది. అమెను వైద్యం కోసం కర్నూలు సర్వజన వైద్యశాలకు రెండు వారాల క్రితం తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె ఆస్పత్రిలో ఉందో.. ఎక్కడికైనా వెళ్లిపోయిందో ఆ చిన్నారులకు తెలియడం లేదు. సెంట్రల్‌ ల్యాబ్‌ సమీపంలో బర్డ్స్‌ వార్డు పక్కనే ఉన్న ఓ రేకుల షెడ్డులో ఉంటూ 8ఏళ్ల చిన్నారి ముగ్గురు తోబుట్టువులకు అమ్మగా మారింది. ఆస్పత్రిలో భిక్షాటన చేస్తూ.. రోగులకు ఆస్పత్రి సిబ్బంది అందించే ఆహారం, పాలు తీసుకొచ్చి ముగ్గురు పిల్లల ఆకలి తీర్చింది. అక్కడే వారికి అమ్మ ప్రేమను పంచింది. సుంకన్న అప్పుడప్పుడు వచ్చి ఆ పిల్లలు భిక్షాటన చేసి తెచ్చి న డబ్బును బలవంతంగా తీసుకెళ్లేవాడని స్థానికులు చెబుతున్నారు. చిన్న వయసులోనే జన్మకు సరిపడా కష్టాలు పడుతున్న ఆ చిన్నారులను చూసి చలించిన రోగుల బంధువులు, వాచ్‌మెన్‌ 1098 చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకట లక్ష్మమ్మ, ఐసీపీఎస్‌ జిల్లా అధికారి శారద, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ సుంకన్న ఆస్పత్రికి చేరుకొని ఆ చిన్నారుల పరిస్థితి చూసి చలించిపోయారు. వారికి వైద్యపరీక్షలు చేయించగా, పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు ధ్రువీకరించారు. బాలల సంక్షేమ సమితి కి సమాచారం ఇచ్చి వారి ఆదేశాల మేరకు ఆ నలుగురు చిన్నారులను కర్నూలు సీ.క్యాంపులో ఉన్న శిశుగృహంలో చేర్పించారు.

Updated Date - Feb 25 , 2024 | 03:15 AM