Share News

వ్యవసాయానికి విజ్ఞానం తోడు కావాలి

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:26 AM

వ్యవసాయ పరిశోధనా ఫలాలు కేవలం ల్యాబొరేటరీలకు పరిమితం కాకుండా అవి మరింత విస్తృత స్థాయిలో రైతులకు చేరాలని, అప్పుడే నిజమైన రైతు విప్లవం జరుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

వ్యవసాయానికి విజ్ఞానం తోడు కావాలి

పరిశోధనల ఫలితాలు ల్యాబ్‌కే పరిమితం కాకూడదు

విస్తృత స్థాయిలో రైతులకు చేరినపుడే సార్థకం

‘రైతునేస్తం’ పురస్కారాల ప్రదానోత్సవంలో వెంకయ్యనాయుడు

విజయవాడ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ పరిశోధనా ఫలాలు కేవలం ల్యాబొరేటరీలకు పరిమితం కాకుండా అవి మరింత విస్తృత స్థాయిలో రైతులకు చేరాలని, అప్పుడే నిజమైన రైతు విప్లవం జరుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. పరిశోధనల ఫలితాలను రైతుల దరికి చేర్చటానికి పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఎంతో దోహదపడతాయని, వాటిని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్టులో ‘రైతునేస్తం’ వ్యవసాయ మాసపత్రిక 20వ వార్షికోత్సవం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులకు రైతునేస్తం పురస్కారాలు-2024 అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఓవైపు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు, మెరుగైన పరిశోధనా ఫలితాలు వస్తున్నాయని, ఇదే సమయంలో మరోవైపు రైతుల సమస్యలను చూస్తుంటే బాధేస్తోందన్నారు. మన పండగ లు, ఆచార వ్యవహారాలన్నీ వ్యవసాయంతో ముడిపడి ఉంటాయన్నారు. రైతులు లేకపోతే ఎవరూ బతకలేరన్న విషయాన్ని గుర్తుంచుకుని అందరూ వ్యవసాయానికి, అన్నదాతలకు మద్దతు పలకాలన్నారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత లేకుండా చేయగలిగే శక్తి రైతులకు ఉందన్నారు. వ్యవ సాయం మరింత విస్తృతం కావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత వ్యవసాయ రంగంలోకి అడుగులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో కొందరు వ్యవసాయం మాని రచ్చబండలపై కూర్చుంటున్నారని, అది వారికి, సమాజానికి మంచిది కాదన్నారు. మాతృభాష లాగే వ్యవసాయాన్ని కూడా మరిచిపోకూడదన్నారు. వ్యవసాయానికి విజ్ఞానం తోడు కావాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే కాకుండా.. ఇతర సంస్థలు, వ్యక్తులు కూడా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల కృషిని బయటకు తీసుకొచ్చినప్పుడే వ్యవసాయ రంగానికి నిజంగా మేలు చేసిన వారవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతునేస్తం ఎడిటర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 03:26 AM