Share News

అగ్నికుల్‌కు నాలుగోసారీ నిరాశే..!

ABN , Publish Date - May 29 , 2024 | 03:45 AM

చెన్నైకి చెందిన ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ అగ్నికుల్‌ కాస్మోస్‌ నాలుగోసారీ తీవ్రంగా నిరాశపర్చింది.

అగ్నికుల్‌కు నాలుగోసారీ నిరాశే..!

అగ్నిబాన్‌ రాకెట్‌ ప్రయోగం మళ్లీ వాయిదా

ప్రైవేటు రాకెట్‌లో ఇగ్నైటర్‌ వైఫల్యం గుర్తింపు

ఐదు సెకన్ల ముందు ప్రయోగం నిలిపివేత

రెండు నెలల్లో నాలుగుసార్లు వాయిదా

సూళ్లూరుపేట, మే 28: చెన్నైకి చెందిన ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ అగ్నికుల్‌ కాస్మోస్‌ నాలుగోసారీ తీవ్రంగా నిరాశపర్చింది. ఈ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టదలచిన అగ్నిబాన్‌ సబ్‌ ఆర్బిటాల్‌ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్‌ (సార్టెడ్‌) రాకెట్‌ ప్రయోగం లాంచింగ్‌కు కొద్ది సెకన్ల ముందే నిలిచిపోయింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలో సొంతంగా ఏర్పాటు చేసుకున్న లాంచ్‌ ప్యాడ్‌ నుంచి మంగళవారం ఉదయం 5:48 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు అగ్నికుల్‌ ఏర్పాట్లు చేసింది. షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌, శాస్త్రవేత్తలతో కలిసి ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ప్రయోగాన్ని సమీక్షించారు. తొలుత హోల్డ్‌ డౌన్‌ రిలీజ్‌ మెకానిజం (హెచ్‌డీఆర్‌ఎం) వైఫల్యాన్ని గుర్తించడంతో ప్రయోగాన్ని హోల్డ్‌లో పెట్టారు. ఉదయం 9.30 గంటల వరకు ప్రయత్నించినప్పటికీ ఇగ్నైటర్‌ వైఫల్యం కూడా తలెత్తడంతో మరో ఐదు సెకన్లలో రాకెట్‌ పైకి ఎగరాల్సి ఉందనగా.. ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. ప్రయోగం మళ్లీ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ ఏడాది మార్చి 22న తొలిసారి, ఏప్రిల్‌ 6న రెండోసారి, 7న మూడోసారి రాకెట్‌ను కక్ష్యలోకి పంపేందుకు ప్రయత్నం చేయగా సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అనే ప్రైవేటు సంస్థ 2022 నవంబరులో విక్రమ్‌-ఎస్‌ సబ్‌-ఆర్బిటాల్‌ రాకెట్‌ను ప్రయోగించిన తర్వాత.. భారత్‌లో రెండో ప్రైవేటు రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టేందుకు అగ్నికుల్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అగ్నిబాన్‌ దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్‌ ఇంజన్‌ ఆధారిత రాకెట్‌. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్‌ ఇంజన్‌ను దీనిలో ఉపయోగిస్తున్నారు.

Updated Date - May 29 , 2024 | 08:19 AM