Share News

టీడీపీ వచ్చాక.. లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు!

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:16 AM

టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ యువతకు లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని ప్రవాసాంధ్ర టీడీపీ విభాగం నేతలు ప్రకటించారు.

టీడీపీ వచ్చాక..  లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు!

ప్రవాసాంధ్ర టీడీపీ నేతల ప్రకటన.. రాష్ట్రవ్యాప్త ప్రచారానికి శ్రీకారం

రంగంలోకి 25 ప్రచార వాహనాలు

జెండా ఊపి ప్రారంభించిన ఎన్నారై నేతలు

ఐదేళ్లుగా చీకటి పాలన

రాష్ట్రం వెనుకబడిపోయింది

యువత బాగా నష్టపోయారు

తిరిగి గాడిలో పెట్టడానికి బాబే రావాలి

ప్రవాస నాయకుల స్పష్టీకరణ

అమరావతి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ యువతకు లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని ప్రవాసాంధ్ర టీడీపీ విభాగం నేతలు ప్రకటించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్తున్న 25 ప్రవాసాంధ్రుల ప్రచార వాహనాలను ఆ విభాగం నేతలు వేమూరి రవికుమార్‌, రావి రాధాకృష్ణ, కానూరి శేషుబాబు, మేదరమెట్ల మల్లిక్‌, మంగలూరి భాను, బుచ్చిరాం ప్రసాద్‌ జెండాలు ఊపి ప్రారంభించారు. నాలుగు ప్రాంతాల్లోని 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో వీరు ప్రచారం చేస్తారు. అనంతరం ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు రవి కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను తెలుగువారు అందిపుచ్చుకోవడానికి గతంలో టీడీపీ విధానాలు, పాలన ఉపకరించాయి. విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి తమ వంతు సాయం చేయాలనుకున్న ప్రవాసాంధ్రుల ఆశలను వైసీపీ పాలన తీవ్రంగా దెబ్బతీసింది. వచ్చిన వారు వెనక్కి వెళ్లిపోయారు. కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. మళ్లీ టీడీపీ వచ్చాక ప్రవాసాంధ్ర పెట్టుబడులు రావడానికి మా వంతు కృషి చేస్తాం. మా విభాగం ద్వారా విదేశాల్లో కనీసం లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలను ఇక్కడి యువత పొందేలా చేస్తాం. ఒక్క ఐటీలోనే కాకుండా ఆరోగ్య రక్షణ, ఫార్మసీ, పర్యాటకం, వాణిజ్యంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఐరోపా, కెనడా, జపాన్‌లో అవకాశాలు బాగా వస్తున్నాయి. అమెరికాలో కూడా తెలుగువారి కంపెనీలు వేలల్లో ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఇరవై ఉద్యోగాలు ఇచ్చినా లక్ష ఉద్యోగాలు అవుతాయి. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఒక లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు మా ద్వారా కల్పిస్తాం.

అమెరికాలో ఇప్పుడు కొంత ఇబ్బంది ఉన్నా ఏడాదిలో అక్కడ గాడిలో పడుతుంది. ఇక్కడ మేం ముందుగానే తగిన నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పిస్తాం’ అని వివరించారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రవాసాంధ్రులు ప్రచారం చేయబోతున్నారని, మంచి ప్రభుత్వం ఉంటే మంచి భవిష్యత్‌ ఉంటుందనేది తమ నినాదమని రావి రాధాకృష్ణ చెప్పారు. ఇంత మంది ఎన్నారైలు ప్రచారానికి తరలిరావడం గతంలో ఎప్పుడూ చూడలేదని, ఈ రాష్ట్రంపై ప్రేమ.. ఇక్కడి అధ్వాన పరిస్థితులపై కసితో వస్తున్నారని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇప్పటికే శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నామని, దీని ద్వారా అమెరికాలో టీచర్లు, పర్యాటకం, ఆరోగ్య రంగాల్లో కొన్ని వందల మందికి ఉద్యోగాలు కల్పించామని మేదరమెట్ల మల్లిక్‌ తెలిపారు. ఐదేళ్ల చీకటి పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని, యువత బాగా నష్టపోయారని, దారి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు రావడం ఒక్కటే మార్గమని చాటుతామని నేతలు వెల్లడించారు.

ఎన్‌రైజ్‌ ఏపీ పేరుతో ప్రచారం

ఎన్‌రైజ్‌ ఏపీ పేరుతో తమ ప్రచారం నిర్వహించాలని ప్రవాసాంధ్ర టీడీపీ విభాగం నిర్ణయించింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ/కూటమి అభ్యర్థులను సమన్వయం చేసుకుని ఆయా నియోజకవర్గాల్లో యువతను, సాధారణ ప్రజలను కలిసి ఈసారి టీడీపీ/కూటమిని గెలిపించాల్సిన అవసరాన్ని వీరు వివరిస్తారు.

Updated Date - Apr 27 , 2024 | 04:16 AM