Share News

పది చదివి.. కోట్లకు పడగలెత్తి

ABN , Publish Date - May 23 , 2024 | 03:38 AM

బెట్టింగులు మాత్రమే తెలిసిన కుర్రాడు... కేవలం 10వ తరగతి మాత్రమే చదివినోడు... బుకీగా ఎదిగి విలాసాలకు చిరునామాగా మారాడు.

పది చదివి.. కోట్లకు పడగలెత్తి

బెట్టింగుల్లో ఆరితేరిన ‘లంకపల్లి’

ఖరీదైన విల్లాలు, కార్లతో విలాసాలు

రేవ్‌ పార్టీతో బయటపడిన బండారం

(ఆంధ్రజ్యోతి - విజయవాడ)

బెట్టింగులు మాత్రమే తెలిసిన కుర్రాడు... కేవలం 10వ తరగతి మాత్రమే చదివినోడు... బుకీగా ఎదిగి విలాసాలకు చిరునామాగా మారాడు. కోట్లాది రూపాయల ఆస్తులను పోగేశాడు. ఫార్మా కంపెనీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలంటూ ప్రపంచానికి అందమైన అబద్ధాన్ని పరిచయం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు, రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలను నెరిపాడు. చివరకి బెంగళూరు శివారు ఫాం హౌస్‌లో రేవ్‌ పార్టీ నిర్వహించి పోలీసులకు చిక్కాడు. అతడే విజయవాడ ఆంజనేయవాగు సెంటర్‌కు చెందిన లంకపల్లి వాసు అలియాస్‌ వాసు. పేదరికాన్ని జయించడానికి అక్రమ మార్గాన్ని ఎంచుకున్న వాసు తాను సంపాదించిన రూ.వందల కోట్లతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో తన అభిరుచులకు తగ్గట్టుగా విల్లాలను, అతిథి గృహాలను నిర్మించుకున్నాడు. పోలీసులకు చిక్కిన తరువాత వాసుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాసుకు తల్లి, అక్క, చెల్లి ఉన్నారు. వాళ్లంతా ఆంజనేయవాగులోనే ఉంటారు.

తండ్రి లేరు. బెంగళూరు పోలీసులకు, పార్టీకి వచ్చిన వారికి తన తండ్రికి ఫార్మ కంపెనీలు ఉన్నాయని చెప్పాడు. కొంతమందికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమని చెప్పాడు. వాస్తవానికి ఈ రెండింటితో వాసుకు ఎలాంటి పరిచయం లేదు. అతడితో పరిచయం ఉన్నవారు, స్థానికులు... వాసు 10 వరకే చదువుకున్నాడని చెబుతున్నారు. తల్లి ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషించేవారు. వాసు మాత్రం స్నేహితులతో తిరుగుతూ బెట్టింగ్‌ల వైపు అడుగులు వేశాడు. మెల్లగా బుకీగా ఎదిగాడు. అక్కడితో ఆగలేదు. తన చేతికింద వందల మంది బుకీలను పెట్టుకునే స్థాయికి ఎదిగాడు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి కాస్మోపాలిటన్‌ నగరాల్లో ఉన్న ప్రధాన బుకీలతో స్నేహాన్ని పెంచుకున్నాడు. బెట్టింగునే ఆదాయ వనరుగా మార్చుకున్న వాసు... ఒక్క విజయవాడ నగరంలోనే 150 మంది వరకు బుకీలను ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం విశాఖలో జింబాబ్వే, ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ఎక్కువమంది ఆస్ట్రేలియా గెలుస్తుందని బెట్టింగ్‌ కట్టారు. ఊహించని విధంగా జింబాబ్వే గెలిచింది. ఆ సమయంలో వాసుకు అనుబంధంగా ఉన్న బుకీలు రూ.5 కోట్ల వరకు ఎగ్గొట్టినట్టు సమాచారం.

విల్లాలన్నీ కోట్లలోనే...

ఆంజనేయవాగులో ఒక షెడ్‌లో ఉండే లంకపల్లి వాసు.. విజయవాడలో వైవీరావు ఎస్టేట్‌ వద్ద రూ.4 కోట్లతో సొంతంగా విల్లా కట్టించుకున్నాడు. దీంతోపాటు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లో ఈ తరహా విల్లాలున్నాయి. ప్రతి విల్లాకూ సీసీ కెమెరాల రక్షణ ఉంది. రూ.1.50 కోట్ల విలువైన 4కార్లను అతడు వినియోగిస్తున్నాడు. మరో 10కార్లు బినామీల పేర్లతో కొన్నాడని సమాచారం. నెలకోసారి విజయవాడకు వ స్తుంటాడు. అవన్నీ ఇక్కడున్న బుకీలకు, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది.

Updated Date - May 23 , 2024 | 03:39 AM