Share News

చేపల వేట చూసేందుకు వెళ్లి మృత్యువాత

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:12 AM

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ పరిధిలోని జల్లేరు వాగులో మునిగి శుక్రవారం సాయంత్రం ఇద్దరు మహిళలతో పాటు ఒక బాలుడు మృత్యువాత పడ్డారు.

చేపల వేట చూసేందుకు వెళ్లి మృత్యువాత

ముగ్గురిని మింగిన జల్లేరు వాగు

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 26: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ పరిధిలోని జల్లేరు వాగులో మునిగి శుక్రవారం సాయంత్రం ఇద్దరు మహిళలతో పాటు ఒక బాలుడు మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలివి.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దిబ్బగూడేనికి చెందిన షేక్‌ మౌలాలి చేపలు పడుతూ ఉంటాడు. అతనితోపాటు అతని భార్య షేక్‌ మొహిషా (23) ఆమె సోదరుడు షేక్‌ అషాద్‌ (14) సరదాగా జల్లేరు వాగుకు వెళ్లారు. వారి బంధువులు తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన షేక్‌ ఖాజాహుస్సేన్‌ కూడా చేపలు పడుతుంటాడు. అతను కూడా కుమార్తె షేక్‌ రేష్మా (24)ను తీసుకుని జల్లేరువాగు వద్దకు వెళ్లారు. మౌలాలి, ఖాజాహుస్సేన్‌ నీళ్లలో దిగి చేపలు పడుతున్నారు. అప్పటివరకు ఒడ్డున ఉన్న మొహిషా, రేష్మా, అషాద్‌ ఎండవేడిమి భరించలేక నీళ్లలోకి దిగారు. వీరు దిగిన ప్రాంతం గుండం కావడంతో ఒకరి తరువాత ఒకరు మునిగిపోయి మృత్యువాత పడ్డారు. ఈ సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ జ్యోతిబస్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 07:58 AM