Share News

నాలుగేళ్ల తర్వాత నా గడ్డకొచ్చా

ABN , Publish Date - Jan 14 , 2024 | 05:00 AM

‘‘నాలుగేళ్ల తర్వాత సొంత గడ్డమీద అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది.

నాలుగేళ్ల తర్వాత నా గడ్డకొచ్చా

ఈ అనుభూతిని మరవలేను

కష్టకాలంలో బాబు, లోకేశ్‌, పవన్‌ అండ

టీడీపీ-సేన అభ్యర్థిగా పోటీ చేస్తా: రఘురామ

రాజమహేంద్రి విమానాశ్రయం నుంచి

నరసాపురం వరకు భారీ ర్యాలీ

ఈ అనుభూతిని మరవలేను: రఘురామ

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), పెనుగొండ, జనవరి 13: ‘‘నాలుగేళ్ల తర్వాత సొంత గడ్డమీద అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది. తెలుగుదేశం నేతలు, జనసైనికులు అందరూ ప్రేమతో చూపించిన ఆదరణను నా జీవితంలో మర్చిపోలేను. టీడీపీ, జనసేన అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాను’’ అని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్‌తో విభేదాల వల్ల వివిధ రకాల కేసులకు గురైన రఘురామ సుమారు నాలుగేళ్ల నుంచి ఢిల్లీలో ఉండిపోయారు. కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన కోర్టు అనుమతి తీసుకుని నియోజకవర్గానికి వచ్చారు. శనివారం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడనుంచి ఆయన నరసాపురం చేరుకున్నారు. ఆయనకు భారీ పోలీసు భద్రత కల్పించారు. వందలాది మంది వివిధ పార్టీ నేతలు, అభిమానాలు ఆయనకు స్వాగతం పలికారు. గజమాలలతో సత్కరించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సింహం జిందాబాద్‌, సింహం నాయకత్వం వర్థిల్లాలని నినాదాలు చేశారు. అనంతరం ఆయన రావులపాలెం మీదుగా పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లారు. ‘‘నన్ను జైలులో పెట్టినప్పటి నుంచి చంద్రబాబు అందించిన సహకారం, లోకేశ్‌ ఇచ్చిన మద్దతు, పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన సహకారం జీవితంలో మర్చిపోలేను. కష్టంలో ఉన్నప్పుడే మనకు మనవాళ్లెవరో, పరాయివాళ్లెవరో అర్థమవుతుంది. ఇక్కడ ఇంత ఆదరాభిమానాలతో స్వాగతం పలకడం నా జన్మ ధన్యమనిపించింది. గతంలో జరిగిన సంఘటన దురదృష్టం, కష్టకాలంలో కూడా రాలేకపోయాను. ఇవాళ కోర్టు ప్రొటక్షన్‌తో వచ్చాను. పోలీసులు కూడా బాగా సహకరిస్తున్నారు. రాబోయే రోజులన్నీ మంచివే’’ అని ఆయన అన్నారు.

సొంత గడ్డ స్వాగతం...

రావులపాలెం నుంచి ర్యాలీగా వచ్చిన రఘురామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా దొంగరావిపాలెం వద్ద టీడీపీ, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి సొంత జిల్లాలో అడుగు పెట్టకుండా ప్రజలకు సేవలు చేయనివ్వకుండా అడ్డంకులు కల్పించిందన్నారు. దాదాపు నాలుగేళ్లు వనవాసం చేయించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ వాటన్నింటిని అఽధిగమించి సొంత గడ్డపై అడుగు పెట్టానని తెలిపారు. దొంగరావిపాలెం మీదుగా ర్యాలీ సిద్ధాంతం, రామన్నపాలెం, వడలి, పెనుగొండ మీదుగా సాగింది. జనసేన, టీడీపీ నాయకులు భారీగా మోటారు సైకిళ్లు, కార్లతో ర్యాలీగా భీమవరం బయలుదేరి వెళ్లారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, మెంటే పార్థసార థి, జనసేన నాయకులు బొమ్మిడి నాయకర్‌, చేగొండి సూర్యప్రకాశ్‌, యర్రగొప్పుల నాగరాజు, శిరిగినీడి రాజ్యలక్ష్మి ఉన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 06:37 AM