Share News

ఉద్యోగుల నిరవధిక సమ్మె వాయిదా

ABN , Publish Date - Mar 22 , 2024 | 03:52 AM

పాత పింఛన్‌ పథకం(ఓపీఎ్‌స)ను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ప్రభుత్వ, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు మే 1 నుంచి చేపడతామని ప్రకటించిన నిరవధిక సమ్మెను వాయిదా వేశారు.

ఉద్యోగుల నిరవధిక సమ్మె వాయిదా

మే 1 నుంచి నిరవధిక సమ్మెకు గతంలో పిలుపు

ప్రభుత్వం గడువు కోరడంతో అంగీకరించిన జేఎ్‌ఫఆర్‌వోపీఎస్‌

న్యూఢిల్లీ, మార్చి 21: పాత పింఛన్‌ పథకం(ఓపీఎ్‌స)ను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ప్రభుత్వ, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు మే 1 నుంచి చేపడతామని ప్రకటించిన నిరవధిక సమ్మెను వాయిదా వేశారు. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ, కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ సహా ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేఎ్‌ఫఆర్‌వోపీఎ్‌స (ది జాయింట్‌ ఫోరం ఫర్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌) గురువారం వెల్లడించింది. ఓపీఎస్‌ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కావాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించామని జేఎ్‌ఫఆర్‌వోపీఎస్‌ కన్వీనర్‌ శివగోపాల్‌ మిశ్రాచెప్పారు. ‘రాష్ట్రాలను, వివిధ విభాగాలను సంప్రదించడానికి మరింత సమయం కావాలని వారు మాకు చెప్పారు. ఈ ప్రతిపాదనకు మేం అంగీకరించాం. అందుకే సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించాం’ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పింఛన్‌ వ్యవస్థపై సమీక్షించేందుకు సోమనాథన్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు కూడా జరిపింది. కమిటీ నివేదిక సమర్పించడంలో జాప్యం గురించి కూడా జేఎ్‌ఫఆర్‌వోపీఎస్‌ ప్రతినిధులకు ఆర్థికశాఖ కార్యదర్శి వివరించారని, అయితే, ఈ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కమిటీ నిర్విరామంగా కృషి చేస్తోందని భరోసా ఇచ్చారని శివగోపాల్‌ మిశ్రా తెలిపారు. ‘కమిటీపై నమ్మకం ఉంచాలని ఆయన మమ్మల్ని కోరారు. అలాగే, పార్లమెంటులో ప్రకటన ద్వారా కమిటీని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా గుర్తించాలని ఆయన కోరారు. అందుకే ప్రభుత్వానికి మరికొంత గడువు ఇవ్వాలని నిర్ణయించాం’ అని మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది జూన్‌, జూలై నెలలతోపాటు ఈనెల 14న కూడా సోమ్‌నాథన్‌ కమిటీ సమావేశాలు నిర్వహించింది. కమిటీ రాష్ట్ర ప్రభుత్వాలతోనూ క్రియాశీలకంగా సంప్రదింపులు జరుపుతోందని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా జారీచేసిన ఓ సర్క్యులర్‌లో పేర్కొంది.

Updated Date - Mar 22 , 2024 | 07:35 AM