Share News

వైసీపీలో ‘ఆడను’

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:26 AM

అధికార వైసీపీలో వలసల పర్వం కొనసాగుతోంది. వైసీపీలో ఇటీవల చేరిన భారత మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు వారం తిరగకుండానే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.

వైసీపీలో ‘ఆడను’

మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు గుడ్‌ బై

పార్టీ వీడే యోచనలో ఎమ్మెల్యే పార్థసారథి

ఈ నెల 18న టీడీపీలో చేరే అవకాశం

గుంటూరు నుంచైతే పోటీ చేయనన్న లావు

గుంటూరు/విజయవాడ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): అధికార వైసీపీలో వలసల పర్వం కొనసాగుతోంది. వైసీపీలో ఇటీవల చేరిన భారత మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు వారం తిరగకుండానే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. తాను వైసీపీని వీడుతున్నట్లు శనివారం ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ప్రకటించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నానని, తదుపరి కార్యాచరణను రాబోయే రోజుల్లో తెలియజేస్తానని పేర్కొన్నారు. గుంటూరు టికెట్‌ ఇస్తామని ఆశ చూపించి నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటనలు చేయించిన జగన్‌.. తీరా గుంటూరు సీటును శుక్రవారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుకు ఆఫర్‌ చేయడంతో రాయుడు తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది.

వైసీపీ నుంచి మరో వికెట్‌!: ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. 18వ తేదీన గుడివాడలో జరిగే ‘రా కదలి రా’ సభలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తాను టీడీపీలో చేరడానికి సుముఖంగా ఉన్నానని, పెనమలూరు నుంచి తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. పెనమలూరు కాకుండా ఒంగోలు ఎంపీ స్థానం నుంచి ఆయన్ను బరిలోకి దింపేందుకు టీడీపీ పెద్దలు సుముఖత చూపినట్లు తెలిసింది. అయితే సారథి పెనమలూరు కోసమే పట్టుబట్టడంతో చివరికి ఆయన్ను నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు టీడీపీ పెద్దలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి కూడా వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిద్దరూ కాంగ్రె్‌సలో చేరడానికి సిద్ధమవుతున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు.

గుంటూరు అయితే నో: లావు

నరసరావుపేట నుంచి అయితేనే తాను తిరిగి పోటీ చేస్తానని జగన్‌కు కరాకండిగా చెప్పానని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు స్పష్టం చేశారు. శనివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం సీఎం జగన్‌ తనను పిలిపించుకొని ఈ పర్యాయం గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు చెప్పారు. అయితే అందుకు తాను ఒప్పుకోనని నిర్మొహమాటంగా చెప్పానన్నారు. పల్నాడులో అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఉన్నాయని వాటిని పూర్తి చేయాలంటే తిరిగి తాను అక్కడ నుంచి గెలిస్తేనే వీలవుతుందని సీఎంకు వివరించానని చెప్పారు. నరసరావుపేటను వదిలి గుంటూరు నుంచి పోటీ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పినట్లు తెలిపారు.

Updated Date - Jan 07 , 2024 | 06:49 AM