‘అడహాక్’ రాజకీయం!
ABN , Publish Date - Jul 15 , 2024 | 04:35 AM
నాలుగో సింహంలా పనిచేయాల్సిన పోలీసుల్లో కొందరు జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు.
నాడు టీడీపీ నేతలపై తొడలు కొట్టిన పోలీసు సంఘం నేతలు
ఐదేళ్లు వైసీపీతో అంటకాగి చంద్రబాబుపైనా పరుష విమర్శలు
నేడు ప్రభుత్వం మారగానే ఊసరవెల్లులు
మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు
వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై పోలీసు సిబ్బంది విస్మయం
నాలుగో సింహంలా పనిచేయాల్సిన పోలీసుల్లో కొందరు జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు. ముఖ్యంగా పోలీసు అధికారుల సంఘం అడహాక్ కమిటీ ముఖ్య నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారు. పోలీసులు చేసిన తప్పులను ఎత్తిచూపితే మీడియా ముందుకొచ్చి మీసం మెలేసి, తొడలు కొట్టారు. మాజీ సీఎం అన్న గౌరవం కూడా లేకుండా చంద్రబాబును, టీడీపీ నేతలను దుర్భాషలాడారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలంటూ జిల్లాల్లో తిరిగి ప్రచారం చేసిన ఆ ‘అధికార’ నేతలు రాజకీయం మొదలుపెట్టారు. ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చేస్తున్నారు. పదవులు కాపాడుకోవడానికి..క్రిమినల్ కేసుల మాఫీకి టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల చుట్టూ ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరినీ కలుస్తూ బొకేలిస్తూ వారి ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. వైసీపీతో అంటకాగిన అడహాక్ కమిటీ నేతలకు మంత్రులు, ఎమ్మెల్యేలు అపాయింట్‌మెంట్ ఇచ్చి, ఫొటోలు దిగడంపై పోలీసు శాఖలోని ఇతర అధికారులు, ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలో ఉండగా కొంతమంది పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు. విజయవాడ కేంద్రంగా పనిచేసిన భూకబ్జాల మాఫియాలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ప్రస్తుత అడహాక్ కమిటీలో ఉన్న ఇద్దరు, ముగ్గురు నేతలపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి న్యాయస్థానాల్లో విచారణ కూడా సాగుతోంది. ఏ ఉద్యోగ సంఘంలో అయినా క్లీన్‌చిట్ ఉన్న వారిని నాయకులుగా ఎన్నుకుంటారు. పోలీసు అధికారుల సంఘం అడహాక్ కమిటీలో మాత్రం నేరారోపణలు ఉన్న వారికి స్థానం కల్పించారు. విజయవాడకు చెందిన ఒక ‘రియల్’ మోసగాడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రూ.150 కోట్ల విలువ చేసే ఆస్తికి నకిలీపత్రాలు సృష్టించి కాజేయడానికి స్కెచ్ వేశాడు. దీనికి రూపకల్పన మొత్తం విజయవాడ కేంద్రంగానే సాగింది. అడహాక్ కమటీలో కీలకంగా ఉన్న నేత ఆ మోసగాడికి సహకరించారని ఆరోపణలు వచ్చాయి. ఆయనపైనా కేసు నడుస్తోంది. కాగా.. పోలీసు అధికారుల సంఘానికి ప్రతి మూడేళ్లకోసారి ఎన్నికలు జరపాలి. అయితే దీనిపై కోర్టులో వివాదం ఉండడంతో.. అడహాక్ కమిటీని ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ఈ కమిటీ పదవీకాలం ఆరు నెలలే. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఏర్పడిన అడహాక్ కమిటీ ఆరు నెలలకు మారాల్సి ఉండగా.. ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. - విజయవాడ, ఆంధ్రజ్యోతి
‘మా మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన మీది అసలు నోరేనా?’
ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబునుద్దేశించి పోలీసు అధికారుల సంఘం అడహాక్ కమిటీ నేత వ్యాఖ్య ఇది.
‘వర్ల రామయ్యా... ఖబడ్దార్.. పోలీసుల జాతకాలు నీకు తెలియడం కాదు. నీ జాతకమే మా దగ్గర ఉంది.’
ఉస్తాద్‌లా మీసం మెలేసి, తొడగొట్టిన మరో నేత.
‘పోలీసులు జగన్‌కు రుణపడి ఉంటారు. 60 వేల కుటుంబాల్లో ఆయన వెలుగులు నింపారు.’
ఇవ్వని వీక్లీఆ్‌ఫలపై నాటి సీఎం జగన్‌కు సంఘం మరో నేత ఇచ్చిన కితాబు.