‘వక్ఫ్‌బోర్డు’ పర్యవేక్షణకు అడ్‌హాక్ కమిటీ
ABN , Publish Date - Feb 18 , 2024 | 03:45 AM
ఏపీ వక్ఫ్‌బోర్డు పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు హైకోర్టు అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసింది. మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి మహ్మద్ ఇంతియాజ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి. ఉషాకుమారి, ఐపీఎస్ అధికారి ఆరిఫ్ హఫీజ్‌లను
ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన హైకోర్టు
విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ఏపీ వక్ఫ్‌బోర్డు పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు హైకోర్టు అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసింది. మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి మహ్మద్ ఇంతియాజ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి. ఉషాకుమారి, ఐపీఎస్ అధికారి ఆరిఫ్ హఫీజ్‌లను కమిటీలో నియమించింది. వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడం తప్ప ఆస్తులను అన్యాక్రాంతం చేయడం కానీ, ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే బోర్డు ఆస్తులకు సంబంధించిన లీజులను 11 నెలలకు మించి పొడిగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య ఇటీవల తీర్పు ఇచ్చారు. ఏపీ వక్ఫ్‌బోర్డు పరిపాలనా వ్యవహారాల నిర్వహణను ఎలాంటి కేసులు, ఆరోపణలు లేని ఖాదర్ బాషా, సయ్యద్ సఫీ అహ్మద్ ఖాద్రీ, మీర్ హుస్సేన్, హఫీజ్ ఖాన్‌లకు అప్పగించేలా మైనార్టీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ సయ్యద్ సఫీ అహ్మద్ ఖాద్రీ, మీర్ హుస్సేన్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ‘‘వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎన్నికను నిలుపుదల చేస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు బోర్డు కార్యకలపాలపై ప్రభావం చూపుతున్నాయి. పిటిషనర్లను బోర్డు సభ్యులుగా నియమించి వారిలో ఒకరిని బోర్డు చైర్మన్‌గా నియమించేలా అధికారులను ఆదేశించండి’’ అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి అవరోధాలు లేకుండా బోర్టు తన కార్యకలాపాలు సాగాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. పిటిషనర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మరో సీనియర్ న్యాయవాది వీఎ్‌సఆర్ ఆంజనేయులు వాదనలు వినిపిస్తూ.. ఖాదర్ బాషాను వక్ఫ్ బోర్డు సభ్యుడిగా నియమించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశామని కోర్టుకు వివరించారు.