Share News

రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్టు

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:06 AM

సంచలనం సృష్టించిన రేవ్‌పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు ఎలకా్ట్రనిక్‌ సిటీలోని జీఆర్‌ ఫాంహౌ్‌సలో జరిగిన రేవ్‌పార్టీలో పాల్గొని, డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో జరిగిన రేవ్‌పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేసి..

రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్టు

విచారణ తర్వాత అరెస్ట్‌ చేసిన పోలీసులు

వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలింపు

14 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీ విధింపు

బెంగళూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన రేవ్‌పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు ఎలకా్ట్రనిక్‌ సిటీలోని జీఆర్‌ ఫాంహౌ్‌సలో జరిగిన రేవ్‌పార్టీలో పాల్గొని, డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో జరిగిన రేవ్‌పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేసి.. పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మొత్తం 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్ధారణ అయినట్టు పోలీసులు వెల్లడించారు. వారిలో హేమ కూడా ఉన్నారు. రేవ్‌పార్టీపై దాడి చేసిన రోజే ఐదుగురు మాదక ద్రవ్యాల వ్యాపారులు, పార్టీ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు హేమకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నానని, హాజరు కాలేనని ఆమె సమాధానమిచ్చారు. అయితే హేమకు మూడోసారి నోటీసులు పంపించగా.. ఆమె సోమవారం విచారణకు హాజరయ్యారు. పక్కా ఆధారాలు చూపిన సీసీబీ అధికారులు, విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అనంతరం మల్లేశ్వరంలోని కేసీ జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా.. న్యాయాధికారి ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. రేవ్‌పార్టీ వ్యవహారంలో ఆరంభం నుంచే హేమ తీరు విమర్శలకు తావిచ్చింది. పార్టీలో పట్టుబడిన విషయం బయటకు రాగానే ఆమె ఓ వీడియో విడుదల చేసి తాను హైదరాబాద్‌లో ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేశారు. అరెస్టయ్యాక సోమవారం ఆస్పత్రికి తరలించిన సమయంలోనూ ఆమె బురఖా ధరించి కనిపించారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినప్పుడు పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె అరెస్టుకు ప్రధాన కారణం డ్రగ్స్‌ సేవించడం, రేవ్‌ పార్టీలో లేనని నమ్మించేందుకు ఓ వీడియో పోస్టు చేసి తప్పుదారి పట్టించడమే కాకుండా.. తొలిరోజు పట్టుబడిన ఐదుగురు హేమ పేరును ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

రేవ్‌ పార్టీలో నేను లేను: హేమ

రేవ్‌ పార్టీలో తాను లేనని, బర్త్‌డే కేక్‌ కట్‌ చేసిన వెంటనే హైదరాబాద్‌కు వెనుదిరిగానని సినీనటి హేమ అన్నారు. విచారణకు హాజరైన హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం అరెస్టు చేసి న్యాయాధికారి ముందు హాజరు పరిచారు. కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో హేమ మీడియాతో మాట్లాడారు. తాను బెంగళూరు రేవ్‌పార్టీలో లేనని, కేక్‌ కట్‌ చేశాక వెళ్లిపోయానని అన్నారు. హైదరాబాద్‌ నుంచే ఆ రోజు వీడియో పెట్టానని చెప్పారు. మరుసటి రోజు బిరియానీ వండిన వీడియో కూడా హైదరాబాద్‌దేనని అన్నారు. పట్టుబడినట్లు చెబుతున్న రోజు ఎటువంటి టెస్ట్‌లు చేయలేదని, పాజిటివ్‌ లేదని అన్నారు. ఈ రోజే శాంపిల్స్‌ తీసుకున్నారని ఆమె తెలిపారు. అంతకుముందు వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన సమయంలోనూ హేమ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

Updated Date - Jun 04 , 2024 | 04:06 AM