Share News

నట వీర.. నట శూర!

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:13 AM

ఐదేళ్లుగా బారికేడ్లు పెట్టి, పరదాలు కట్టి జనాన్ని ఆమడ దూరంలో ఉంచారు. ఇప్పుడు మరోసారి అధికారం కోసం నానా అగచాట్లు పడుతున్నారు.

నట వీర.. నట శూర!

ఎన్నికల ప్రచారంలో జగన్‌ అద్భుత ప్రదర్శన

స్ర్కిప్టు ప్రకారం బయట పడుతున్న ‘జాలి గుండె’

ఐదేళ్లు జనాన్ని ఆమడ దూరం ఉంచిన జగన్‌

వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినా ఈడ్చి పడేయడమే

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఐదేళ్లుగా బారికేడ్లు పెట్టి, పరదాలు కట్టి జనాన్ని ఆమడ దూరంలో ఉంచారు. ఇప్పుడు మరోసారి అధికారం కోసం నానా అగచాట్లు పడుతున్నారు. ‘నాది జాలిగుండె’ అని చెప్పుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఇదంతా ‘ఐప్యాక్‌’ ఆడిస్తున్న కరుణ రసాత్మక నాటకం! షెడ్యూలు విడుదలకు ముందు జనాన్ని పట్టించుకోని జగన్‌... ఎన్నికల ప్రచారంలో మాత్రం ‘ఎంతటి కరుణామయుడో’ అనిపించే స్థాయిలో పెర్ఫామెన్స్‌ చూపిస్తున్నారు. ఈ రెండు సీన్లు చూస్తే మీకే ఆ విషయం అర్థమవుతుంది.

సీన్‌ 1: ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందు..

అది ధర్మవరం మండలం తుంపర్తి గ్రామం. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం రైతుల నుంచి భూమి సేకరించింది. కానీ... ఏళ్లు గడుస్తున్నా పరిహారం చెల్లించలేదు. నార్పలకు వచ్చిన జగన్‌ తిరుగు ప్రయాణంలో పుట్టపర్తి విమానాశ్రయానికి రోడ్డు మార్గాన వెళుతున్నారని తెలిసి.. బాధిత రైతులు, ఆ కుటుంబాలకు చెందిన మహిళలు, వృద్ధులు రోడ్డుపైకి వచ్చారు. సీఎంకు తమ గోడు విన్నవించుకునే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది వారిని పక్కకు ఈడ్చి పడేశారు. వృద్ధులు, మహిళల్ని రోడ్డుపై నుంచి లాగి పడేస్తున్నదంతా చూసి కూడా జగన్‌ రెడ్డి పట్టించుకోలేదు. ముఖం పక్కకు తిప్పుకొని రయ్యిన కాన్వాయ్‌ కార్లలో పుట్టపర్తి వైపు వెళ్లిపోయారు. రెండు మూడు నెలల ముందు ఈ ఘటన జరిగింది. ఇదే కాదు! జగన్‌ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఇదే తంతు. బారికేడ్లు అడ్డు పెట్టడం, పరదాలు కట్టడం! ఏ ఒక్కరూ ఆయన సమీపానికి కూడా వచ్చే వీలు లేకుండా చేశారు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి రోడ్డుపక్క నిలబడి ఏ వినతి పత్రమో ఇచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు వారిని పక్కకు నెట్టేసేవారు. ఇక... విపక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులను ఒకరోజు ముందే గృహ నిర్బంధంలో పెట్టడం రివాజుగా మారింది.

సీన్‌ 2: ఎన్నికల ప్రచారంలో...

జగన్మోహన్‌ రెడ్డి బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులో కూర్చుంటారు. ముందూ వెనుకా అటూ ఇటూ భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. బస్సు ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతలో రోడ్డు పక్క నుంచి... ఒకరో ఇద్దరో ‘అన్నా... జగనన్నా’ అని కేకలు వేస్తారు. అదేమి చిత్రమోకానీ, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో కూర్చున్న జగన్‌కు వాళ్ల పిలుపు వినిపిస్తుంది. వెంటనే... ‘ఆపేయ్‌’ అంటూ జగన్‌ సైగ చేయగానే, డ్రైవరు బస్సును ఆపేస్తాడు. రోడ్డుపక్కన ఉన్న ఆ ఒకరిద్దరినీ పోలీసులు నిలువరిస్తుండగా... జగన్‌ బస్సు దిగొస్తారు. వారిని ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. వారితోపాటు కింద కూర్చుని యోగక్షేమాలు అడుగుతారు. ఆ వెంటనే... సొంత మీడియా.. కూలి మీడియాలో ‘హోదాను కూడా మరిచి పేదలకోసం కిందికి దిగిన జగనన్న’ అంటూ వీడియో క్లిప్పులు, ఫొటోలతో హోరెత్తిస్తారు. ఈ తతంగమంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోందనే అనుమానాలూ ఉన్నాయి. ఒక జిల్లాలో రెండు కాళ్లు లేని దివ్యాంగుడు... మరో జిల్లాలో ఒంటరి మహిళ... ఇంకో చోట ముస్లిం మైనారిటీకి చెందిన పెద్దాయన... ఇలా పరామర్శలు కూడా ఒక స్కీమ్‌ ప్రకారం సాగుతుండటం గమనార్హం. గతంలో ఇలా రోడ్డుపక్కన ఉన్న వారిని ఈడ్చేసిన పోలీసులే... ఇప్పుడు సున్నితంగా వ్యవహరిస్తూ, కెమెరా యాంగిల్‌ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెరసి... ఇదంతా ఐ ప్యాక్‌, రోత మీడియా బృందం కథ, స్ర్కీన్‌ ప్లే, దర్శకత్వంలో నడుస్తున్న నాటకమని ఇట్టే అర్థమవుతుంది.

Updated Date - Apr 03 , 2024 | 04:13 AM