మాటలతో కాకపోతేనే చర్యలు!
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:21 AM
బుడమేరు మార్గంలో అక్రమంగా నిర్మాణాలు చేసిన వారితో మాట్లాడాలని, ఆ తర్వాతే తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. హైడ్రా వంటి వ్యవస్థ కంటే కూడా ఇదే మేలైన విధానమన్నారు.
ఆక్రమణదారుల విషయంలో ‘హైడ్రా’ కంటే కూడా ఇదే మేలు
విజయవాడను నిలబెట్టేందుకు సీఎం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు
4 అడుగుల లోతున జగనన్న కాలనీలు
వైసీపీ తప్పులకు ఇప్పుడు పేదలకు నరకం
కాకినాడ జిల్లా వరద ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
కాకినాడ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : బుడమేరు మార్గంలో అక్రమంగా నిర్మాణాలు చేసిన వారితో మాట్లాడాలని, ఆ తర్వాతే తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. హైడ్రా వంటి వ్యవస్థ కంటే కూడా ఇదే మేలైన విధానమన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. కాకినాడ జిల్లా వరద ముంపు ప్రాంతమైన గొల్లప్రోలులో సోమవారం ఆయన పర్యటించారు. సుద్దగడ్డ వరద ముంపు బారిన పడిన పేదల ఇళ్ల కాలనీని పవన్ సందర్శించారు. కాలనీకి బోటుపై వెళ్లి అక్కడినుంచి వరద నీటిలోను, బురదమయంగా మారిన రహదారుల్లోను తిరిగి బాధితులతో మాట్లాడారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘చాలామంది తెలిసో తెలియకో బుడమేరు పరీవాహక ప్రాంతాలను ఆక్రమించి ఉంటారు. అది ఆక్రమణ స్థలం అని తెలియక కొనుగోలు చేసిన వారున్నారు. ఇలాంటి వారందరితో కూర్చొని మాట్లాడితే బాగుంటుంది’’ అని అన్నారు. నదులు, వాగులు, ఇతర పరీవాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలని పవన్ అభిప్రాయపడ్డారు. అనుకోకుండా వచ్చిన అకాల వర్షాలతో విజయవాడకు వరద పోటెత్తిందని, దాని నుంచి కోలుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారన్నారు. జగనన్న కాలనీల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారని తెలిపారు. ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో తాము సరిచేయాల్సి ఉందన్నారు. గొల్లప్రోలులో పేదల ఇళ్లకాలనీ పేరుతో లోతట్టు ప్రాంతంలో నాడు 32 ఎకరాలను కొనుగోలు చేశారని, ఇది నాలుగు అడుగుల లోతులో ఉందని తెలిపారు. రూ.30లక్షల మార్కెట్ ధర ఉన్న భూమిని రూ.60లక్షలకు కొనుగోలు చేశారని చెప్పారు. ఇలాంటి ముంపు ప్రాంతాల్లో గత జగన్ ప్రభుత్వం స్థలాలు ఇవ్వడంవల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముంపు ప్రాంతాల్లో పవన్ పర్యటన..
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. మునిగిపోయిన పేదల ఇళ్ల వద్దకు ఆయన బోటులో వెళ్లారు. బురదలో నడుచుకుంటూ బాధితులను పరామర్శించారు. ప్రతిఒక్కరి సమస్యను విన్నారు. పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ బోటెక్కి కలెక్టర్‌తో కలిసి ముంపునకు గురైన కాలనీకి వెళ్లారు. ముంపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.