Share News

సేవపైనా సాధింపులు!

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:52 AM

ఎన్నికల వేళ సీఎం జగన్‌ తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. దశాబ్దాల తరబడి పేద ప్రజలకు అంతోఇంతో సేవలందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలపై కన్నేశారు.

సేవపైనా సాధింపులు!

కూటమి అభ్యర్థుల ట్రస్టులపై కొరడా

అన్నింటా రాజకీయమే చూసే... అన్నింటినీ రాజకీయం చేసే వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ‘సేవ’లోనూ రాజకీయాన్నే చూస్తున్నారు. జగన్‌ రాజకీయాల్లోకి రాకముందే... ఇంకా చెప్పాలంటే ఆయన పుట్టకముందు నుంచే సేవాభావంతో ఏర్పాటైన ట్రస్టులను వేధించి, సాధించే పనిలో పడ్డారు. కారణం... ఆయా ట్రస్టులను నడుపుతున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు కావడమే! తాను సొంతంగా పైసా తీసి ప్రజలకు పంచింది లేదుకానీ... ప్రజలకు సేవ చేస్తున్న ట్రస్టులను మాత్రం వేధిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయా ట్రస్టుల కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా వేయాలని ఆదేశించారు.

స్వచ్ఛంద సేవా సంస్థలకు ‘రాజకీయ’ మకిలి

కేన్సర్‌ ఆస్పత్రి నిర్వహణలో బాలకృష్ణ ట్రస్టు

తండ్రి పేరిట ఽధూళిపాళ్ల డీవీసీ చారిటబుల్‌

దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌

ఎన్నికలవేళ వాటి ఉనికిపై జగన్‌కు తగని అనుమానం!

శూలశోధన చేయాలంటూ అధికారులకు ఆదేశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల వేళ సీఎం జగన్‌ తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. దశాబ్దాల తరబడి పేద ప్రజలకు అంతోఇంతో సేవలందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలపై కన్నేశారు. అధికారంలోకి వచ్చీరాగానే పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లను ధ్వంసం చేసినట్లే, ఇప్పుడు ఎన్నికలవేళ టీడీపీ, మిత్రపక్షాల అభ్యర్థులకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థలపై విరుచుకుపడుతున్నారు. ‘‘ఆ సంస్థలు ఎందుకు పుట్టాయి? ఏం చేస్తున్నాయి? సేవ ముసుగులో అవేం చేస్తున్నాయి? వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ట్రస్ట్‌ పేరిట ఎన్నికల్లో అభ్యర్థులు ఏమైనా ప్రచారం చేసుకుంటున్నారా? వాటిపై నిఘావే సి తనిఖీలు చేయండి. వాటి కదలికలను నియంత్రించండి. సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారా? తదిత ర సమాచారాన్ని అందించండి’’ అని రకరకాల ఆంక్షలతో ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో చాలా సంస్థలు పదేళ్లపైబడే ఉన్నాయి. కొన్ని పాతిక ముప్ఫైఏళ్ల నుంచీ పనిచేస్తున్నవి ఉన్నాయి. ఉదాహరణకు బనగానపల్లెకు చెందిన జనార్దన్‌రెడ్డి కుటుంబానికి చెందిన అరుణభారతి ట్రస్ట్‌ 1976 నుంచి నడుస్తోంది. చంద్రబాబుకు చెందిన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఈనాటిది కాదు. కేన్సర్‌ రోగుల పాలిట సంజీవని లాంటి బసవతారకం కేన్సర్‌ ఫౌండేషన్‌ గత కొన్ని దశాబ్దాలుగా సేవలందిస్తోంది. అంతెందుకు... స్వయానా జగన్‌ గతంలో ఓ ట్రస్ట్‌ పేరిట కడప జిల్లాలో అనధికారికంగా చక్రం తిప్పారు. అధికారిక సమావేశాల్లో ఆ ట్రస్ట్‌ పేరిట పాల్గొనేవారు. ఆ ట్రస్ట్‌ ఏమైందో ఎవ్వరికీ తెలియదు. కానీ, ఇతరుల సంస్థలపై ఇప్పుడు ఆయన విరుచుకుపడుతున్నారు. ఆ సంస్థల నుంచి సేవలు పొందిన వారికి అవి ఎంత పారదర్శకమైనవో, తమకు కష్టకాలంలో ఎంతగా అండగా ఉన్నాయో తెలుసు. కానీ ఇప్పటివరకు వాటి పనితీరు, ఆర్థిక మూలాల గురించి ఆరాతీయని సర్కారు, తీరా ఎన్నికల సమయంలో, అందులోనూ పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు వాటిపై కన్నేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సర్దార్‌గౌతులచ్చన్న చారిటబుల్‌ ట్రస్ట్‌ అనేది జగన్‌ రాజకీయాల్లోకి రాకముందు నుంచే పనిచేస్తోంది. పేదలు, బడుగువర్గాలకు సేవచేయడమే లక్ష్యంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఇప్పుడు ఆ సంస్థలోకి ప్రభుత్వ అధికారులను పంపించి తనిఖీల పేరిట వేధించడమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.


కేన్సర్‌ ట్రస్ట్‌ పైనా పగ

బసవతారకం కేన్సర్‌ ట్రస్ట్‌ జగమెరిగిన సంస్థ. కేన్సర్‌బారిన పడిన తెలుగు ప్రజలే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల వారు కూడా ఈ ట్రస్ట్‌ను ఆశ్రయించి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేన్సర్‌ రోగుల పాలిట ఆ ట్రస్ట్‌ ఆశాకిరణంగా నిలిచింది. హిందూపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ తన తల్లిపేరిట ఏర్పాటు చేసిన సంస్థ అది. ఆ సంస్థలోనూ శూలశోధన చేయాలని సర్కారు ఆదేశాలు ఇచ్చింది. ఆ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందులో పనిచేసేవారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారా? అని ఆరాతీసి చర్యలు తీసుకోవాలని జగన్‌.... అధికారులను ఆదేశించారు. రోగుల సేవలో తరించే ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటారని, బాలకృష్ణ కోసం పనిచేస్తారన్నది జగన్‌ నమ్మకం అయి ఉండొచ్చు. ఇప్పటివరకు ఎన్నికల్లో ఆ ట్రస్టు సేవలు బాలకృష్ణ వినియోగించుకోలేదు. ఆ అవసరమూ రాలేదు.

ధూళిపాళ్లపై కోపం.. ఆయన ట్రస్ట్‌పై...

డీవీసీ చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలు ఎంతగా ఉపయోగపడుతున్నాయో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లా ప్రజలకు బాగా తెలుసు. టీడీపీ నేత ధూళిపాళ్ల న రేంద్ర తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి స్మారకార్థం పాడిరైతుల సంక్షేమం, విద్య, ఆరోగ్యం కోసం ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ట్రస్టు నుంచి సేవలు పొందుతున్న ఏ ఒక్కరిని కదిలించినా ఇదే చెబుతారు. జగన్‌కు మాత్రం ఆ ట్రస్టులో సేవకన్నా ధూళిపాళ్ల నరేంద్ర రాజకీయ ఎదుగుదలే ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా ఉంది. అందుకే అక్కడా శూలశోధన చేయాలని అధికారులను పురమాయించారు.


ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ పైనా గురి

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అనేది టీడీపీ కార్యకర్తలతోపాటు, బడుగు, బలహీనవర్గాలు, అపన్నులకు విద్య,వైద్యం అందించే సంస్థ. వైసీపీ దాడుల్లో మరణించిన టీడీపీ కార్యకర్తల పిల్లలకు అక్కడ ఉచితంగా రెసిడెన్షియల్‌ విద్యనందిస్తున్నారు. విపత్తులు, ప్రమాదాల సమయంలో ట్రస్టు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మీడియా పబ్లిసిటీ కోసం ఫొటోలకు ఫోజులిచ్చి హడావుడి చేసే సంస్థ కాదది. విపత్తు సంభవించినచోట్ల ప్రభుత్వ సంస్థలకన్నా ముందే నిలిచి ప్రజలకు ఆపన్నహస్తం అందిస్తోంది. అలాంటి సంస్థ చంద్రబాబు విజయం కోసం పనిచేస్తోందేమోనని జగన్‌ ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఎలాంటి ట్రస్ట్‌లు, సేవా సంస్థల అండ లేకుండానే చంద్రబాబు ప్రచారం నిర్వహించుకుంటున్నారు. బాబు వెనక టీడీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఆయన పిలుపు ఇస్తే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు సైతం కుప్పంలో వాలిపోయి ఆయన గెలుపు కోసం కృషిచేస్తారు. నేతలు, వారి కుటుంబాలకు చెందిన ట్రస్టులపై శూలశోధన చేయడం ద్వారా వారిని ఆత్మరక్షణలో పడేయాలన్నది సర్కారు వ్యూహంలా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

‘ట్రస్ట్‌ అంటే నమ్మకం’

’’ట్రస్ట్‌ అంటే ఒక నమ్మకం. ప్రజలకు నీతిగా సేవచేయాలన్న సంకల్పంతోనే సేవా సంస్థలను ఏర్పాటు చేసుకొన్నారు. వాటి పేరిట అక్రమాలు, అరాచకాలు చేసి ఉంటే జగన్‌ ఈపాటికే వాటిని బయటపెట్టి నానా రభస చేసేవారు. ఆ ట్రస్ట్‌ల పేరిట నేతలకు అక్రమంగా డబ్బు వస్తుందని అనుమానం ఉంటే ఈ పాటికే ఈడీనీ, ఇతర కేంద్ర సంస్థలను దింపి విచారణల పేరిట హడావుడి చేసేవారు. తమ ట్రస్ట్‌ల ద్వారా పేదలకు మంచి చేశారు, అది వారికి ఎక్కడ ఎన్నికల్లో మైలేజ్‌గా మారుతోందన్న ఆందోళన జగ న్‌లో ఉంది. అందుకే అది మెటీరియలైజ్‌ కాకుండా ఉండేందుకు , తనిఖీలు, విచారణల పేరిట ఆ సేవా సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసి, నేతలను ఆత్మ రక్షణలో పడేయాలన్నదే జగన్‌ వ్యూహంలా ఉంది’’ అని ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అభిప్రాయపడ్డారు.

Updated Date - Apr 28 , 2024 | 06:50 AM