Share News

సీఎస్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా

ABN , Publish Date - May 27 , 2024 | 04:06 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కేఎస్‌ జవహర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నానని, తాను చేసిన ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్ష విధించినా భరించేందుకు సిద్ధంగా ఉన్నానని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ స్పష్టం చేశారు.

సీఎస్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా

నా ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్ధం

అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌కే జవహర్‌రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన

సీబీఐతో విచారణ జరిపితే అన్ని ఆధారాలూ చూపిస్తా

జనసేన నేత పీతల మూర్తి యాదవ్‌ వెల్లడి

సీతంపేట (విశాఖపట్నం), మే 26: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కేఎస్‌ జవహర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నానని, తాను చేసిన ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్ష విధించినా భరించేందుకు సిద్ధంగా ఉన్నానని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ స్పష్టం చేశారు. ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. సీఎస్‌ మూడుసార్లు రహస్యంగా విశాఖ ఎందుకు రావలసి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘తన స్నేహితుడి కొడుకు వివాహానికి వచ్చానని చెబుతున్నారు. అయితే పెళ్లికి వెళ్లకుండా ఆయన అటెందుకు పర్యటించారు? భోగాపురం ఎయిర్‌పోర్టుపై ఇంత ఆత్రంగా సమీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది? రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఎన్నికల అక్రమాలపై సిట్‌ దర్యాప్తు జరుగుతోంది. ఈ సమయంలో సీఎస్‌ రహస్యంగా ఉత్తరాంధ్రలో పర్యటించడం అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లకే. ఆయన, ఆయన కుమారుడు అసైన్డ్‌ భూములు దోచుకున్న వ్యవహారంలో అన్ని ఆధారాలూ చూపించగలను. సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించే దమ్ము ఆయనకుందా? విచారణ జరిపితే ఆధారాలన్నీ చూపిస్తా. ఈ భూముల వ్యవహారంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ కూడా ఉన్నాయి. మంత్రి మేరుగు నాగార్జున ముఠా, సీఎస్‌, వైసీపీ పెద్దలు కలిసి ఉత్తరాంధ్రలోని వేల కోట్ల విలువైన భూములను ఆక్రమించడం వాస్తవం కాదా? జీవో 596 విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని లావాదేవీలపై విచారణ జరపాలి. సీఎం జగన్‌ సతీమణి భారతి పేరు చెప్పి లావాదేవీలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. త్వరలో దీని వెనుక ఉన్న తహశీల్దార్ల పేర్లు బయటపెడతా’ అని మూర్తి యాదవ్‌ ప్రకటించారు.

Updated Date - May 27 , 2024 | 04:07 AM