Share News

ఏబీవీ సస్పెన్షన్‌ కొట్టివేత

ABN , Publish Date - May 09 , 2024 | 04:03 AM

సీనియర్‌ ఐపీఎస్‌, అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు హైదరాబాద్‌లోని సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)లో భారీ ఊరట లభించింది.

ఏబీవీ సస్పెన్షన్‌ కొట్టివేత

వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్న క్యాట్‌

బకాయిలతో సహా జీతభత్యాలు చెల్లించాలని ఆదేశం

వైసీపీ ప్రభుత్వ ఉత్తర్వులు అక్రమమని తీర్పు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి భారీ ఊరట

హైదరాబాద్‌, మే 8(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ ఐపీఎస్‌, అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు హైదరాబాద్‌లోని సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)లో భారీ ఊరట లభించింది. ఆయనపై రెండోసారి సస్పెన్షన్‌ విధిస్తూ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అక్రమమని పేర్కొంటూ వాటిని కొట్టేసింది. ఆయన్ను వెంటనే సర్వీసులోకి తీసుకోవడంతోపాటు బకాయిలతో సహా జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. ఒకేరకమైన ఆరోపణలతో రెండోసారి సస్పెండ్‌ చేయడం చెల్లదని.. ఏపీ ప్రభుత్వం జారీచేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. రక్షణ పరికరాల కొనుగోళ్లలో అవినీతి అంటూ 2020 ఫిబ్రవరి 8న ఏపీ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్‌ విధించిందన్నారు. అంతుకుముందు జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలలపాటు వేతనం, పోస్టింగ్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. 33 ఏళ్లపాటు మచ్చలేని ఉద్యోగ జీవితంలో మొదటిసారి అవినీతి ఆరోపణలు సృష్టించి సస్పెండ్‌ చేశారని, ఈ సస్పెన్షన్‌ అక్రమమని ఏపీ హైకోర్టు కొట్టేసిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సైతం పిటిషనర్‌కే అనుకూలంగా తీర్పు ఇచ్చిందని.. ఆయన సస్పెన్షన్‌ చెల్లదని 2022 ఏప్రిల్‌ 22న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రెండునెలలకు(జూన్‌ 14న ) ప్రాధాన్యం లేని పోస్టింగ్‌ ఇచ్చారని తెలిపారు.

ఆ తర్వాత కేవలం 14 రోజుల్లోనే మళ్లీ రెండోసారి సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని, ఈసారి అఖిలభారత సర్వీసుల్లోని రూల్‌ 3(3)ను సాకుగా చూపారని పేర్కొన్నారు. ‘నిబంధనల ప్రకారం సస్పెన్షన్‌పై టైం టు టైం అధికారుల కమిటీ రివ్యూ చేయాల్సి ఉన్నప్పటికీ 21 నెలలుగా ఎలాంటి రివ్యూ చేయలేదు. ఏపీ ప్రభుత్వ అనైతిక విధానాలపైనా, రెండోసారి సస్పెన్షన్‌పైనా మళ్లీ క్యాట్‌ లో పిటిషన్‌ దాఖలు చేశాం. ఈ కేసును సైతం ఆలస్యం చేయడానికి ఏపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేసింది. సస్పెన్షన్‌ చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మళ్లీ అవే ఆరోపణలతో రెండోసారి సస్పెండ్‌ చేయడం చెల్లదు. సర్వీస్‌ రూల్స్‌లో పేర్కొన్న ప్రకారం రివ్యూ చేయలేదు కాబట్టి ఆ సస్పెన్షన్‌ చెల్లదు. సస్పెన్షన్‌ ఏకపక్షంగా కొనసాగించడానికి వీలుండదు’ అన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ‘ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత విధుల్లో చేరేముందు ప్రెస్‌మీట్‌ పెట్టి బెదిరించేలా మాట్లాడారు. దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారు. క్రిమినల్‌ కేసులో నిందితుడిగా ఉన్న పిటిషనర్‌పై దర్యాప్తు ముగిసే వరకు సస్పెన్షన్‌లో ఉంచే అధికారం ఉంది. మొదటిసారి రూల్‌ 3(1) కింద.. రెండోసారి రూల్‌ 3(3) కింద సస్పెండ్‌ చేశాం’ అని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న క్యాట్‌.. ఏప్రిల్‌ 29న తీర్పును రిజర్వు చేసి.. బుధవారం తుది తీర్పు వెలువరించింది.

Updated Date - May 09 , 2024 | 04:03 AM