Share News

జేఈఈలో తెలుగు విద్యార్థుల సత్తా

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:46 AM

జేఈఈ మెయిన్స్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటారు. అత్యుత్తమ మార్కులతో జాతీయస్థాయిలో మెరిశారు.

జేఈఈలో తెలుగు విద్యార్థుల సత్తా

100 పర్సంటైల్‌ సాధించిన 56 మందిలో

22 మంది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులే

15 మందిది తెలంగాణ, ఏడుగురిది ఏపీ

మహారాష్ట్ర అభ్యర్థులకు 1, 2 ర్యాంకులు

పల్నాడు అభ్యర్థి అనూప్‌కు 6వ ర్యాంకు

సిక్కోలు విద్యార్థి సతీష్‌కు 8వ ర్యాంకు

5 విభాగాల్లో 24 మంది టాపర్లూ మనోళ్లే

జనరల్‌ క్యాటగిరీలో 40 మందికి 12 మంది

ఈడబ్ల్యూఎస్‌లో టాపర్లు అందరు కూడా..

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలు విడుదల

మే 26న అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

అమరావతి/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటారు. అత్యుత్తమ మార్కులతో జాతీయస్థాయిలో మెరిశారు. ఈ నెల 4 నుం చి 12 తేదీల్లో నిర్వహించిన సెషన్‌-2(పేపర్‌-1 బీఈ, బీటెక్‌) పరీక్ష ఫలితాలను జాతీయ పరీక్షా సంస్థ(ఎన్‌టీఏ) గురువారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10.67 లక్షల మంది రాసిన ఈ పరీక్షలో 56 మంది 100 పర్సంటైల్‌ సాధించగా, వీరిలో 22 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. వీరిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. అయితే.. తొలి రెండు(1, 2) ర్యాంకులు మహారాష్ట్రకు చెందిన నిర్మల్‌కుమార్‌, సంజయ్‌ మిశ్రా దక్కించుకున్నారు. కాగా, ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో ఆరుగు రు మాత్రమే 100 పర్సంటైల్‌ సాధించారు. వీరంతా తెలుగు వారే. తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి ఇద్దరున్నారు. జనరల్‌ విభాగంలో మొత్తం 3,77,921 మంది పరీక్ష రాయగా 40 మంది 100 పర్సంటైల్‌ సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి 9, ఏపీ నుంచి ముగ్గురు.. విద్యార్థులు ఉన్నారు. ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌

(ఎన్‌సీబీ) విభాగంలో మొత్తం 10 మంది 100 పర్సంటైల్‌ సాధించగా వీరిలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు ఉన్నారు. దివ్యాంగుల విభాగంలో(పీడబ్ల్యూడీ) 3,369 మంది పరీక్ష రాయగా తెలంగాణ విద్యార్థి చుంచికల శ్రీచరణ్‌ టాపర్‌గా నిలిచాడు. ఎస్టీ విభాగంలో తెలంగాణ విద్యార్థి జగన్నాథం మోహిత్‌ ప్రథమ స్థానం సాధించాడు.


అనూ్‌పకు ఆరో ర్యాంకు

జేఈఈ మెయిన్స్‌ ఫలితాలలో పల్నాడు జిల్లా యడ్లపాడు గ్రామానికి చెందిన ముత్తవరపు అనూప్‌ ఓపెన్‌ కేటగిరిలో ఆల్‌ ఇండియా ఆరో ర్యాంకు సాధించాడు. జేఈఈ మెయిన్స్‌ రెండు విడతల ఫలితాల్లో 300/300 మార్కులు సాధించి సత్తా చాటాడు. తండ్రి రాజ్‌ కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాగా, తల్లి గృహిణి. అనూప్‌ సోదరి హర్షిత చెన్నై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది.

సిక్కోలు సతీశ్‌కు 8వ ర్యాంకు

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో సిక్కోలు కుర్రోడు సత్తా చాటాడు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీశ్‌కుమార్‌ జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. ఓబీసీలో రెండో ర్యాంకు పొందాడు. సతీశ్‌ తల్లిదండ్రులు చింతు బుచ్చెన్న, రమాదేవి ఇద్దరూ ఉపాధ్యాయులే. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు కావడమే తన లక్ష్యమని సతీశ్‌ కుమార్‌ తెలిపాడు.


100 పర్సంటైల్‌(300/300) సాధించిన ఏపీ విద్యార్థులు

చింతు సతీష్‌ కుమార్‌, షేక్‌ సూరజ్‌, మాకినేని జిష్ణు సాయి, తోటంశెట్టి నిఖిలేష్‌, అన్నరెడ్డి వెంకట తనీష్‌ రెడ్డి, తోట సాయి కార్తీక్‌, మురసాని సాయి యశ్వంత్‌ రెడ్డి

మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష మే 26న జరగనుంది. దీన్ని ఈసారి ఐఐటీ మద్రాస్‌ నిర్వహించనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు సాధించిన దాదాపు రెండున్నర లక్షల మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించారు. ఈ నెల 27 నుంచి మే 7వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్‌ 9న ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - Apr 26 , 2024 | 04:46 AM