Share News

లంచం ఇస్తేనే పరిహారం ఇస్తానన్నారు

ABN , Publish Date - Nov 07 , 2024 | 04:37 AM

పరిహారం ఇప్పించమంటే.. ఒక వైసీపీ నేత లంచం అడిగారు.. భార్యకు తెలియకుండా భూమి కబ్జా చేశారు.. రుణం ఇప్పిస్తానని టోకరా వేశారు..

లంచం ఇస్తేనే పరిహారం ఇస్తానన్నారు

రోడ్డు ఆక్రమించేశారు.. తప్పుడు రికార్డులతో భూకబ్జా చేశారు

వైసీపీ నేతలపై టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు

అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): పరిహారం ఇప్పించమంటే.. ఒక వైసీపీ నేత లంచం అడిగారు.. భార్యకు తెలియకుండా భూమి కబ్జా చేశారు.. రుణం ఇప్పిస్తానని టోకరా వేశారు..అంటూ వైసీపీ బాధితులు ప్రజాదర్బార్‌లో టీడీపీ నాయకులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు, సీడాప్‌ చైర్మన్‌ దీపక్‌రెడ్డి, తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి బుధవారం గ్రీవెన్స్‌ నిర్వహించి, అర్జీలు స్వీకరించారు. కడప-రేణిగుంట జాతీయ రహదారిలో తమ ఇళ్లు, దుకాణాలు కోల్పోయామని, న్యాయం కోసం వైసీపీ ఎమ్మెల్యేను కలిస్తే.. పరిహారం ఇప్పించకపోగా, రేణిగుంట మండల వైసీపీ నాయకుడు రూ.5 లక్షల చొప్పున డిమాండ్‌ చేశారని, తాము ఇవ్వకపోవడంతో పరిహారం రాకుండా అడ్డుకున్నారని రేణిగుంట మండలం కరకంబాడి బీసీ కాలనీకి చెందిన బాధితులు వాపోయారు. తమ కాలనీలో వైసీపీ నేత రోడ్డు ఆక్రమించి దారి లేకుండా చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి కొర్లగుంటకు చెందిన వి.రాధ కోరారు. భర్త చనిపోవడంతో తన పేరుతో ఉన్న స్థలానికి వైసీపీ నేతలు తప్పుడు రికార్డులు సృష్టించి కబ్జా చేశారని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి చెందిన డి.భారతి వాపోయారు.

Updated Date - Nov 07 , 2024 | 04:37 AM