Share News

‘బర్మా క్యాంపు’ దాడి కేసులో ట్విస్ట్‌

ABN , Publish Date - May 23 , 2024 | 03:18 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ ‘బర్మా క్యాంపు’ కేసు రాజీకి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

‘బర్మా క్యాంపు’ దాడి కేసులో ట్విస్ట్‌

కేసు రాజీకి ఓ వర్గం తీవ్ర ప్రయత్నం

గోపాలపట్నం తహసీల్దార్‌ కార్యాలయం వేదికగా చర్చలు

పాత కేసులు తిరగదోడతామని పోలీసుల బెదిరింపు?

న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు

విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ ‘బర్మా క్యాంపు’ కేసు రాజీకి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీకి ఓటు వేయలేదని కుటుంబంపై జరిగిన దాడి రాష్ట్రంలో కలకలం రేపింది. తాజాగా ఈ కేసు రాజీ చేసేందుకు గోపాలపట్నం తహసీల్దార్‌ కార్యాలయం వేదికగా ప్రయత్నాలు జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 15వ తేదీ రాత్రి విశాఖ నగరంలోని బర్మా కాలనీలో సుంకరి ధనలక్ష్మి కుటుంబంపై పొరుగునే ఉన్న మరో కుటుంబం, వారి స్నేహితులు కలిసి దాడి చేసి తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కంచరపాలెం పోలీసులు కేసు నమోదుచేశారు. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశామని వీధిలో చెప్పడం వల్లనే ఈ దాడి జరిగిందని, దాడి చేసిన వారిలో అత్యధికులు వైసీపీతో సంబంధాలు కలిగిన వారేనని బాధితులు ఆరోపించారు. ఈ కేసును ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు డిమాండ్‌ చేయడంతో పోలీసులు ఆయనపై కూడా కేసు పెట్టారు. బాధితుల ఆవేదనను ప్రచురించినందుకు, ప్రసారం చేసినందుకు ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’, ‘ఈటీవీ’పై కూడా కేసులు పెట్టారు. తమను పది మంది కలిసి తీవ్రంగా కొట్టగా కేవలం ఒక్కరినే అరెస్టు చేశారని, మిగిలిన వారిని అరెస్టు చేయలేదని, వారు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నందున తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ బాధితులు సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లి జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిని ఆధారంగా చేసుకొని రాజీ చేయాలని ఓ వర్గం ప్రయత్నం చేస్తోంది. బర్మా క్యాంపు సచివాలయం నుంచి బాధిత కుటుంబానికి మంగళవారం సాయంత్రం ఫోన్‌ వచ్చింది. జాయింట్‌ కలెక్టర్‌ విచారణకు వస్తున్నారని, గోపాపట్నం తహసీల్దార్‌ కార్యాలయానికి రావాలనేది దాని సందేశం. బుధవారం ఉదయం మరోసారి, మధ్యాహ్నం మరోసారి ఫోన్‌ చేశారు.

దాంతో బాధిత కుటుంబం గోపాలపట్నం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లింది. దాడి చేసిన పది మందీ అక్కడ వీరికి కనిపించారు. వారి తరపున ఓ వ్యక్తి ఆటో వద్దకు వచ్చి, తగిలిన దెబ్బల చికిత్సకు ఖర్చు అంతా వారు భరిస్తారని, రాజీ పడాలని, బైండోవర్‌ కేసులు రాసుకోవాలని కోరారు. అంటే ఇరువర్గాలు మళ్లీ గొడవ పడబోమని రాసివ్వాలని సూచించారు. దానికి బాధిత వర్గం నిరాకరించింది. వారిపై కేసులు కొనసాగించాలని, తాము ఉపసంహరించుకోబోమని చెప్పి వెనక్కి వచ్చేశారు. కాగా.. ఈ రాజీ ప్రయత్నం ఎవరు చేస్తున్నారో తమకు తెలియదని, తలలు బద్దలు కొట్టి, చికిత్స చేయిస్తామంటున్నారని, ఇదేనా పోలీసులు చేసే న్యాయం అంటూ ధనలక్ష్మి కుటుంబం వాపోతోంది. తనకు, కుమార్తె నూకరత్నానికి, కుమారుడు మణికంఠకు ఆరోగ్యం బాగా లేదని, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి బుధవారం వెళ్లి చికిత్స చేయించుకున్నామని తెలిపారు. దాడి చేసి తీవ్రంగా కొట్టిన వారిపై కేసులు పెట్టకుండా, పోలీసులు తిరిగి తమనే బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. పదేళ్ల క్రితం తన కుమార్తె కాలేజీ చదువుతున్నప్పుడు రౌడీలు ఆమెను వేధిస్తే అప్పుడు పోలీసు కేసు పెట్టామని, ఇప్పుడు చెప్పినట్టు వినకపోతే పాత కేసులన్నీ తిరగతోడుతామని బెదిరిస్తున్నారని ధనలక్ష్మి ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ దాడి చేసిన వారిని రక్షిస్తున్నారని, బాధితులైన తమను వేధిస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని, దాడి చేసిన వారందరినీ అరెస్టు చేయాలని కోరారు.

Updated Date - May 23 , 2024 | 08:10 AM