అవిశ్రాంత ప్రచార పథికుడు
ABN , Publish Date - May 12 , 2024 | 03:59 AM
రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా చంద్రబాబు ప్రచారం సాగింది. ఒక్క ప్రజాగళం పేరుతోనే 90 నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు,

ప్రజల్లోనే బాబు... ప్రజలతోనే చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో రికార్డు స్థాయి పర్యటనలు
గతం కంటే ఎక్కువగా సభలు, రోడ్ షోలు, సమావేశాలు
రోజుకు 3 నుంచి ఐదు సభల్లో పాల్గొన్న చంద్రబాబు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా చంద్రబాబు ప్రచారం సాగింది. ఒక్క ప్రజాగళం పేరుతోనే 90 నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. కొవిడ్ సమయంలో తప్ప ఐదేళ్లూ ప్రజల్లోనే చంద్రబాబు గడిపారు. ప్రజా సమస్యలపై పోరాటంలో ప్రతి ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యటనలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరగని పోరాటం నిర్వహించారు. పన్నులు, విద్యుత్ చార్జీల పెంపు, ధరల మంటపై రెండేళ్ల క్రితం... 2022లో ‘బాదుడే బాదుడు’ పేరుతో 19 నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. తరువాత ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పేరుతో 2023లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు నిర్వహించారు. 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్యయాత్ర చేపట్టారు. జగన్ చేసిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై 2023, ఆగస్టులో కర్నూలు నుంచి పాతపట్నం వరకు 13 జిల్లాల్లో, ఏకధాటిగా 10 రోజులపాటు పర్యటించి ప్రభుత్వాన్ని నిలదీశారు. అనంతరం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం... 2023 సెప్టెంబరు 9న ఆయనను అరెస్టు చేసింది. 53 రోజులు జైలులో పెట్టింది. బెయిల్‌పై విడుదల అయిన చంద్రబాబు మళ్లీ రోడ్డెక్కారు. మునుపటి కంటే చంద్రబాబు స్ట్రాంగ్‌గా ప్రభుత్వంపై దాడి చేశారు. 2024 జనవరి 5 నుంచి ‘రా కదలిరా’ పేరుతో 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో చంద్రబాబు భారీ సభలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో మార్చి 27 నుంచి ప్రజాగళం పేరుతో విస్తృత పర్యటనలు చేపట్టారు. తుఫాన్ల సమయంలో క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు, బాధిత ప్రజలను పరామర్శించారు. అకాల వర్షాల సమయంలో గోదావరి జిల్లాల్లో నాలుగు రోజుల పాటు బస చేసి మరీ ధాన్యం కొనుగోళ్ల కోసం పోరాటం చేశారు. రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం. ఎన్నికల ప్రచారం ముగిసే సభలు కలిపి 4 నెలల్లో 114 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటనలు పూర్తవుతాయి. చంద్రబాబు చంద్రయాన్ ముందు ప్రత్యర్థి పార్టీల ప్రచారం కొట్టుకుపోయింది.