Share News

అరాచకానికి అధికారముద్ర!

ABN , Publish Date - May 23 , 2024 | 03:28 AM

మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి సాగించిన అరాచకాలకు అధికారులు అడుగడుగునా ఒత్తాసు పలికారు.

అరాచకానికి అధికారముద్ర!

పిన్నెల్లి బ్రదర్స్‌ కళ్లల్లో ఆనందం కోసం ఖాకీల సంపూర్ణ సహకారం

టీడీపీ నేతలను స్టేషన్‌లో హింసించి లైవ్‌లో బ్రదర్స్‌కు చూపించిన ఎస్‌ఐలు

మాచర్లటౌన్‌, మే 22: మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి సాగించిన అరాచకాలకు అధికారులు అడుగడుగునా ఒత్తాసు పలికారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండడం, స్థానికంగా పిన్నెల్లి గెలవడంతో ఆయన ఆశీస్సుల కోసం పలువురు అధికారులు పిన్నెల్లి ఇంటి ముందు ఉదయం నుంచే క్యూ కట్టేవారు. ఆయన ఆశీస్సులు తమకు మెండుగా ఉండాలని కోరుకున్నారు. దీనికి అనుగుణంగానే తమకు అణిగి మణికి ఉండే అధికారులను ఏరికోరి మరీ ఇక్కడ పిన్నెల్లి పోస్టింగ్‌ వేయించారు. మాచర్ల నియోజకవర్గంలో పోస్టింగ్‌కు వచ్చిన అధికారులు ముందుగా పిన్నెల్లి సోదరులను కలిశాకే తమ బాధ్యతలు స్వీకరించేవారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అరాచకాలకు, అకృత్యాలకు వీరు వత్తాసు పలికారు. పిన్నెల్లి సోదరులు.. ప్రతిపక్ష టీడీపీకి సంబంధించి ఎవరి పేరు చెబితే వారిని స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలు పెట్టి సెల్‌ఫోన్లో వీడియోలు తీసి మరీ వారికి పంపేవారు.

అర్థరాత్రి నిద్రలేపి.. స్టేషన్‌కు తరలించి

పిన్నెల్లి సోదరులు తమ అరాచకాలను ప్రశ్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలపై తమ ఝలుం ప్రదర్శించేవారు. అర్థరాత్రి సమయంలో ప్రతిపక్ష నాయకుల ఇళ్లకు పోలీసులను పంపి వారి కుటుంబసభ్యులు చూస్తుండగానే భౌతిక దాడులు చేయించి భయబ్రాంతులకు గురి చేశారు. అంతేకాదు.. స్టేషన్‌కు ఈడ్చుకొచ్చేవారు. లాఠీలతో చితకబాది టీడీపీ నేతల ఆక్రందనలను సెల్‌ఫోన్లో పిన్నెల్లి సోదరులకు లైవ్‌లో చూపించేవారు. ఇలా పిన్నెల్లి సోదరులను సంతోషపరిచి ప్రసన్నం చేసుకున్న అధికారులు రూ.కోట్లలో సొమ్మును వెనుకేసుకున్నారు. మాచర్ల పట్టణానికి చెందిన టీడీపీ నేత అన్వర్‌ను బక్రీదు పండుగ పూట అర్థరాత్రి సమయంలో చేయని నేరానికి అక్రమ కేసులు ఇరికించి ఇబ్బందులకు గురి చేయడం ఈ కోవలోదే. ఇలా నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామంలోనూ వైసీపీ నేతలకు ఎదురు తిరిగిన ప్రతి టీడీపీ కార్యకర్తపైనా పోలీసుల పైశాచిక లాఠీ విరిగింది. మరికొందరు పిన్నెల్లి పోలీసు భక్తులు ఇంకో అడుగు ముందుకేసి టీడీపీ నేతలు ఎక్కడ కనపడితే అక్కడ పోలీసు వాహనంలో స్టేషన్‌కు ఎత్తుకొచ్చి చావ బాదేవారు. మండల కేంద్రమైన కారంపూడిలో సీఐ చినమల్లయ్య టీ తాగుతున్న టీడీపీ నేత చప్పిడి రాముకు సర్వీస్‌ రివాల్వర్‌ చూపించి బెదిరించడం సంచలనం రేకెత్తించింది.

మండలానికో రౌడీని పెట్టి...

పిన్నెల్లి సోదరులు తమ ఆధిపత్యం కొనసాగించేందుకు మండలానికో రౌడీని పురమాయించారు. మాచర్లకు తురకా కిశోర్‌, రూరల్‌కు బూడిద శ్రీను, దుర్గి మండలానికి ఊరిబండి మన్నెయ్య, రెంటచింతల మం డలానికి మోర్తాల ఉమామహేశ్వరరెడ్డి, వెల్దుర్తి మండలానికి చింతా ఆదినారాయణలనునియమించారు.

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నియోజకవర్గం ఏకగ్రీవం చేసేందుకు పిన్నెల్లి సోదరులు దౌర్జన్యాలకు దిగారు. వీరిని అడ్డుకునేందుకు, టీడీపీ తరుఫున కూడా నామినేషన్లు వేయించేందుకు పార్టీ సీనియర్‌ నేతలైన బొండా ఉమ, బుద్ధా వెంకన్న, లీగల్‌ న్యాయవాది మాచర్ల ప్రాంతానికి వచ్చారు. వీరి కారు మాచర్ల పట్టణంలోని రింగురోడ్డు సమీపంలోకి రాగానే తురకా కిశోర్‌ వారి వాహనంపై పెద్ద బాదుతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.

మాచర్ల మండలంలో బూడిద శ్రీను సాగర్‌ చెక్‌పోస్టు వద్ద పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రానైట్‌లారీలను చెక్‌పోస్టు దాటించి డబ్బులు వసూలు చేసేవాడు. అక్రమ సంపాదనకు సహకరించినందుకు శ్రీను తల్లికి ఎంపీపీ పదవిని ఇచ్చారు.


అదుపులోకి తీసుకున్నారా!?

నరసరావుపేట, మే 22: పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చూపే అవకాశం కనిపిస్తోంది. ఆయనను బుధవారం సంగారెడ్డి సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. డ్రైవర్‌తోపాటే పిన్నెల్లినీ అదుపులోకి తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని పోలీసు ఉన్నతాధికారులెవరు ధ్రువీకరించడంలేదు. మంగళవారం అర్ధరాత్రి సమయానికి కూడా పిన్నెల్లి అరెస్టు లేదా అదుపులోకి తీసుకోవడంపై ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, ఆయనను నర్సరావుపేటలో మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీతో పాటు పలువురు పోలీసు అధికారులు అర్ధరాత్రి వరకు మకాం వేసి ఉండటం గమనార్హం.

ఇవీ.. కేసులు-సెక్షన్లు!

ఎన్నికల రోజున పిన్నెల్లి సోదరులు పోలింగ్‌ కేంద్రాలు లక్ష్యంగా సృష్టించిన విధ్వంసకాండపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వెల్దుర్తి మండలంలో టీడీపీ ఏజెంట్‌ నోముల మాణిక్యంను పోలింగ్‌ కేంద్రం నుండి బయటకు రప్పించేందుకు ఆయన భార్యాపిల్లలను తీవ్రంగా హింసించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన సిట్‌ అధికారులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తోపాటు అతని అనుచరులపై 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

రెంటచింతల మండలం పాల్వాయి గేట్‌లోని 202 పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం పగలగొట్టినందుకు ఐపీసీ, ఆర్‌పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బీ సెక్షన్లు, పీడీపీపీ కింద మరో కేసు, ఆర్‌పీ చట్టంలోని 131, 135 నమోదు చేశారు.

పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ ఏజెంట్‌ నంబూరు శంకరరావుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాడి చేశారు. ఈ ఘటనలో శంకరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పిన్నెల్లిపై అదనపు సెక్షన్లు కూడా పెట్టేందుకు కోర్టులో మెమో దాఖలు చేశారు.

Updated Date - May 23 , 2024 | 03:28 AM