Share News

చిన్న పిల్లాడైతే స్కూలుకి పంపాలి

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:01 AM

‘వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు అవినాశ్‌రెడ్డి నిర్దోషి అని మీరు అంటున్నారు.

చిన్న పిల్లాడైతే స్కూలుకి పంపాలి

అవినాశ్‌ను నిర్దోషి అంటున్న జగన్‌కు వ్యవస్థలపై నమ్మకముందా?

నిందితుడని సీబీఐ తేల్చిన వ్యక్తికి మూడోసారి టికెట్టా?

ఇది మీకు తగదు.. అలా చేయకండి

అవసరమైతే నా భర్తను, ఆయన అన్ననూ అరెస్టు చేయండి

నా తండ్రి వివేకాకు మాత్రం న్యాయం చేయండి: సునీత

వివేకానందరెడ్డి హత్యపై లైవ్‌ డిబేట్‌కు సిద్ధం

మీ చానల్‌కే వస్తా.. మీరు చర్చకు సిద్ధమేనా?

సీఎం జగన్‌కు వివేకా కుమార్తె సునీత సవాల్‌

పులివెందుల రూరల్‌, ఏప్రిల్‌ 25: ‘‘వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు అవినాశ్‌రెడ్డి నిర్దోషి అని మీరు అంటున్నారు. ఇక ఏ వ్యవస్థపై మీకు నమ్మకముంది సార్‌?’’ అని సీఎం జగన్‌ను ఆయన చెల్లెలు, వివేకా కుమార్తె డాక్టరు సునీత సూటిగా ప్రశ్నించారు. పులివెందుల సభలో అవినాశ్‌రెడ్డిను జగన్‌ చిన్నపిల్లాడని సంబోధించారు. దీనిపై సునీత స్పందిస్తూ... ‘‘చిన్నపిల్లలకు పదవులు ఇవ్వరు. పిల్లలు అయితే స్కూల్‌కు వెళ్లాలి. ఎంపీ అంటే బాధ్యత.. పిల్లలకు టికెట్టు ఇవ్వరు. నిందితులను మూడోసారి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. సీబీఐ నిందితులుగా తేల్చిన వారిని ప్రోత్సహిస్తున్నారు. దయచేసి ఇలా చేయకండి’’ అని కోరారు. గురువారం సునీత పులివెందులలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘మీకోసం వివేకానందరెడ్డి ఎన్నో త్యాగాలు చేశారు. కానీ మీరేం చేశారు? ఆయన గురించి మంచిగా ఒక్కమాట కూడా మాట్లాడరు. ఆయన హత్యపై మీ చానల్‌లో లైవ్‌ డిబేట్‌ ఏర్పాటు చేయండి. నేను సిద్ధం. మీరు సిద్ధమా..?’’ అని సీఎం జగన్‌కు సునీత సవాల్‌ విసిరారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..


చంపేంత ద్వేషం చిన్నాన్నపై ఎందుకు?

‘‘పులివెందుల అంటే నమ్మకం, ధైర్యం, అభివృద్ధి అంటున్న జగన్‌.. ఆ పేరు ఈ ప్రాంతానికి రావడానికి కారణం ఎవరనేది మరిచారా అని ప్రశ్నించారు. ‘‘1978 నుంచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి పడిన కష్టం, శ్రమ పులివెందులను ఈ స్థాయిలో నిలిపాయి. వారిద్దరు జతగా పనిచేశారు. రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రస్థాయిలోను, వివేకానందరెడ్డి పులివెందుల, కడప స్థాయిలో కొన్ని దశాబ్దాలు కష్టపడి పనిచేశారు. దానివల్ల పులివెందుల తొలుత కాంగ్రెస్‌ పార్టీకి, ఇప్పుడు వైసీపీకి కంచుకోటగా తయారైంది. వివేకానందరెడ్డి ఒకానొక సమయంలో రాజశేఖర్‌రెడ్డి కోసం ఎమ్మెల్యే పదవిని, జగన్‌ కోసం ఎంపీ పదవిని త్యాగం చేశారు. అయినా.. ఎందుకు మీకు (జగన్‌ను ఉద్దేశించి) వివేకానందరెడ్డి పట్ల ద్వేషం, అసూయ, చంపేంతవరకూ వచ్చిందో అర్థం కావడం లేదు. అనునిత్యం పులివెందుల ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి అనేనా ఈ ఈర్ష్య? మీకోసం పనిచేసిన వ్యక్తి గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడరేం?’’

వ్యవస్థలంటే గౌరవం లేదా?

‘‘కోర్టులు, సీబీఐ, పోలీసులు, వ్యవస్థలు అంటే మీకు (జగన్‌ను ఉద్దేశించి) గౌరవం ఉందా? లేదా? 2019లో వివేకా చనిపోయినపుడు సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టులో జగన్‌ కేసు వేశారు. మళ్లీ ఆ కేసు విత్‌డ్రా చేసుకున్నారు. మళ్లీ మీ (జగన్‌ను ఉద్దేశించి) వాళ్లు కడపలో గ్యాగ్‌ ఆర్డర్‌ పెడతారు. ఆర్డర్‌ తెప్పించుకుంటారు. మళ్లీ మీరే మాట్లాడతారు. ‘వీళ్లు చేశారు...వీళ్లు చేయించా’రని సీబీఐ వాళ్లు చెబుతున్నా, ‘నిందితులు వీళ్లు’ అని చెబుతున్నా అవినాశ్‌రెడ్డి నిర్దోషి అని అంటున్నారు. ఏవ్యవస్థపై మీకు నమ్మకముంది సార్‌? ప్రతిపక్షాలతో చేతులు కలిపామట.! వివేకానందరెడ్డిని అతిదారుణంగా, కిరాతకంగా గొడ్డలితో నరికి నరికి చంపారు. దీనిగురించి ఐదేళ్లుగా పోరాడుతుంటే.. మీకు రాజకీయాలు కనిపిస్తున్నాయా? ఈ ఐదేళ్లు ఆయన గురించి ఎప్పుడైనా మంచిగా మాట్లాడారా? సీబీఐ నిందితులుగా పేర్కొన్న వారితో పోటీ చేయించొద్దు, వారికి ఓట్లు వేయొద్దని ప్రజలను వేడుకుంటున్నా. మిమ్మల్ని(జగన్‌ను ఉద్దేశించి) కూడా వేడుకుంటున్నా.. నిందితులకు స్థానం కల్పించకండి. ‘‘వైఎస్‌ కుమార్తె షర్మిలకు సపోర్టు చేస్తున్నా. ఎందుకంటే నా పోరాటానికి ఆమె సహకరించారు, ఆమె గెలిస్తే వివేకానందరెడ్డి కోరిక తీరుతుంది. మీ కోసం వివేకానందరెడ్డి ఎన్నో త్యాగాలు చేశారు కదా? షర్మిలకు సపోర్టు చేసి మీరూ త్యాగం చేయాలి. షర్మిల మీ చెల్లిలే కదా? నా చెల్లెలుకు సపోర్టు చేయాలని మీ కార్యకర్తలకు కూడా చెప్పండి. వివేకా హత్యపై మీ చానల్‌లో లైవ్‌ డిబేట్‌ ఏర్పాటు చేయండి. నేను సిద్ధం...మీరు సిద్ధమా?’’


అవసరమైతే నా భర్తను అరెస్టు చేయించండి

‘‘2019 మే 30న సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేశారు. సెప్టెంబరు 2, 2019లో వైఎస్‌ వర్ధంతి కార్యక్రమం పూర్తిచేసుకుని ఇక్కడకు వివేకా విగ్రహావిష్కరణకు వచ్చారు. ఆ రోజు నా భర్త రాజశేఖర్‌రెడ్డి మీద అనుమానాలు ఉన్నాయన్నారు. ‘ఎవరైనా సరే.. విచారణ జరపాల్సిందే. నేరస్థులకు శిక్ష పడాల్సిందే’ అని ఆ రోజు మా అమ్మ అన్నారు. అదంతా వదిలేసి... దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు అంటే అర్థమేమిటి? మా అమ్మ ఆనాడు అన్నారు కదా! చేసింది రాజశేఖర్‌రెడ్డి అయినాగానీ, ఆయన అన్న అయినా గానీ శిక్షించాల్సిందేనని! నాలుగున్నరేళ్ల తర్వాత కూడా మా మాట అదే. ఇంకా మీకు రెండు నెలలు టైమ్‌ ఉంది. నా భర్త అయినా సరే, ఆయన అన్న శివప్రకాశ్‌రెడ్డి అయినా సరే అరెస్టు చేయండి. ఈ దాగుడుమూతలేంటి? తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందే’’


బ్యాండ్‌ ఎయిడ్‌ తీయండి.. చీము పడుతుంది

జగన్‌కు డాక్టర్‌ సునీత సలహా

‘గులకరాయి’ ఘటన తర్వాత నుంచి సీఎం జగన్‌ నుదిటికి బ్యాండేజ్‌ పెట్టుకుని తిరుగుతున్నారు. జగన్‌ బస్సు యాత్రలో ఉండగా విజయవాడలో ఈ నెల 13వ తేదీన ఈ ఘటన జరిగింది. ఆయన తన యాత్రలో ఆ బ్యాండేజీని చూపిస్తూ మాట్లాడుతున్నారు. ఈ ఘటన జరిగి చాలా రోజులయిపోయినా, ఇప్పటికీ ఆ బ్యాండేజీతోనే సభల్లో పాల్గొంటున్నారు. డాక్టర్‌ కూడా అయిన వివేకాకుమార్తె సునీత.. దీనిపై జగన్‌కు ఒక సూచన చేశారు. ‘‘ముఖ్యమంత్రికి డాక్టర్‌గా ఒక సలహా. దెబ్బతగిలిన చోట బ్యాండ్‌ ఎయిడ్‌ పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే లోపల చీము పట్టి, సెప్టిక్‌ అయ్యే చాన్స్‌ ఉంది. బ్యాండ్‌ ఎయిడ్‌ తీసేస్తే గాయం త్వరగా మానిపోతుంది’’ అని తెలిపారు.

Updated Date - Apr 26 , 2024 | 05:01 AM