Share News

ఒక్క చాన్స్‌తో వందేళ్లకు షాక్‌!

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:11 AM

ఒక్క చాన్సు పేరుతో అధికారం పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు వందేళ్లకు సరిపోను షాక్‌ మిగిల్చారని ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ధ్వజమెత్తాయి.

ఒక్క చాన్స్‌తో వందేళ్లకు షాక్‌!

జగన్‌ ఐదేళ్ల పాలనపై ఎన్డీయే చార్జిషీటు

పాదయాత్ర, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 730.. 85 శాతం అమలే చేయలేదు

నమ్మక ద్రోహానికి ట్రేడ్‌ మార్క్‌ జగన్‌.. జనం నెత్తిన రూ.13 లక్షల కోట్ల అప్పుల గుదిబండ

ఒక్కో కుటుంబంపై పదేసి లక్షల భారం.. అమ్మ ఒడికి 13 వేలు.. నాన్న బుడ్డితో లక్ష స్వాహా

మద్యం వ్యాపారంలో లక్ష కోట్ల దోపిడీ.. ఇసుక, గనుల్లో అక్రమాలతో మరో లక్ష కోట్లు

ఈ ఐదేళ్లలో పదిసార్లు విద్యుత్‌ చార్జీల బాదుడు.. జనంపై రూ.75 వేల కోట్ల భారం

విషపూరిత మద్యంతో 30 వేల మంది మృతి.. అనారోగ్యం బారిన 35 లక్షల మంది

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ఒక్క చాన్సు పేరుతో అధికారం పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు వందేళ్లకు సరిపోను షాక్‌ మిగిల్చారని ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ధ్వజమెత్తాయి. ఆయన ఐదేళ్ల పాలనపై గురువారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీలు సంయుక్తంగా 38 పేజీల చార్జిషీటు విడుదల చేశాయి. పాలనా వైఫల్యాలపై తీవ్రస్థాయిలో దాడి చేశాయి. పాదయాత్ర, మేనిఫెస్టోలో 730 హామీలు ఇచ్చి అందులో 85 శాతం అమలు చేయలేదని మండిపడ్డాయి. అధికార పీఠంపై కూర్చుని అవినీతి, అరాచకం, విధ్వంసం, కబ్జాలు, దోపిడీలు, పన్నుల భారాలతో వారి జీవితాలను భ్రష్టు పట్టించాడని ధ్వజమెత్తాయి. ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.పదేసి లక్షల భారం పడిందని తెలిపాయి.


చార్జిషీటులో ముఖ్యాంశాలు..

అమ్మ ఒడికి జగన్‌ రూ.13 వేలు ఇచ్చి నాన్న బుడ్డితో రూ. లక్ష కొట్టేస్తున్నాడు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మందిని అనారోగ్యం పాల్జేశాడు. అందులో 30 వేల మంది ప్రాణాలు తీశాడు.

అన్న క్యాంటీన్లు, పండగ కానుకలు, చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీ, విదేశీ విద్య, ఆదరణ వంటి వందకుపైగా గత ప్రభుత్వ పథకాలను రద్దు చేశాడు.

ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాలకు వెచ్చించాల్సిన సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.లక్ష కోట్లు దారి మళ్లించాడు. నవ రత్నాలు నవ మోసాలయ్యాయి.

మద్య నిషేధం, కరెంటు చార్జీల తగ్గింపు, పాతిక లక్షల ఇళ్ల నిర్మాణం, టిడ్కో ఇళ్లకు బ్యాంక్‌ రుణాల రద్దు, సిపిఎస్‌ రద్దు, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ అమలు, రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ వంటి హామీలపై మడమ తిప్పాడు.

టీడీపీ పాలనలో నాలుగు శాతం ఉన్న నిరుద్యోగాన్ని ఏకంగా పాతిక శాతానికి పెంచాడు.

నమ్మక ద్రోహానికి జగన్‌ ట్రేడ్‌ మార్క్‌. అమరావతే రాజధాని అని నమ్మబలికి అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి దేశవ్యాప్తంగా రాష్ట్రాన్ని నవ్వుల పాల్జేశాడు.


చార్జిషీటు ఎందుకు?

ఈ చార్జిషీటు ఎందుకు వేయాల్సి వచ్చిందో మరికొన్ని వైఫల్యాలను ఒక అధ్యాయంలో ఎన్డీయే పార్టీలు వివరించాయి. ‘పదిసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై రూ.75 వేల కోట్ల భారం మోపారు. ఇసుక ధరలు 400 శాతం పెంచి భవన నిర్మాణ రంగంలో ఉన్న 40 లక్షల మంది కార్మికుల ఉపాధిని దెబ్బ తీశారు. లాండ్‌, శాండ్‌, మైన్‌, వైన్‌, గంజాయి, డ్రగ్స్‌, ఎర్ర చందనం, రేషన్‌ బియ్యంలో భయంకరమైన అవినీతి, అక్రమాలకు పాల్పడి లక్షల కోట్లు దోచుకున్నారు. 85 శాతం హామీలను తుంగలో తొక్కి మోసం చేసింది చాలక 99 శాతం హామీలు అమలు చేశామని బూటకపు ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 600 మందిని కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. బాబాయిని గొడ్డలి వేటుతో నరికి చంపిన కిరాతకులను వెనకేసుకువచ్చి కాపాడుతున్నారు. విశాఖలో రుషికొండను బోడిగుండు చేయడమే కాకుండా ఆ నగరం చుట్టుపక్కల రూ.40 వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేశారు. ఇసుక మాఫియా అక్రమాలకు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 42 మంది ప్రాణాలు కోల్పోయినా కనీస చలనం లేకుండా వ్యవహరించారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. 14 లక్షల ఎకరాల అసైన్‌మెంట్‌ భూములు స్వాహా చేశారు. లాండ్‌ టైటిలింగ్‌ చట్టం తెచ్చి రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగించారు. పరిశ్రమలపై దాడులు చేసి.. పెట్టుబడులు తరిమేసి నిరుద్యోగుల ఆశలను చిదిమేశారు. రూ.12 వేల కోట్ల మేర పంచాయతీ, పురపాలక నిధులు దారి మళ్లించారు. కోడి కత్తి డ్రామా ఆడి దళిత యువకుడిని జైలు పాల్జేశారు. గులకరాయి డ్రామా ఆడి బీసీ మైనర్‌ బాలుడిని జైల్లో పడేశారు. గ్రూప్‌-1 పరీక్షల ఫలితాలు తారుమారు చేసి యువత గొంతుకోశారు. రాష్ట్రాన్ని గంజాయి రాజధానిగా తయారు చేశారు. మహిళల వ్యక్తిత్వాలను కించపరచి గౌరవ సభను కౌరవ సభగా మార్చారు’ అని విమర్శించింది. మద్యం వ్యాపారాన్ని మొత్తం గుప్పిట్లో పెట్టుకున్న జగన్‌ ఈ ఐదేళ్లలో ఈ వ్యాపారంలో రూ.లక్ష కోట్లు అక్రమంగా దోచారని దుయ్యబట్టింది. ‘నాసి రకం మద్యం తయారీ మొదలుకొని అమ్మకాల వరకూ మొత్తం జగన్‌ కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలు, అధిక ధరలకు విక్రయాలతోపాటు ఖనిజాల అక్రమ తవ్వకాలతో జగన్‌, వైసీపీ నేతలు మరో లక్ష కోట్లు దోచేశారు’ అని విరుచుకుపడింది.


అరాచక పాలన అంతం... కూటమి పంతం

రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలనను అంతం చేయడమే ఎన్డీయే పంతమని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పేర్కొన్నారు. చార్జిషీటు విడుదల సందర్భంగా వర్ల రామయ్య, అశోక్‌ బాబు(టీడీపీ), శివశంకర్‌, పి.గౌతమ్‌(జనసేన), పేరాల శేఖర్‌రావు, లంకా దినకర్‌(బీజేపీ) మాట్లాడారు. ‘అబద్ధాలు, అసాధ్యపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్‌.. మరో అబద్ధపు మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. జగన్‌రెడ్డి అంటేనే అబద్ధాలకోరు. ముందు ఆయన పుట్టి తర్వాత అబద్ధం పుట్టింది. అలవోకగా అబద్ధాలు చె ప్పడంలో దిట్ట. మద్య నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానన్న పెద్ద మనిషి రాష్ట్రంలో మద్యం పారిస్తున్నారు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానని ఉద్యోగులను మభ్యపెట్టారు. ఏటా ఐదు లక్షల ఇళ్లు నిర్మిస్తానని భ్రమలు కల్పించారు. రాష్ట్రంలో అధికారిక టెర్రరిజాన్ని ప్రోత్సహించారు’ అని వర్ల రామయ్య విమర్శించారు. ‘జగన్‌ అమరావతే రాజధాని అని చెప్పి.. తర్వాత మాట మార్చి మూడు ముక్కలాట చేశాడు. కేంద్రం ఇచ్చిన ప్రతి పథకం నిధులను ఇతర పనులకు తరలించి ఒక్కటీ పూర్తి చేయలేదు’ అని దినకర్‌ విమర్శించారు.

Updated Date - Apr 26 , 2024 | 05:11 AM