Share News

కాపులకు పచ్చి మోసం

ABN , Publish Date - May 03 , 2024 | 02:39 AM

హామీ గాలికి కాపు కార్పొరేషన్‌కు ఏటా 2 వేల కోట్లు ఇస్తామని గత ఎన్నికల సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఈ హామీని గాలికొదిలేశారు. ఐదేళ్లలో ఖర్చు చేసింది 2 వేల కోట్లు మాత్రమే.

కాపులకు పచ్చి మోసం

సంక్షేమాన్ని విస్మరించిన జగన్‌ సర్కారు

ఏటా 2 వేల కోట్ల హామీ గాలికి

కాపు నేస్తానికి ఏటా 500 కోట్లు

ఐదేళ్లలో ఖర్చు చేసింది 2 వేల కోట్లే

చివరి విడత సాయం ఎగవేత

గతంలో ఉన్న పలు పథకాలు రద్దు

బాబు హయాంలో కార్పొరేషన్‌ కళకళ

అనేక పథకాలతో లక్షల మందికి లబ్ధి

2.11 లక్షల మందికి స్వయం ఉపాధి

1892 మంది విద్యార్థులకు విదేశీ విద్య

జగన్‌ ప్రభుత్వంలో మొత్తం మోసమే

39 వేల కోట్లు ఖర్చు చేసినట్టు గొప్పలు

అందరికీ ఇచ్చే పథకాలూ ఈ ఖాతాలోకి

హామీ గాలికి కాపు కార్పొరేషన్‌కు ఏటా 2 వేల కోట్లు ఇస్తామని గత ఎన్నికల సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఈ హామీని గాలికొదిలేశారు. ఐదేళ్లలో ఖర్చు చేసింది 2 వేల కోట్లు మాత్రమే.

టోకరాజగన్‌ సర్కారులో కాపులకు ప్రత్యేకించి ‘కాపు నేస్తం’ తప్ప ఇతర పథకాలేవీ లేవు. అందులోనూ ఈ పథకం కింద ఒక్కో మహిళకు ఏటా 15 వేలు ఇస్తామని చెప్పి.. నాలుగు విడతలు ఇచ్చి, ఐదో విడత ఎగ్గొట్టేసింది.

ఉత్తుత్తి గొప్పలు జగన్‌ ఐదేళ్ల పాలనలో కాపులకు ప్రత్యేకించి ఖర్చు చేసింది 2 వేల కోట్లే. అయితే 39 వేల కోట్లు ఖర్చు చేసినట్టు గొప్పలు చెబుతోంది. అన్ని వర్గాలకూ ఇచ్చే రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలను ఈ ఖాతాలో కలిపేసింది.

విదేశీ విద్య దూరంచంద్రబాబు హయాంలో 1,892 మంది కాపు విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థిక సాయం చేయగా.. జగన్‌ పాలనలో కనీసం 40 మందికి కూడా సాయం చేయలేదు.

గతం ఎంతో ఘనం చంద్రబాబు ప్రభుత్వం కాపులకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఏటా రూ.1000 కోట్ల నిధులు కేటాయించింది. 2,11,099 మందికి రూ.1,441 కోట్లు రాయితీగా అందజేసి స్వయం ఉపాధి కల్పించింది. ఇతర వర్గాలతో పాటు కాపులకు పలు పథకాలు అమలు చేసింది. జగన్‌ సర్కారు వచ్చాక వీటిన్నింటినీ రద్దు చేసింది.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయకుంటే..? అది.. వంచనే. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకున్నా ఇంకా ఎంతో చేశామని గొప్పలు చెబితే..? అది.. పచ్చిగా మోసం చేయడమే. కాపులకు జగన్‌ సర్కారు చేస్తున్నది ఇదే.

ఎన్నికలకు ముందు కాపులను ఉద్ధరిస్తానన్నట్టుగా హామీలు ఇచ్చిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక వాటిని గాల్లో కలిపేశారు. గతంలో ఉన్న స్వయం ఉపాధి పథకం ఎత్తేశారు.

రాయితీపై కార్లు, కుట్టు మిషన్ల శిక్షణ లాంటి పథకాల ఊసే లేదు. విద్యోన్నతికి మంగళం పాడారు. విదేశీ విద్యను చివర్లో ప్రారంభించి కఠిన నిబంధనలతో విద్యార్థులకు దూరం చేశారు. కాపు కార్పొరేషన్‌ను నామమాత్రం చేశారు. ఈ ప్రభుత్వంలో కాపులకు ప్రత్యేకించి అమలు చేస్తున్న పథకం కాపునేస్తం ఒక్కటే.

దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అయినా.. ‘మేం ఏడాదికి రూ.2 వేల కోట్లు చొప్పున ఖర్చు చేస్తామని అన్నాం. కానీ నాలుగేళ్లలోనే రూ.39,247 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని జగన్‌ సర్కారు గొప్పలకు పోయింది. కాపు కార్పొరేషన్‌కు ఏటా 2 వేల కోట్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేని జగన్‌ ప్రభుత్వం.. ఇచ్చిన హామీకి మించి నాలుగు రెట్లు ఖర్చు చేశామనడం కాపులను దగా చేయడమే!

కాపు నేస్తం తప్ప కాపులకు ప్రత్యేకించి మరో పథకం లేదు. గతంలో ఉన్న పథకాలను రద్దు చేసింది. అయినా ఇన్ని వేల కోట్లు ఖర్చు చేశామని కాపులను మభ్యపెడుతోంది. అన్ని సామాజికవర్గాలకు, అన్ని కుటుంబాలకూ వచ్చే పథకాలను తీసుకొచ్చి కాపు సంక్షేమంలో కలిపేసి అంకెల గారడీ చేస్తోంది. పెన్షన్‌, రైతు భరోసా, లా నేస్తం, నేతన్న నేస్తం, బీమా, ఆరోగ్యశ్రీ పథకాల్లో లబ్ధిపొందిన వారిలో కాపుల్ని వెతికి తీసి, అదిగో కాపు సంక్షేమం అంటూ ప్రత్యేకించి కోట్లు ఖర్చు చేస్తున్నట్టు గొప్పలు చెబుతోంది.


  • టీడీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్‌

తెలుగుదేశం ప్రభుత్వం కాపు సంక్షేమానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే 2015 నవంబరు 4న కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచీ ఏడాదికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తూ వచ్చింది. అలా దాదాపు నాలుగేళ్లలో రూ.3,100 కోట్లు ఖర్చు చేసింది. కేవలం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వదిలేయకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది.

ముఖ్యంగా స్వయం ఉపాధి పథకం ద్వారా కాపులకు ఆర్థిక స్వావలంబన చేకూర్చింది. కార్పొరేషన్‌ కొంత రాయితీ ఇచ్చి, అంతే మొత్తంలో బ్యాంకుల నుంచి రుణం ఇప్పించింది. సొంత కార్లు కొనుగోలు చేసి, తద్వారా ఉపాధి పొందేవారికి రూ.లక్ష చొప్పున రాయితీ ఇచ్చింది. కుట్టుమిషన్లలో శిక్షణ, ఇతర ఉపాధి పథకాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం రూ.28 కోట్లు ఖర్చు చేసింది.

స్వయం ఉపాధి

టీడీపీ హయాంలో

స్వయం ఉపాధి పథకం కింద టీడీపీ ప్రభుత్వం ఒక్కో కాపు లబ్ధిదారుడికి రూ.30 వేల నుంచి రూ.లక్ష రాయితీ ఇచ్చింది. మొత్తం 2,11,099 మందికి రూ.1,441 కోట్లు రాయితీగా అందజేసింది. ఈ పథకం కింద అత్యధిక స్థాయిలో లబ్ధి చేకూర్చింది. రాయితీ రుణంతో లబ్ధిదారులు కిరాణా కొట్లు, ఆటోలు, గేదెల కొనుగోలుతో పాడి ద్వారా జీవనోపాధికి పలు యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు.

వైసీపీ హయాంలో

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయం ఉపాధి పథకాన్ని రద్దు చేసింది. అసలు ఆ పథకమే దండగ అన్నట్టుగా స్వయం ఉపాధికి మంగళం పాడేసింది. దీంతో ఈ ఐదేళ్లుగా కాపులకు ఒక్కరికి కూడా స్వయం ఉపాధి రాయితీలు, రుణాలు దక్కలేదు. రాయితీలు వస్తాయని ఆశ పెట్టుకున్నవారిపై జగన్‌ ప్రభుత్వం నీళ్లు చల్లింది.జూ టీడీపీ హయాంలో

టీడీపీ హయాంలో

పేదలు విదేశాల్లో చదువుకోవాలనే కలను నెరవేర్చాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్‌ విదేశీ విద్య పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం కింద ఏ దేశం వెళ్లి చదువుకున్నా ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలు రాయితీగా ఇచ్చింది. పైగా విమాన ప్రయాణ ఖర్చులు కూడా భరించింది. ఈ పథకం అమలులో ఎక్కడా ఆంక్షలు విధించలేదు. ఉదారంగా రాయితీలు ఇచ్చింది. ఐదేళ్లలో 1892 మంది కాపు విద్యార్థులు విదేశాల్లో చదువుకుని లబ్ధి పొందారు. వారికి రూ.207 కోట్లు ఖర్చు చేసింది.

వైసీపీ హయాంలో

అన్ని పథకాల తరహాలోనే జగన్‌ ప్రభుత్వం విదేశీ విద్య పథకాన్ని కూడా రద్దు చేసింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో కౌన్సెలింగ్‌ నిర్వహించి మరీ ఈ పథకాన్ని ఎత్తేసింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా మూడేళ్లు పట్టించుకోని ప్రభుత్వం ఆ తర్వాత విదేశీ విద్యా దీవెన పేరుతో ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. కఠిన నిబంధనలతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. టాప్‌-200 యూనివర్సిటీల్లో తప్ప ఇంకెక్కడ చదివినా రాయితీ ఇవ్వబోమని స్పష్టం చేసింది. దీంతో 40 మంది కాపు విద్యార్థులు కూడా ఈ పథకంలో లబ్ధి పొందలేదు. జగన్‌ ప్రభుత్వం కారణంగా విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి

విద్య విద్యోన్నతి

టీడీపీ హయాంలో

అఖిల భారత సర్వీసులు, గ్రూప్‌ పరీక్షలు, బ్యాంకింగ్‌ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం విద్యోన్నతి అనే పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. ఆయా పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకునే విద్యార్థులకు ఫీజులను ప్రభుత్వమే చెల్లించింది. 5,708 మంది కాపు విద్యార్థులు ఈ పథకంలో శిక్షణ పొందారు. అందుకోసం ప్రభుత్వం రూ.28.63 కోట్లు ఖర్చు చేసింది. కోచింగ్‌ తీసుకున్నవారిలో అనేక మంది ఉద్యోగాలు పొందారు.

వైసీపీ హయాంలో

పోటీ పరీక్షలు రాసేవారు సొంతంగానే ఫీజులు కట్టుకోవాలంటూ ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ఎక్కడో ఎవరో శిక్షణ తీసుకుంటే ప్రభుత్వం ఎందుకు ఫీజులు కట్టాలనే ధోరణి ప్రదర్శించింది. పైగా ఈ ప్రభుత్వం అసలు ఉద్యోగాల నోటిఫికేషన్లే ఇవ్వనప్పుడు ఇక శిక్షణ ఎందుకు అనుకుందో ఏమో కానీ ఈ పథకం ఆనవాళ్లు కూడా లేకుండా చేసింది.


అంకెల గారడీ

కాపులకు ఇచ్చిన హామీని అమలు చేయకపోగా జగన్‌ ప్రభుత్వం అంకెల గారడీతో మోసం చేస్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ ఈ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.

అయితే కాపుల సంక్షేమానికి రూ.39 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతోంది. ఇతర వర్గాలతో పాటు కాపులకు ఇచ్చే పథకాలను కూడా ఈ ఖాతాలో కలిపేసింది.

ఆసరా కింద రూ.2,083 కోట్లు, అమ్మఒడి రూ.2,248 కోట్లు, చేదోడు రూ.52 కోట్లు, ఉచిత పంటల బీమా రూ.655 కోట్లు, ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.191 కోట్లు, జగనన్న తోడు రూ.7 కోట్లు, వసతి దీవెన రూ.387 కోట్లు, విద్యా దీవెన రూ.1192 కోట్లు, మత్స్యకార భరోసా రూ.2 కోట్లు, నేతన్న నేస్తం రూ.35 కోట్లు, పెన్షన్‌ కానుక రూ.7,734 కోట్లు, రైతు భరోసా రూ.4,383 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాలు రూ.105 కోట్లు, స్వయం సహాయక బృందాలకు సున్నా వడ్డీ రూ.437 కోట్లు, వాహన మిత్ర రూ.84 కోట్లు, ఆరోగ్య ఆసరా రూ.45 కోట్లు, ఆరోగ్యశ్రీ రూ.465 కోట్లు, బీమా రూ.143 కోట్లు, విదేశీ విద్య రూ.14 కోట్లు, అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చింది రూ.21 కోట్లు, కొవిడ్‌ సాయం రూ.21 కోట్లు ఇచ్చినట్టు లెక్కలు వేసింది.

ఇవి కాకుండా నాన్‌ డీబీటీ కింద మరో రూ.16,914 కోట్లు ఇచ్చినట్లు చూపించింది.

అనారోగ్యం పాలైనా సంక్షేమమా?

సంక్షేమ పథకాలు అనేవి కుటుంబాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలి. వారి కనీస అవసరాలు తీర్చే పథకాలు సంక్షేమం కిందకు రావు. దుర్భర పరిస్థితుల్లో అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలై ఆరోగ్యశ్రీ కార్డును వినియోగించుకుంటే.. దానిని సంక్షేమం కింద జగన్‌ ప్రభుత్వం చూపిస్తోంది.

సంక్షేమ లెక్కల్లో ‘అనారోగ్య సాయం’ వేసుకోవడం ఏంటని కాపు సామాజికవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అగ్రిగోల్డ్‌ స్కామ్‌లో బాధితులకు వారి డబ్బు వారికి తిరిగి ఇవ్వడం కూడా సంక్షేమమేనని ప్రభుత్వం చెబుతోంది.

ఏదైనా ప్రమాదంలో ఎవరైనా చనిపోయినపుడు ఇచ్చే పరిహారం కూడా సంక్షేమమేనట. గత ప్రభుత్వం కూడా ఇలాంటి లెక్కలు వేసి ఉంటే అప్పట్లో కూడా వేల కోట్ల సంక్షేమం కనిపించేది. కానీ గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి పథకాలను ప్రత్యేక సంక్షేమం కింద చూపించలేదు.

నేస్తం కంటే ఉపాధి మిన్న

ఈ ప్రభుత్వం కాపులకు సంబంధించి పదే పదే చెప్పుకొనే పథకం కాపునేస్తం. 45 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నారు. ఐదేళ్లలో ఒక విడత ఎగ్గొట్టి నాలుగు సార్లే ఇచ్చారు.

లబ్ధిదారులైన ఒక్కో మహిళకు రూ.60 వేలు అందాయి. గత ప్రభుత్వంలో స్వయం ఉపాధి కింద 2,11,099 మంది లబ్ధిదారులకు రూ.1441 కోట్లు ఇచ్చారు. కానీ టీడీపీ ప్రభుత్వం లెక్కలు తీసి ఇలా ప్రచారం చేసుకోలేదు.

కానీ జగన్‌ ప్రభుత్వం ఇవ్వని వాటిని కూడా ఇచ్చినట్లుగా, అందరికీ ఇచ్చినవే కాపులకు ఇచ్చి ప్రత్యేకంగా ఇచ్చినట్లుగా అంకెల గారడీ చేసింది.

నేస్తంలో ఒక విడత ఎగవేత

జగన్‌ ప్రభుత్వం కాపులకు ప్రత్యేకించి అమలు చేస్తున్న ఒకే ఒక్క పథకం కాపునేస్తం. అయితే అందులోనూ ప్రభుత్వం ఒక విడత నగదు విడుదల చేయకుండా మోసం చేసింది. ఇచ్చిన హామీ ప్రకారం ఏటా రూ.15వేల చొప్పున ఐదేళ్లలో ఐదుసార్లు ఇవ్వాలి. చివరిసారి 2023 సెప్టెంబరులో నాలుగో విడత నగదు విడుదల చేసింది. తర్వాతి ఐదో విడత నగదు వచ్చే సెప్టెంబరులో ఇస్తామని చెబుతోంది. అంటే జగన్‌ పాలనలో ఈ ఐదేళ్లలో ఇచ్చింది నాలుగు సార్లే. దానివల్ల కాపు మహిళలు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.500 కోట్లు నష్టపోయారు. ఉన్న ఒక్క పథకంలో కూడా ఈ కోతలు ఏంటంటూ మహిళలు నిలదీస్తున్నారు. ఐదేళ్లలో ఈ పథకం కింద ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చుచేసింది. ఇది తప్ప మరో కాపు సంక్షేమ పథకమే లేదు.

Updated Date - May 03 , 2024 | 02:39 AM