Share News

నిందేసి వెళ్లే ఎత్తుగడ!

ABN , Publish Date - Jan 06 , 2024 | 02:38 AM

విజయవాడ ఎంపీ కేశినేని నాని తొలినుంచి పార్టీ అధినేత చంద్రబాబును, లోకేశ్‌ను లెక్కచేయని ధోరణితో వ్యవహరించేవారు.

నిందేసి వెళ్లే ఎత్తుగడ!

చంద్రబాబు లక్ష్యంగా కేశినేని నాని వ్యాఖ్యలు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

విజయవాడ ఎంపీ కేశినేని నాని తొలినుంచి పార్టీ అధినేత చంద్రబాబును, లోకేశ్‌ను లెక్కచేయని ధోరణితో వ్యవహరించేవారు. తాజాగా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆయ న చేస్తున్న వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. విజయవాడ ఎంపీగా తాను హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని, ఢిల్లీ వెళ్లాలంటే ఒకే ఫ్లైట్‌ కాదని, ఏదో ఒక ఫ్లైట్‌ ఎక్కి వెళ్లవచ్చన్న వ్యాఖ్యలతో నాని పార్టీని వీడతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. టీడీపీ చేపట్టిన ‘రా కదలిరా’ కార్యక్రమం లో భాగంగా పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా తిరువూరులో 7వ తేదీ రెండో బహిరంగ సభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎన్టీఆర్‌ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం 3వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్లిన ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు, టీడీపీ నాయకుడు కేశినేని చిన్ని వర్గాల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ఈ ఘటనపై టీడీపీ అధిష్ఠానం దృష్టి సారించింది. వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణ, మాజీ మం త్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లను చంద్రబాబు గురువా రం నాని వద్దకు పంపారు. నానితో వారు చర్చించారు. తిరువూరు సభ సన్నాహక కమిటీలో కేశినేని చిన్ని కూ డా ఉంటారని, ఎంపీ నాని సభ నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు ఈ ముగ్గురు తెలిపారు. వీరు నానిని తిరువూరు సభకు ఆహ్వానించినప్పుడు.. తాను సభకు రానని, తాను అక్కడికి వస్తే గొడవ లు జరుగుతాయని ఆయన వారికి తెలిపారు. ఇదే విషయాన్ని వారు టీడీపీ అధిష్ఠానానికి తెలియజేశారు. అయితే ఈ కమిటీతో జరిగిన చర్చల సారాంశాన్ని వక్రీకరిస్తూ శుక్రవారం ఉదయం నాని ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. తనకు టికెట్‌ ఇవ్వడం లేదని, సభకు హాజరుకావద్దని చంద్రబాబు.....కమిటీ సభ్యులద్వారా తెలియజేశారంటూ నాని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కమిటీ సభ్యులు తప్పుపడుతున్నారు. నానికి కాకుండా వేరొకరికి విజయవాడ ఎంపీ టికెట్‌ ఇస్తారన్న ప్రస్తావన కానీ, తిరువూరు సభకు నానిని రావద్దని చెప్పడం కానీ ఈ చర్చల్లో ఎక్కడా జరగలేదని కొనకళ్ల నారాయణ తెలిపారు. మరోవైపు శుక్రవారం ఉదయం ఫేస్‌బుక్‌ పోస్టులో చంద్రబాబు ఆదేశాలు పాటిస్తానని చెప్పిన నాని, గంటల వ్య వధిలోనే మాట మార్చి విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్‌ సాధిస్తానని పేర్కొనడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు ఆయన పార్టీని వీడుతున్నారన్న సంకేతాలను పంపుతున్నాయి.

పొంతన లేని వాదన...

ఎంపీ కేశినేని నాని ధోరణి చంద్రబాబుపై నింద వేసి పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరహాలో ఉందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని, పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్దేశ పూర్వకంగానే ఆయన ఇలా చేస్తున్నారని అంటున్నాయి.

Updated Date - Jan 06 , 2024 | 02:38 AM