Share News

ఊరికి ఉపకారియట!

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:13 AM

కళ్లు ఆర్పకుండా అబద్ధాలాడే కళను విజయనగరం జిల్లా పర్యటనలో సైతం సీఎం జగన్‌ ప్రదర్శించారు. 130 సార్లు బటన్‌ నొక్కానని సీఎం అన్నప్పుడు, తమకు ఇంకా రూ.18,750 పడలేదని కొంతమంది పెద్దగా అరవడం వినిపించింది.

ఊరికి ఉపకారియట!

రైతు బాంధవున్ని అన్నట్టు బిల్డప్‌

ధాన్యంపై గద్దల్లా దళారులు

కానీ, వారితోనే రైతులకు ‘మద్దతు’ అట!

విజయనగరం బస్సుయాత్రలో సీఎం జగన్‌ అబద్ధాల తీరు ఇదీ

విజయనగరం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కళ్లు ఆర్పకుండా అబద్ధాలాడే కళను విజయనగరం జిల్లా పర్యటనలో సైతం సీఎం జగన్‌ ప్రదర్శించారు. 130 సార్లు బటన్‌ నొక్కానని సీఎం అన్నప్పుడు, తమకు ఇంకా రూ.18,750 పడలేదని కొంతమంది పెద్దగా అరవడం వినిపించింది. మంగళవారం సాయంత్రం విజయనగరం జిల్లాలోకి జగన్‌ బస్సు యాత్ర ప్రవేశించింది. చెల్లూరు వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని ఏకరువు పెట్టారు. నిజానికి, గ్రామాలు అభివృద్ధి చెందకుండా చేసిన ఘనత జగన్‌దే. పంచాయతీలకు మంజూరైన నిధులు, కేంద్రం అందించే నిధులు సైతం పక్కదారి పట్టించి గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా చేశారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా చేశారు. కానీ తమ హయాంలో గ్రామాభివృద్ధి పరుగులు తీస్తోందంటూ అబద్ధాలు వల్లించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు పెట్టామనీ, రైతులకు భారీగా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పుకొచ్చారు. అయితే.. రైతులకు అందించాల్సిన వైఎస్సార్‌ జలసిరి, సూక్ష్మవ్యవసాయ రాయితీలు, యాంత్రీకరణ రాయితీలు ఎత్తివేసిన విషయం కావాలనే విస్మరించారు. రైతులు పండించే ధాన్యం కొనుగోలు బాధ్యతను దళారులకే అప్పగించి మద్దతు ధర కల్పించామనేది మరో అబద్ధం. కానీ, ఆరుకిలోలు అదనంగా దళారులు తూకం వేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు విమర్శిస్తున్నారు. తమ హయాంలో పక్కా ఇళ్లను నిర్మించినట్టు చెప్పుకొచ్చారు. కానీ జగనన్న కాలనీల్లో ఎక్కడ చూసినా మొండి గోడలు, ఖాళీ స్థలాలే కన్పిస్తున్నాయి. జగన్‌ తమ అభ్యర్థులను పరిచయం చేస్తూ సౌమ్యులు.. మంచివారు.. మనస్సు వెన్న... అంటూ సంబోధించారు. జిల్లాలో భూ కుంభకోణాలు, ఇసుక మాఫియా, సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నవారిని ఆయన పరిచయం చేసిన తీరు సభికులను విస్మయపరిచింది. స్థానిక సమస్యలు ఒక్కటీ ప్రస్తావించకపోవడంతో స్థానికులు నిరాశ చెందారు. జగన్‌ సభ కోసం వందలాది ఆర్టీసీ బస్సులు తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Apr 24 , 2024 | 03:13 AM