Share News

వజ్రాలు పొదిగిన బంగారు వాచ్‌!

ABN , Publish Date - Jan 24 , 2024 | 03:50 AM

డబ్బుతో కొడితే ఎవరైనా పడిపోతారు! చివరికి, న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్‌ చేసేయొచ్చు!’’... ఇదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నమ్మే సిద్ధాంతం! కానీ..

వజ్రాలు పొదిగిన బంగారు వాచ్‌!

కీలక జడ్జికి సీఎం జగన్‌ పంపిన రూ.2 కోట్ల ‘కానుక’

దూతలుగా టీటీడీ ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి

‘డబ్బుతో కొడితే ఎవరైనా పడిపోతారు! చివరికి, న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్‌ చేసేయొచ్చు!’’... ఇదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నమ్మే సిద్ధాంతం! కానీ... అన్నిసార్లూ డబ్బు పని చేయదు. నిజాయితీ, నిబద్ధత ఉన్న వాళ్ల ముందు అస్సలు పని చేయదు. ఒక కీలక న్యాయమూర్తిని ‘ఖరీదైన బహుమతి’తో మంచి చేసుకునేందుకు జగన్‌ శిబిరం చేసిన ప్రయత్నం ఆలస్యంగా బయటికి వచ్చింది. ఈ అంశం ఇప్పుడు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏం జరిగిందో మీరే చదవండి..

కసిరి తిట్టి, విసిరి కొట్టిన న్యాయమూర్తి

2021 నాటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి

ఉత్తరాదిలో జడ్జి కుటుంబ సభ్యుడి వివాహం

‘పిలవని పేరంటానికి’ ఽధర్మారెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి

గెస్ట్‌ హౌస్‌లో జడ్జిని కలిసి ప్రలోభాల వల

‘ఏమిటీ నాన్సెన్స్‌’ అంటూ తిట్టిన జడ్జి

జగన్‌ ఎత్తుగడలపై న్యాయవాద వర్గాల్లో చర్చ

(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కీలకమైన న్యాయమూర్తి కుటుంబ సభ్యుడి వివాహం... ఉత్తరాదిలోని ఒక రాష్ట్రంలో జరిగింది. అది... 2021, కరోనా కాలం! దీంతో హంగూఆర్భాటాలకు దూరంగా, అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఆ వివాహం జరిగింది. అయితే... ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరు ‘అనుకోని అతిథులు’ కూడా హాజరయ్యారు. వారిలో ఒకరు... వైసీపీ రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి. ఇంకొకరు... టీటీడీలో ‘ఆల్‌ ఇన్‌ వన్‌’గా వ్యవహరించే ధర్మారెడ్డి! పిలవని పేరంటానికి వచ్చిన వీళ్లను చూసి ఆ న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. వివాహం తర్వాత ఆయన సమీపంలోని ఒక అతిథి గృహంలోకి వెళ్తుండగా... ఆయనతోపాటే వీరూ ప్రవేశించారు. టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డితో పరిచయం ఉండటం, ఆయనతోపాటు వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి రాజ్యసభ సభ్యుడు కావడంతో సదరు న్యాయమూర్తి వారిని లోపలికి ఆహ్వానించారు. అసలు వీళ్లెందుకు వచ్చారు అనుకుంటుండగానే... వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఒక గిఫ్ట్‌ బాక్స్‌లో నుంచి ధగధగలాడే వస్తువు ఒకటి బయటికి తీశారు. అది... వజ్రాలు పొదిగిన బంగారు రిస్ట్‌ వాచ్‌! ఆ బ్రాండెడ్‌ వాచ్‌ విలువ సుమారు రూ.2 కోట్లు! ‘తీసుకోండి సర్‌...’ అంటూ దానిని జడ్జి ముందుంచారు. అదిచూడగానే... ఆ న్యాయమూర్తి షాక్‌కు గురయ్యారు. అంతకుముందు తనకు ఎప్పుడూ ఎదురుకాని ఈ అనుభవంతో కొన్ని క్షణాలపాటు ఆయన మైండ్‌ బ్లాంక్‌ అయింది. వెంటనే తేరుకుని... కన్నెర్ర చేశారు. ఆ కానుకను వాళ్లవైపునకే విసురుగా తోసేశారు. ‘ఏమిటీ నాన్సెన్స్‌. అసలేం జరుగుతోంది. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అని పరుష పదజాలంతో కేకలు వేశారు. దీంతో... వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ధర్మారెడ్డి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.

ఇలా బయటికి వచ్చింది...

ఆ న్యాయమూర్తికి జగన్‌ వ్యవహార శైలి, ఆయన వెంటాడే తీరు బాగా తెలుసు! దీంతోపాటు, తన బాధ్యతగా మొత్తం విషయాన్ని లేఖ రూపంలో అప్పుడే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం... ఈ వ్యవహారంపై నిఘా వర్గాలతో విచారణ జరిపించాల్సి ఉంటుంది. అయితే... ఆ విషయం అంతటితో ముగిసేలా జగన్‌ మేనేజ్‌ చేసినట్లు సమాచారం. ఆ న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు రాసిన లేఖ గురించి ఇప్పుడు చర్చ మొదలవడంతో ఈ మొత్తం అంశం వెలుగులోకి వచ్చింది.

తొలినుంచీ న్యాయవ్యవస్థపై కన్ను...

తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్రమాలు, అవినీతికి పాల్పడి... పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని, విచారణ ఎదుర్కొంటున్న జగన్‌ మొదటి నుంచీ న్యాయవ్యవస్థపై కన్నేశారు. అంతకుముందు కూడా ఒక జడ్జిని ఇలాగే ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. కేసుల విచారణలో తనకు ఉపయోగపడిన, పడుతున్న వారిని ఎప్పటికప్పుడు ఏదోఒక రూపంలో సంతృప్తి పరుస్తూనే ఉన్నారు. దీనికోసం ఆయన కొందరు వ్యక్తులను వాడుకుంటారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎలా ‘ఫీల్డ్‌’లో దించాలో జగన్‌కు బాగా తెలుసునంటారు. అలాంటి వాళ్లను ఏదో ఒక పదవిలో కూర్చోబెడతారు. అవసరమైనప్పుడు వారిని తన అవసరాలకోసం రంగంలోకి దించుతారు. ధర్మారెడ్డి ‘పాత్ర’ అలాంటిదే! తిరుమల వెంకన్నపై సామాన్యుల నుంచి వీవీవీవీఐపీల దాకా అందరికీ అచంచలమైన భక్తి! తన పదవిపరంగా ఎంత పవర్‌ఫుల్‌ వ్యక్తి అయినా... తిరుమలకు వస్తే ధర్మారెడ్డిని అనివార్యంగానైనా కలవాల్సిందే. ఆ విధంగా ఆయన అందరికీ పరిచయం! కానీ... ఆయనది ఖరీదైన గిఫ్టులు ఇచ్చే స్థాయి కాదు. అందుకు... వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిలాంటి వారిని ఉపయోగిస్తారు. పరిచయంతో మాట కలిపేందుకు ధర్మారెడ్డి, ప్రలోభాల కానుకలు అందించేందుకు మరొకరు! ఇదీ... జగన్‌ స్కీమింగ్‌! నిబద్ధత కలిగిన ఆ న్యాయమూర్తిని ‘మంచి’ చేసుకునేందుకు కూడా ధర్మారెడ్డినే ప్రయోగించారు.

చివరగా: మూడేళ్లకుపైబడి సర్వీసు ఉన్న హైకోర్టు న్యాయమూర్తులపై జగన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం! వీరు భవిష్యత్తులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులయ్యే అవకాశం ఉంటుంది. వీరిని ‘మంచి’ చేసుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నట్లు న్యాయవాద వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ తన కేసుల కోసమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Updated Date - Jan 24 , 2024 | 03:50 AM