CM Jagan: వైసీపీ.. కుటుంబ కథా చిత్రమ్!
ABN , Publish Date - Jan 12 , 2024 | 04:24 AM
వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఇన్‌చార్జుల మూడో జాబితా ఎట్టకేలకు విడుదలైంది. ఆరు లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌చార్జులను ఖరారు చేస్తూ గురువారం రాత్రి వైసీపీ ప్రకటన విడుదల చేసింది.

వైసీపీకి అభ్యర్థులు దొరక్క ఒకే కుటుంబంలో పలువురికి సీట్లు
బొత్స కుటుంబానికి జాక్‌పాట్
భార్య, మేనల్లుడికి రెండు ఎంపీ సీట్లు
మంత్రి సురేశ్, సోదరుడూ అసెంబ్లీ బరికి
కారుమూరి కొడుక్కి ఏలూరు లోక్‌సభ
6 ఎంపీ, 15 అసెంబ్లీ పేర్లతో జాబితా
పార్థసారథికి మొండిచేయి
పెనమలూరులో మంత్రి జోగి
రాయదుర్గానికి గోవిందరెడ్డి
దర్శిలో బూచేపల్లికి మళ్లీ చాన్సు
చిత్తూరుకు విజయానందరెడ్డి
ఎంపీ గురుమూర్తికి సత్యవేడు
మంత్రి జయరాం కర్నూలు లోక్‌సభకు
రాజంపేట అసెంబ్లీకి ఆకేపాటి పోటీ
రోజంతా సీఎం జగన్ కసరత్తు
అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఇన్‌చార్జుల మూడో జాబితా ఎట్టకేలకు విడుదలైంది. ఆరు లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌చార్జులను ఖరారు చేస్తూ గురువారం రాత్రి వైసీపీ ప్రకటన విడుదల చేసింది. అయితే ఆ పార్టీకి అభ్యర్థులు దొరక్క ఒకే కుటుంబంలో రెండేసి టికెట్లు ఇచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మిని విశాఖ లోక్‌సభ స్థానానికి, ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును విజయనగరం ఎంపీ స్థానానికి ఇన్‌చార్జులుగా నియమించారు. కుటుంబం నుంచి ఒక్కరికే అవకాశమని చెబుతూ వచ్చిన జగన్.. అభ్యర్థుల కొరత కారణంగా దీనిని పక్కనపెట్టారు. అలాగే కొండపిలో పోటీచేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేశ్ సోదరుడు సతీశ్‌కు కర్నూలు జిల్లా కోడుమూరు (ఎస్సీ) టికెట్ లభించింది. తాజా జాబితాలో తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు(ఎస్సీ) అసెంబ్లీ స్థానానికి పంపారు. అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి లోక్‌సభ ఇన్‌చార్జి అయ్యారు. అలాగే గతంలో శ్రీకాకుళం లోక్‌సభకు పోటీచేసిన దువ్వాడ శ్రీనివా్‌సను టెక్కలి అసెంబ్లీకి.. టెక్కలి అసెంబ్లీకి పోటీ చేసిన పేరాడ తిలక్‌ను శ్రీకాకుళం లోక్‌సభకు ఇన్‌చార్జులుగా నియమించారు. ఏలూరులో ఎంపీ కోటగిరి శ్రీధర్ పోటీకి నిరాసక్తత చూపడంతో.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌కు చాన్సిచ్చారు. ఇక టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి అక్కడే టికెట్ ఇచ్చారు. ఇంతకాలం వైసీపీలో కొనసాగుతున్న పొట్లూరి వరప్రసాదరావును పక్కనపెట్టి.. ఇంకా అధికారికంగా పార్టీ కండువా కూడా కప్పుకోని నానికి అవకాశమిచ్చారు. కర్నూలు లో బీసీ నేత సంజీవ్‌కుమార్‌కు అనుకున్నట్లుగానే మొండిచేయి చూపారు. అక్కడ మంత్రి గుమ్మనూరు జయరాంను ఇన్‌చార్జిగా నియమించారు.
పార్థసారథి అవుట్..
మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో మంత్రి జోగి రమేశ్‌ను ఇన్‌చార్జిగా ప్రకటించారు. పెడనలో మంత్రి ఓటమి ఖాయమని సర్వే నివేదికలు చెప్పడంతో.. ఆయన్ను పెనమలూరుకు బదిలీ చేశారు. పార్థసారథి కూడా ఓడిపోతారని సర్వేల్లో తేలడంతో ఈ దఫా ఆయన్ను మచిలీపట్నం లోక్‌సభ బరిలోకి దించాలని జగన్ తొలుత నిర్ణయించారు. ఆయన్ను తాడేపల్లి పిలిచి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. పెనమలూరు తప్ప ఇంకెక్కడా పోటీచేయనని ప్రకటించినా జగన్ లెక్కచేయలేదు. ఇక చింతలపూడి (ఎస్సీ) ఎమ్మెల్యే ఎలీజాకు హ్యాండిచ్చారు. ఆయన స్థానంలో కంభం విజయరాజుకు అవకాశమిచ్చారు. రాయదుర్గంలో తొలి నుంచి జగన్‌ను నమ్ముకున్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కాదని.. ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డికి అవకాశం ఇచ్చారు. రాజంపేటలో సిటింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని కాదని.. ఎంపీ మిధున్‌రెడ్డి సిఫారసు చేసిన ఆకేపాటి అమర్‌నాథరెడ్డికి అవకాశం కల్పించారు. చిత్తూరులో ఆర్టీసీ చైర్మన్ విజయానందరెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారు. సిటింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులుకు నిరాకరించారు.
కుటుంబ కథాచిత్రమ్
వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. వైసీపీ మూడో జాబితా కుటుంబ కథా చిత్రమ్‌గా మార్చేశారు. మంత్రి బొత్స ఇప్పటికే చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య గజపతి నగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. బొత్స బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరికి మళ్లీ టికెట్లు ఖాయమేనంటున్నారు. మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, విజయనగరం జిలా పరిషత్ చైర్మన్‌గానూ కొనసాగుతున్నారు. ఇక్కడ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను కాదని మజ్జికి తాజాగా అవకాశమిచ్చారు. విశాఖపట్నం ఎంపీగా బొత్స భార్య ఝాన్సీలక్ష్మికి అవకాశం కల్పించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను కొండపి ఇన్‌చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సోదరుడు సతీశ్‌ను కోడుమూరు(ఎస్సీ) ఇన్‌చార్జిగా నియమించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్‌కు ఏలూరు లోక్‌సభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు మిఽథున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా, పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ముగ్గురికీ టికెట్లు దాదాపు ఖాయ మే. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట నుంచి ఆయన సోదరుడు కృష్ణదాస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
పైకి ధీమా.. లోలోన డైలమాలో!
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా దున్నేస్తామని.. 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధిస్తామంటూ నేతలతో అంతర్గత సంభాషణల్లో జగన్ ధీమాగా చెబుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 92 మంది ఎమ్మెల్యేలను మార్చేస్తానని అన్నారు. అయితే సిటింగ్‌ల తిరుగుబాట్లు, వారు ఇతర పార్టీల వైపు చూస్తుండడంతో.. పూర్తి డైలమాలో పడిపోయారు. 175 స్థానాలకు ఒకేసారి ఇన్‌చార్జులను ప్రకటిస్తామని.. విపక్షాలకు అవకాశమే ఇవ్వకుండా ప్రచార రంగంలోకి దూకుదామని పార్టీ నేతలకు చెప్పిన ఆయన.. మూడు విడతల్లో 50 మంది అసెంబ్లీ ఇన్‌చార్జులను, పది మంది లోక్‌సభ ఇన్‌చార్జులను మాత్రమే నియమించగలిగారు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి తదితరులతో మంతనాలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు సిటింగ్‌లు, ఆశావహులు తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు. గురువారం ఎమ్మెల్యేలు బిజేంద్రరెడ్డి(ఆళ్లగడ్డ) చిర్ల జగ్గిరెడ్డి(కొత్తపేట), జక్కంపూడి రాజా(రాజానగరం), కాసు మహేశ్‌రెడ్డి(గురజాల), నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(కోవూరు), అదీ్‌పరాజ్(పెందుర్తి), పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (మాచర్ల), గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(నరసరావుపేట), కిలివేటి సంజీవయ్య(సూ ళ్లూరుపేట), చెట్టి ఫాల్గుణ(అరకు), ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తాడేపల్లి ప్యాలె్‌సకు వచ్చారు. మంత్రులు కారుమూరు, జోగి రమేశ్ కూడా సీఎంవోకు వచ్చి చర్చించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుకు ఈసారి టికెట్ ఇవ్వకూడదనే ఆలోచనతో ఎమ్మెల్యేలు కాసు మహేశ్‌రెడ్డి, పిన్నె ల్లి, గోపిరెడ్డిల అభిప్రాయాలు తెలుసుకున్నారు. లావుకు ఇవ్వడమే మంచిదని పిన్నెల్లి, గోపిరెడ్డి సూచించినా.. రాష్ట్ర విద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగార్జున యాదవ్‌కు ఇస్తే బాగుంటుందని జగన్ అనుకుంటున్నట్లు తెలిసింది.