Share News

ఒక్కొక్కరి నెత్తిన రూ.10 లక్షల అప్పు

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:57 AM

జగన్‌ పుణ్యమా అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి నెత్తిమీద రూ.10 లక్షల అప్పు ఉంది. దాన్ని మీరే తీర్చాలి’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

ఒక్కొక్కరి నెత్తిన రూ.10 లక్షల అప్పు

చిత్తూరు, బంగారుపాళ్యం సభల్లో బాలకృష్ణ

చిత్తూరు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ పుణ్యమా అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి నెత్తిమీద రూ.10 లక్షల అప్పు ఉంది. దాన్ని మీరే తీర్చాలి’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కావాలా? విధ్వంసం కావాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా సోమవారం ఆయన చిత్తూరు, బంగారుపాళ్యంలో పర్యటించారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థులు గురజాల జగన్మోహన్‌, మురళీమోహన్‌ను గెలిపించాలని కోరారు. ‘రాష్ట్రం విడిపోయినప్పుడు కట్టుబట్టలతో వచ్చాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఈసారి జగన్‌ను గెలిపిస్తే మళ్లీ కట్టుబట్టలతో రాష్ట్రాన్ని వదలాల్సి వస్తుంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమిని ఎదుర్కొనే శక్తి ఎవ్వరికీ లేదు. టీడీపీ రాయలసీమ కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి బీటలు వారిన బీడు భూములను సస్యశ్యామలం చేస్తే, వీళ్లేమో ముఠా కక్షలను పెంచి పోషించి అదే కాలువల్లో రక్తం పారిస్తున్నారు. ఎస్సీల కోసం టీడీపీ 25 పథకాలను అమలు చేస్తే.. వైసీపీ వాటన్నింటినీ రద్దు చేసింది. ముస్లింల కోసం టీడీపీ అమలు చేసిన పథకాలను కూడా రద్దు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటినీ తిరిగి అమలు చేస్తాం. ముస్లింలను, ఎస్సీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం’ అని బాలకృష్ణ అన్నారు. వైసీపీ మేనిఫెస్టో సంక్షేమ మేనేఫెస్టోలాగా లేదని, రాజీనామా లేఖలా ఉందని బాలకృష్ణ ఎద్దేవా చేశారు. ‘మాట తప్పనంటూ మంట పెట్టేశాడు.. మడమ తిప్పనంటూ మెడలు విరిచేశాడు.. జగనన్న అంటూ జలగలా పీడిస్తున్నాడు.. మావయ్యనంటూ మనోభావాలను తగలబెట్టేశాడు. అవ్వా తాతల నోటికాడ బువ్వను లాగేసుకున్నాడు. పేదల అన్నపానీయాలను మద్యం వ్యాపారంలో పోసేశాడు. దళితులకు అండగా ఉంటానంటూ వారి చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు.’ అని ధ్వజమెత్తారు.

Updated Date - Apr 30 , 2024 | 03:57 AM