Share News

వేల కోట్ల దోపిడీకి చెక్‌

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:47 AM

రాష్ట్రంలో చోటుచేసుకోబోతున్న మరో భారీ దోపిడీకి హైకోర్టు చెక్‌పెట్టింది. ప్రభుత్వ పెద్దలకు అస్మదీయుడైన ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీకి బీచ్‌శాండ్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వడానికి సంకల్పించిన వ్యూహాన్ని న్యాయస్థానం ప్రస్తుతానికి అడ్డుకుంది.

వేల కోట్ల దోపిడీకి చెక్‌

గార, భీమిలిలో బీచ్‌శాండ్‌ మినరల్స్‌ కాంట్రాక్టుకు బ్రేక్‌

టెండర్లు ఓకే.. బిడ్లు ఖరారు చేయొద్దు

బీచ్‌శాండ్‌ మైనింగ్‌పై హైకోర్టు ఆదేశం

ప్రైవేటు మైనింగ్‌పై 2019లోనే నిషేధం

డెవలపర్‌ పేరిట దొడ్డిదారిన ప్రైవేటుకు

కట్టబెట్టాలనుకున్న జగన్‌ సర్కారు

హైకోర్టు చర్యలతో నిలిచిన కాంట్రాక్ట్‌

మూడు కంపెనీల నుంచి బిడ్‌లు

అందులో అస్మదీయ కంపెనీ ఒకటి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో చోటుచేసుకోబోతున్న మరో భారీ దోపిడీకి హైకోర్టు చెక్‌పెట్టింది. ప్రభుత్వ పెద్దలకు అస్మదీయుడైన ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీకి బీచ్‌శాండ్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వడానికి సంకల్పించిన వ్యూహాన్ని న్యాయస్థానం ప్రస్తుతానికి అడ్డుకుంది. బీచ్‌శాండ్‌ టెండర్ల ఖరారును నిలిపివేస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ విషయంపై అధికారుల్లో అయోమయం నెలకొంది. కాస్తోకూస్తో కాదు.. ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా విలువైన బీచ్‌శాండ్‌ మినరల్స్‌ తవ్వకం పనులను కేంద్ర చట్టాలను ధిక్కరించి మరీ అదానీకి డెవలపర్‌ పేరిట దొడ్డిదారిలో అప్పగించేందకు జగన్‌ సర్కారు వ్యూహాలు పన్నింది. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఇదివరకే వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే, ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వం తన ఇష్టానుసారంగా టెండర్లు పిలిచింది. అస్మదీయ అదానీ కంపెనీ సహా మరో రెండు ప్రైవే టు సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అయితే, ఇదే సమయంలో ప్రజాప్రయోజన వాజ్యం(పిల్‌) రూపంలో తన ముందుకొచ్చిన పిటిషన్‌పై హైకోర్టు సత్వరమే స్పందించింది. టెండర్ల ఖరారును నిలిపివేయాలని ఆదేశించింది. అసలు బీచ్‌శాండ్‌ అంటే ఏమిటి? వాటిని మైనింగ్‌ చేయడం ద్వారా వచ్చే విలువ ఎంత? అదానీకి అప్పగించేందుకు జగన్‌ వ్యూహం ఏమిటో కాస్తా లోతుగా పరిశీలిస్తే అసలు విషయాలు తెలుస్తాయి.

బీచ్‌శాండ్‌ అంటే..

బీచ్‌శాండ్‌ అంటే.. సముద్రపు ఒడ్డున ఉండే నాణ్యమైన ఇసుక. ఇందులో ఆరు రకాల ఖనిజాలు ఉంటాయి. 1. ఇలిమినైట్‌. 2. రుటైల్‌, 3. జిర్కాన్‌, 4. గార్నెట్‌, 5. మోనజైట్‌, 6. సిలిమినైట్‌. వీటిని సాంకేతికంగా హై మినరల్స్‌గా పరిగణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్‌ ఉంది. అన్నింటికంటే మోనజైట్‌కు ఎక్కువ డిమాండ్‌, విలువ కూడా ఉన్నాయి. దీనికి అణుదార్మికతను కలిగించే థోరియం శక్తి ఉంటుంది. థోరియంను అణువిద్యుత్‌ కోసం, ఇతర అణుధార్మిక శక్తుల సృష్టికి ఉపయోగిస్తారు. ఇంకా అణుబాంబు తయారీలోనూ ఇది కీలకపాత్ర పోషిస్తోంది.

రెండు చోట్ల బీచ్‌ మినరల్స్‌

రాష్ట్రంలో 900 కిలో మీటర్ల సముద్రతీరం ఉంది. ఇందులో శ్రీకాకుళం జిల్లా గారమండలం, విశాఖ జిల్లా భీమిలిలోని వెయ్యి హెక్టార్ల పరిధిలో బీచ్‌శాండ్‌ మినరల్స్‌ ఉన్నాయి. 1994-1995 మధ్య కేంద్ర ప్రభుత్వ అణుశక్తి విభాగం పరిధిలోని అటామిక్‌ మినరల్స్‌ డివిజన్‌ గార, భీమిలి మండలాల్లోని బీచ్‌శాండ్‌లో ఉన్న హెవీ మినరల్స్‌పై సమగ్ర అధ్యయనం చేసింది. ఆ నివేదిక ప్రకారం శ్రీకాకుళం జిల్లాలోనే 89,457 కోట్ల రూపాయల విలువైన మినరల్స్‌ ఉన్నాయి. విశాఖ జిల్లా బీమిలీ మండలంలోని తీరప్రాంతంలో 8,583 కోట్ల రూపాయల విలువైన హెవీ మినరల్స్‌ ఉన్నాయని తేల్చింది. వీటిపై మరింత అధ్యయనం, పరిశీలన చేయాలని ఆ నివేదిక పేర్కొంది. ఇది 1994-95లో జరిగిన సర్వే లెక్క. మరి ఇప్పుడు 30 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. వాటి ధర ఎంతగా పెరిగి ఉంటుందో అంచనావేయడం కష్టం. పైగా, ఈ మినరల్స్‌ దేశ అంతర్గత భద్రత, ప్రాజెక్టులకు అవసరమని కేంద్రం గుర్తించింది.

2019లోనే నిషేధం

బీచ్‌శాండ్‌లోని అటామిక్‌ మినరల్స్‌, ఇతర ఖనిజాల అవసరం దేశానికి ఎంతో అవసరమని కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో 2019లో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు కంపెనీలు బీచ్‌శాండ్‌ మైనింగ్‌ చేయడానికి వీల్లేదని నిషేధం విధించింది. ఈ మేరకు 2019, మార్చి 1న ప్రైవేటు మైనింగ్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వంలోని మైనింగ్‌ విభాగం డైరెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. బీచ్‌శాండ్‌ మైనింగ్‌ కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి పరిధిలోని విభాగాలే చేయాలని కేంద్ర గనుల శాఖ జాయింట్‌ సెక్రెటరీ 2019 మార్చి 1న ఆదేశాలు ఇచ్చారు.

అదానీ కన్ను

ఏపీలోని జగన్‌ సర్కారు వ్యాపార వేత్త అదానీకి సకల మేళ్లు చేసిపెడుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ బీచ్‌శాండ్‌ మైనింగ్‌ కూడా తనకు ఇవ్వాలని కోరారు. అంతే, డెవలపర్‌ పేరిట టెండర్‌లు పిలిచారు. ఏపీ బీచ్‌శాండ్‌పై ముందుగానే కన్నేసిన సంస్థ కేంద్రం విధించిన నిషేధం అమల్లో ఉండగానే రెండు కీలకమైన కంపెనీలను ఏర్పాటు చేసింది. ఏపీ కేంద్రంగా అల్లువియల్‌ హెవీ మినరల్స్‌ లిమిటెడ్‌, ఒడిశా కేంద్రంగా పూరీ నేచురల్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్‌లను నెలకొల్పింది. ఈ రెండింటి వివరాలను 2022లోనే అదానీ గ్రూప్‌ ముంబై స్టాక్‌ ఎక్చేంజ్‌కి తెలిపింది.

దొడ్డిదారిలో డెవలపర్‌

ఎంఎండీఆర్‌ చట్టం ప్రకారం బీచ్‌శాండ్‌ మైనింగ్‌ చేస్తే ఏపీఎండీసీనే చేపట్టాలి. ఆ సంస్థకు అంత శక్తియుక్తులు లేవనుకుంటే జాయింట్‌ వెంచర్‌ కింద ప్రైవేటు సంస్థతో కలిపిచేయాలి. అప్పుడు ప్రాజెక్టులో ఏపీఎండీసీకి 74ు వాటా, ప్రైవేటు సంస్థకు 26ు వాటా ఉంటుంది. అందులోనూ మోనోజైట్‌ ఖనిజాన్ని ప్రైవేటు సంస్థ తవ్వి అమ్ముకోకూడదు. దాన్ని ఏపీఎండీసీకే అప్పగించాలి. కేంద్ర అణుశక్తి శాఖ సూచనల మేరకే ఆ ఖనిజంపై నిర్ణయాలు ఉంటాయి. అయితే, దీనికి విరుద్ధంగా ఏ పనిచేసినా అది చట్ట ఉల్లంఘన కిందకే వస్తోంది. తెలిసి తెలిసి ఎవరైనా చట్ట ఉల్లంఘనకుపాల్పడితే అది దేశభద్రతకు ముప్పు తీసుకొచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అయితే, జగన్‌ సర్కారుకు అదానీ కోరిక ముందు చట్టం, రూల్స్‌, నిబంధనలు పెద్ద విషయాలుగా కనిపించలేదు. ఎలాగైనా అదానీకి అప్పగించే ఉద్దేశంతో పెద్ద మాస్టర్‌ప్లాన్‌ వేశారు. మైనింగ్‌ ప్రైవేటుకు అప్పగిస్తున్నట్లుగా కాకుండా, ‘మైనింగ్‌ ఏరియా డెవలపర్‌ కమ్‌ ఆపరేటర్‌’ పేరిట ఆ సంస్థకు ఇద్దామనుకుని టెండర్లు పిలిచారు.

రంగంలోకి 3 కంపెనీలు

బీచ్‌శాండ్‌ మినరల్స్‌ డెవలపర్‌ ఎంపిక పేరిట పిలిచిన టెండర్లలో మూడు కంపెనీలు బిడ్లు దాఖలు చేసినట్లు తెలిసింది. వీటిలో అస్మదీయ అదానీకి సంబంధించిన కంపెనీ ఒకటి ఉన్నట్లు తెలిసింది. మిగిలిన రెండు ప్రైవేటు సంస్థలు ఉత్తరాదివేనని సమాచారం. నిజానికి సాంకేతిక బిడ్‌లను తెరచి కంపెనీల వివరాలను ఏపీఎండీసీ బుధవారమే ప్రకటించాల్సి ఉంది. అయితే, సరిగ్గా అదే సమయంలో టెండర్లను ఖరారు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ టెండర్లలో తెరవెనక బాగోతాలు నడిపిన అధికారుల గుండెల్లో దడ మొదలైంది. దీనిపై స్పందించేందుకు గనుల శాఖ అధికారి నిరాకరించారు.

బిడ్లు ఖరారు చేయొద్దు: హైకోర్టు

బీచ్‌శాండ్‌ మైనింగ్‌ కార్యకలాపాలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే విషయంలో టెండర్‌ ప్రక్రియను కొనసాగించవచ్చని అయితే బిడ్లు ఖరారు చేయవద్దని ఏపీఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న కేంద్ర గనులశాఖ కార్యదర్శి, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, అణుధార్మిక మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఏపీ కోస్టల్‌జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ మెంబర్‌ సెక్రెటరీ, రాష్ట్ర మైనింగ్‌శాఖ కార్యదర్శి, ఏపీఎండీసీ సీఎండీకి నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌. రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా భీమిలి, శ్రీకాకుళంజిల్లా గార పరిధిలో అణుధార్మిక బీచ్‌శాండ్‌ తవ్వకాలకు ప్రాజెక్ట్‌ డెవలపర్‌, ఆపరేటర్‌ ఎంపికకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ గత ఏడాది డిసెంబరు 14న జారీ చేసిన టెండర్‌ను సవాల్‌ చేస్తూ విశాఖపట్నానికి చెందిన జమ్మిశెట్టి వెంకట సత్యనారాయణమూర్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది అంబటి సుధాకర్‌ వాదనలు వినిపిస్తూ.. అణుధార్మిక శక్తి ఉన్న బీచ్‌శాండ్‌ మైనింగ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెండర్‌ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు దీన్ని అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బీచ్‌శాండ్‌ మైనింగ్‌కు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించే అధికారం మాత్రమే ఏపీఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. టెండర్‌ ప్రక్రియను నిలువరించాలని అభ్యర్థించారు. ఏపీఎండీసీ తరఫున న్యాయవాది వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ.. టెండర్‌ ప్రక్రియ ప్రాధమిక దశలోనే ఉందన్నారు. ఇప్పటికిప్పుడు బిడ్లు ఖరారు చేయడం సాధ్యపడదన్నారు. ఆయా ప్రైవేటు సంస్థలు ఏపీఎండీసీకి సహాయకారులుగా మాత్రమే వ్యవహరిస్తాయని తెలిపారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని అభ్యర్ధించారు. ఇరు పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. టెండర్‌ డాక్యుమెంట్‌ను పరిశీలిస్తే మైనింగ్‌ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్లు అర్ధం అవుతోందని వ్యాఖ్యానించింది.

Updated Date - Jan 11 , 2024 | 03:47 AM